Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 39

సంగీత నాయకునికి, యెదూతూనునకు: దావీదు కీర్తన.

39 “నేను జాగ్రత్తగా నడచుకొంటాను.
    నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను.
    నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.[a]

మాట్లాడుటకు నేను తిరస్కరించాను.
    నేనేమి చెప్పలేదు.
    కాని నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
నాకు కోపం వచ్చింది.
    దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది.
    కనుక నేను ఏదో అన్నాను.

యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము.
    నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము.
    నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
యెహోవా, నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు.
    నా జీవితం నీ ఎదుట శూన్యం.
ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.

మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబింబం వంటిది.
    మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము.
    కాని ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.

కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది?
    నీవే నా ఆశ.
యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు.
    దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
నేను నా నోరు తెరవను.
    నేను ఏమీ చెప్పను.
    యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
10 దేవా, నన్ను శిక్షించటం మానివేయుము.
    నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
11 యెహోవా, తప్పు చేసినవారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు.
    వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు.
    మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.

12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
    నేను నీకు మొరపెట్టే మాటలు వినుము.
    నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు.
నేను దాటిపోతున్న ఒక అతిథిని.
    నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
13 యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.

యోబు 32

ఎలీహు తన వాదాన్ని పెంచటం

32 అప్పుడు యోబు స్నేహితులు ముగ్గురూ యోబుకు జవాబు ఇచ్చే ప్రయత్నం విరమించుకొన్నారు. యోబు తన మట్టుకు తాను నిర్దోషినని అనుకోవడం చేత వారు విరమించుకొన్నారు. ఎలీహు అనే పేరు గల ఒకతను అక్కడ ఉన్నాడు. ఎలీహు బరకెయేలు కుమారుడు. బరకెయేలు బూజు సంతతి వాడు. ఎలీహు రాము వంశస్థుడు. ఎలీహు యోబు మీద చాలా కోపగించాడు. ఎందుకంటే యోబు తన మట్టుకు తానే మంచివాడినని చెప్పుకొంటున్నాడు. మరియు యోబు తాను దేవునికంటే నీతిమంతుణ్ణి అని చెబుతున్నాడు. కాబట్టి ఎలీహు యోబు స్నేహితుల మీద కూడా కోపగించాడు. ఎందుకంటే యోబు స్నేహితులు ముగ్గురూ యోబు ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక యోబుదే తప్పు అని రుజువు చేయలేకపోయారు. అక్కడ ఉన్న వారిలో ఎలీహు చాలా చిన్నవాడు. కనుక ప్రతి ఒక్కరూ మాట్లాడటం అయ్యేంత వరకు అతడు వేచి ఉన్నాడు. అప్పుడు అతడు మాట్లాడటం ప్రారంభించవచ్చు అని అనుకొన్నాడు. యోబు స్నేహితులు ముగ్గురూ చెప్పాల్సింది ఇంక ఏమీలేదని ఎలీహు చూచినప్పుడు అతనికి కోపం వచ్చింది. కనుక ఎలీహు మాట్లాడటం ప్రారంభించాడు. అతడు ఇలా అన్నాడు:

“నేను చిన్నవాడిని. మీరు పెద్దవాళ్లు.
    అందుకే నేను అనుకొంటున్నది ఏమిటో మీతో చెప్పాడానికి భయపడుతున్నాను.
‘పెద్దవాళ్లు ముందుగా మాట్లాడాలి.
    చాలా సంవత్సరాలు బ్రతికిన మనుష్యులు తమ జ్ఞానాన్ని పంచి ఇవ్వాలి’ అని నాలో నేను అనుకొన్నాను.
కాని ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ, సర్వశక్తిమంతుడైన దేవుని ‘ఊపిరి’
    ఆ వ్యక్తికి జ్ఞానం ప్రసాదిస్తుంది.
వృద్ధులు మాత్రమే జ్ఞానం గల మనుష్యులు కారు.
    వయస్సు పైబడిన వాళ్లు మాత్రమే సరియైన అవగాహన గలవారు కారు.

10 “అందువల్లనే ఎలీహు అనే నేను నా మాట వినమని చెబుతున్నాను.
    నేను తలచేదేమిటో కూడా నేను మీతో చెబుతాను.
11 మీరు మాట్లాడుతూ ఉన్నంతసేపూ నేను సహనంతో వేచి ఉన్నాను.
    మీరు యోబుకు చెప్పిన జవాబులు నేను విన్నాను.
12 మీరు తెలివిగల మాటలతో యోబుకు జవాబు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నంతసేపూ నేను శ్రద్ధగా విన్నాను.
    కాని యోబుదే తప్పు అని మీరు ముగ్గురూ రుజువు చేయలేదు.
    యోబు వాదాలకు మీలో ఒక్కరూ జవాబు చెప్పలేదు.
13 మీరు ముగ్గురూ జ్ఞానం కనుగొన్నట్టు చెప్పలేరు.
    యోబు వాదాలకు దేవుడే జవాబు చెప్పాలి కాని మనుష్యులు కాదు.
14 కాని యోబు నాతో వాదించలేదు.
    అందుచేత మీరు ముగ్గురూ ప్రయోగించిన వాదాలను నేను ఉపయోగించను.

15 “యోబూ, నీ ముగ్గురు స్నేహితులూ ఇబ్బంది పడిపోతున్నారు.
    వారు చెప్పాల్సింది ఇంక ఏమీ లేదు.
    వారి వద్ద జవాబులు ఇంకేమీ లేవు.
16 ఈ ముగ్గురు మనుష్యులూ మౌనంగా ఉన్నారు,
    అక్కడే నిలబడ్డారు, జవాబు ఏమీ లేదు.
    కనుక నేను ఇంకా వేచి ఉండాలా?
17 లేదు! నేను కూడా నా జవాబు చెబుతాను.
    నేను తలుస్తున్నది కూడ నీతో చెబుతాను.
18 ఎందుకంటే, నేను చెప్పాల్సింది చాలా ఉంది.
    నాలో ఉన్న ఆత్మ నన్ను మాట్లాడమని బలవంతం చేస్తోంది.
19 కొద్ది సేపట్లో పొర్లిపోయే ద్రాక్షారసంలా నా అంతరంగంలో నేను ఉన్నాను.
    త్వరలో పగిలిపోబోతున్న కొత్త ద్రాక్షా తిత్తిలా నేను ఉన్నాను.
20 కనుక నేను మాట్లాడాలి. అప్పుడు నాకు బాగుంటుంది.
    నేను నా పెదాలు తెరచి యోబు ఆరోపణలకు జవాబు చెప్పాలి.
21 ఈ వాదంలో నేను ఎవరి పక్షమూ వహించను.
    నేను ఎవరినీ పొగడను. నేనేమి చెప్పాలో దానిని చెబుతాను.
22 ఒక మనిషిని ఎలా పొగడాలో నాకు తెలియదు.
    ఒకరిని ఎలా పొగడాలో నాకు తెలిసి ఉంటే వెంటనే దేవుడు నన్ను శిక్షిస్తాడు.

లూకా 16:19-31

ధనవంతుడు, లాజరు

19 “ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు మంచి విలువైన దుస్తులు వేసుకొని ప్రతిరోజు భోగాలనుభవిస్తూ జీవించేవాడు. 20 అతని గడప ముందు లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటినిండా కురుపులు ఉండేవి. కుక్కులు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి. 21 అతడాధనికుని బల్లమీద నుండి పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశతో అక్కడ పడి ఉండేవాడు.

22 “ఆ భిక్షగాడు చనిపొయ్యాడు. అతణ్ణి దేవదూతలు తీసుకువెళ్ళి అబ్రాహాము ప్రక్కన కూర్చుండబెట్టారు. ఆ తర్వాత ఆ ధనికుడు కూడా చనిపొయ్యాడు. అతడు సమాధి చెయ్యబడ్డాడు. 23 నరకంలో ఆ ధనికుడు హింసలు అనుభవిస్తూవుండేవాడు. తలెత్తి చూడగా లాజరును తన ప్రక్కన కూర్చోబెట్టుకున్న అబ్రాహాము కనిపించాడు. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. 24 అందువల్ల అబ్రాహామును పిలిచి, ‘తండ్రి అబ్రాహామా! నామీద దయ చూపు. నేను ఈ మంటల్లో తీవ్రంగా బాధపడ్తున్నాను. లాజరుతో ఇక్కడకు వచ్చి తన వేలుముంచి నా నాలుక తడపమని చెప్పండి’ అని అన్నాడు.

25 “కాని అబ్రాహాము, ‘కుమారుడా! జ్ఞాపకం తెచ్చుకో! నీవు బ్రతికిన రోజుల్లో సుఖాలనుభవించావు. లాజరు కష్టాలనుభవించాడు. కాని అతడిక్కడ ఆనందంగా ఉన్నాడు. నీవు బాధలను అనుభవిస్తున్నావు. 26 ఇక్కడి వాళ్ళు అక్కడకు రాకూడదని, అక్కడివాళ్ళు యిక్కడికి రాకూడదని మన మధ్య పెద్ద అఘాతం ఉంది’ అని అన్నాడు.

27 “ఆ ధనికుడు అలాగైతే ‘తండ్రి! లాజరును మా తండ్రి ఇంటికి పంపు. 28 అక్కడ నా ఐదుగురు సోదరులున్నారు. వాళ్ళు యిక్కడకు వచ్చి హింసలు అనుభవించకుండా ఉండేటట్లు వాళ్ళకు బోధించుమని చెప్పు’ అని అన్నాడు.

29 “అబ్రాహాము ఈ విధంగా సమాధానం చెప్పాడు: ‘మోషే, ప్రవక్తలు ఉన్నారు కదా! వాళ్ళు చెప్పినట్లు చెయ్యనీ!’

30 “‘తండ్రీ అబ్రాహామా! చనిపోయిన వాళ్ళనుండి ఎవరైనా వెళ్తే వాళ్ళు విని మారుమనస్సు పొందుతారు’ అని ఆ ధనికుడు అన్నాడు.

31 “అబ్రాహాము, ‘వాళ్ళు మోషే, ప్రవక్తలు చెప్పినట్లు విననట్లైతే చనిపోయినవాడు బ్రతికి వచ్చినా వాళ్ళు వినరు’ అని అన్నాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International