Revised Common Lectionary (Semicontinuous)
104 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు.
మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు.
2 ఒక వ్యక్తి నిలువుపాటి అంగీ ధరించినట్లుగా నీవు వెలుగును ధరిస్తావు.
ఆకాశాలను నీవు తెరగా పరుస్తావు.
3 దేవా, వాటికి పైగా నీవు నీ ఇంటిని నిర్మించావు.
దట్టమైన మేఘాలను నీవు నీ రథంగా ఉపయోగిస్తావు.
గాలి రెక్కల మీద నీవు ఆకాశంలో ప్రయాణం చేస్తావు.
4 దేవా, నీ దూతలను నీవు గాలిలా చేశావు.
నీ సేవకులను అగ్నిలా చేశావు.
5 దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు.
కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు.
6 దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పివేశావు.
నీళ్లు పర్వతాలను కప్పివేశాయి.
7 కాని నీవు ఆజ్ఞ ఇవ్వగానే, నీళ్లు వేగంగా వెళ్లిపోయాయి.
దేవా, నీవు నీళ్లతో చెప్పగానే నీళ్లు వెంటనే వెళ్లిపోయాయి.
8 పర్వతాలనుండి లోయల్లోనికి, ఆ తరువాత
నీవు వాటికోసం చేసిన స్థలాల్లోకి నీళ్లు ప్రవహించాయి.
9 సముద్రానికి నీవు హద్దులు నియమించావు.
నీళ్లు భూమిని కప్పివేసేట్టుగా మరల ఎన్నటికీ ఉప్పొంగవు.
24 యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు.
భూమి నీ కార్యాలతో నిండిపోయింది.
నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.
35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక.
దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
యెహోవాను స్తుతించు!
36 ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు.
2 “యోబూ, నాతో ఇంకొంచెం ఓపికగా ఉండు.
దేవుని పరంగా చెప్పాల్సింది ఇంకా ఉందని నేను నీకు చూపిస్తాను.
3 నా జ్ఞానాన్ని అందరితోనూ పంచుకొంటాను.
దేవుడు నన్ను సృష్టించాడు. దేవుడు న్యాయంగల వాడని నేను రుజువు చేస్తాను.
4 యోబూ, నేను చెప్పేది ప్రతీదీ సత్యం.
నేను చెబుతున్నదేమిటో తెలిసే చెబుతున్నాను.
5 “దేవుడు శక్తివంతమైనవాడు,
కానీ ఆయన మనుష్యులను ద్వేషించడు.
దేవుడు మహత్తర శక్తిమంతుడు,
ఆయన సంకల్పాలు ఆయనకు ఉన్నాయి.
6 దుర్మార్గులను దేవుడు బ్రతుకనివ్వడు.
పేద ప్రజలకు దేవుడు ఎల్లప్పుడు న్యాయం జరిగిస్తాడు.
7 ఏది సరైనదో, దాన్ని చేసే ప్రజల విషయం దేవుడు శ్రద్ధ చూపిస్తాడు.
మంచి వాళ్లను ఆయన పాలకులుగా ఉండనిస్తాడు.
మంచి వాళ్లకు దేవుడు శాశ్వతమైన ఘనత ఇస్తాడు.
8 కానీ మనుష్యులు శిక్షించబడుతూ
సంకెళ్లతో ఉంటే ఒకవేళ మనుష్యులు శ్రమపడతూ, కష్టాలు అనుభవిస్తోంటే,
9 వారు చేసిన తప్పు ఏమిటో ఆయన వారికి చెబుతాడు.
వారు పాపం చేశారని, వారు అతిశయించారని దేవుడు వారికి చెబుతాడు.
10 దేవుడు వాళ్ల చెవులు వినేలా తెరుస్తాడు.
వారు పాపం చేయటం చాలించాలని ఆయన వారికి ఆజ్ఞ ఇస్తాడు.
11 ఆ మనుష్యులు దేవుని మాట విని ఆయనకు విధేయులైతే,
దేవుడు వారిని విజయవంతమైన ఆనంద జీవితాన్ని జీవింపనిస్తాడు.
12 కానీ ఆ మనుష్యులు దేవునికి విధేయులయ్యేందుకు నిరాకరిస్తే వారు మృతుల లోకంలో చేరిపోతారు.
ఏది నిజమైన జ్ఞానమో తెలియకుండా వాళ్లు (మూర్ఖులుగా) చనిపోతారు.
13 “దేవుని గూర్చి లక్ష్యపెట్టని మనుష్యులు ఎల్లప్పుడూ కక్షతో ఉంటారు.
దేవుడు వారిని శిక్షించినప్పటికీ, వారు సహాయం కోసం దేవుణ్ణి ప్రార్థించ నిరాకరిస్తారు.
14 ఆ మనుష్యులు ఇంకా యవ్వనంలో ఉండగానే మరణిస్తారు.
మగ వ్యభిచారులతోబాటు వారుకూడా అవమానంతో మరణిస్తారు.
15 కానీ శ్రమ పడుతున్న మనుష్యులను దేవుడు వారి కష్టాల్లోనుంచి రక్షిస్తాడు.
మనుష్యులు మేల్కొని దేవుని మాట వినేలా ఆయన ఆ కష్టాలను ప్రయోగిస్తాడు.
16 “యోబూ, దేవుడు నీ మీద దయ చూపించి,
నీ కష్టాల నుండి నిన్ను బయటకు రప్పించి నీకు సహాయం చేయాలని కోరుతున్నాడు.
దేవుడు నీకు క్షేమకరమైన స్థలం ఇవ్వాలనీ నీ బల్లమీద సమృద్ధిగా భోజనం ఉంచాలనీ కోరుతున్నాడు.
7 దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి. 8 మూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు. 9 యూదులు కానివాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను.
నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.”(A)
10 మరొక చోట:
“యూదులు కాని ప్రజలారా!
మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.”(B)
11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది:
“యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి.
ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!”(C)
12 యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు:
“యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది.
ఆయన దేశాలను పాలిస్తాడు.
యూదులు కానివాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.”(D)
13 రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.
© 1997 Bible League International