Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి, యెదూతూనునకు: దావీదు కీర్తన.
39 “నేను జాగ్రత్తగా నడచుకొంటాను.
నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను.
నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.[a]
2 మాట్లాడుటకు నేను తిరస్కరించాను.
నేనేమి చెప్పలేదు.
కాని నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
3 నాకు కోపం వచ్చింది.
దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది.
కనుక నేను ఏదో అన్నాను.
4 యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము.
నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము.
నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
5 యెహోవా, నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు.
నా జీవితం నీ ఎదుట శూన్యం.
ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.
6 మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబింబం వంటిది.
మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము.
కాని ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.
7 కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది?
నీవే నా ఆశ.
8 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు.
దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
9 నేను నా నోరు తెరవను.
నేను ఏమీ చెప్పను.
యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
10 దేవా, నన్ను శిక్షించటం మానివేయుము.
నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
11 యెహోవా, తప్పు చేసినవారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు.
వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు.
మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.
12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
నేను నీకు మొరపెట్టే మాటలు వినుము.
నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు.
నేను దాటిపోతున్న ఒక అతిథిని.
నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
13 యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.
12 “అయితే మనిషికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది?
గ్రహించటం ఎలా అనేది నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
13 జ్ఞానం చాలా అమూల్యమయిందని మనుష్యులు గ్రహించరు.
భూమి మీద నివసించే మనుష్యులకు జ్ఞానం లేదు.
14 ‘జ్ఞానం నాలో లేదు’ అని అగాధ మహాసముద్రం అంటుంది.
‘జ్ఞానం నా దగ్గరా లేదు’ అని సముద్రం అంటుంది.
15 అతి ఖరీదైన బంగారంతో జ్ఞానం కొనలేము.
జ్ఞానం ఖరీదు వెండితో లెక్క కట్టబడజాలదు.
16 ఓఫీరు బంగారంతో గాని, విలువైన గోమేధికంతోగాని,
నీలంతో గాని, అది కొనబడేది కాదు.
17 బంగారం, స్ఫటికం కంటే జ్ఞానం విలువైనది.
బంగారంతో చేయబడిన చాలా ఖరీదైన నగలతో జ్ఞానం కొనబడజాలదు.
18 జ్ఞానం పగడాలకంటె, పచ్చలకంటె విలువగలది.
జ్ఞానం కెంపులకంటె ఖరీదైనది.
19 ఇథియోపియా (కూషు)దేశపు పుష్యరాగం జ్ఞానం కంటె విలువైనది కాదు.
మేలిమి బంగారంతో మీరు జ్ఞానమును కొనలేరు.
20 “అలాగైతే జ్ఞానం కనుగొనాలంటే మనం ఎక్కడికి వెళ్లాలి?
అవగాహన చేసికోవటం నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
21 భూమి మీద ప్రతి మనిషి నుండీ జ్ఞానం దాచబడింది.
ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా జ్ఞానాన్ని చూడలేవు.
22 ‘మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే విన్నాం’
అని మరణం, నాశనం చెబుతాయి.
23 “కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు.
జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు.
24 భూదిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు గనుక ఆయనకు జ్ఞానం తెలుసు.
ఆకాశాల క్రింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు.
25 గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు,
మహా సముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన నిర్ణయించినప్పుడు,
26 వర్షాన్ని ఎక్కడ కురిపించాలి,
ఉరుములు తుఫానులు ఎటువైపుగా వెళ్లాలి అని దేవుడు నిర్ణయించినప్పుడు
27 అది దేవుడు జ్ఞానాన్ని చూచిన సమయం, జ్ఞానం యొక్క విలువ ఎంతో చూచేందుకు
దానిని పరీక్షించిన సమయం అవుతుంది.
జ్ఞానాన్ని దేవుడు నిర్ధారణ చేశాడు.
28 ‘యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించటం జ్ఞానం అవుతుంది.
చెడు సంగతుల నుండి తప్పుకోవటం అవగాహన అవుతుంది’”
అని దేవుడు ప్రజలతో చెప్పాడు.
యోబు తన మాటలు కొనసాగించటం
29 యోబు మాట్లాడటం కొనసాగించాడు. యోబు ఇలా అన్నాడు:
2 “దేవుడు నన్ను కాపాడి, నా విషయం జాగ్రత్త తీసుకొన్న ఇటీవలి మాసాల్లో ఉన్నట్టుగానే
నా జీవితం ఉంటే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
3 నేను చీకటిలో నడచినప్పుడు నాకు వెలుగు ఇచ్చుటకు నా తలమీద దేవుని వెలుగు ప్రకాశించే సమయం వస్తే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
(నేను జీవించవలసిన సరియైన మార్గాన్ని దేవుడు నాకు చూపించాడు).
4 నా జీవితం ఎంతో విజయవంతంగా ఉండి దేవుడు నాకు సన్నిహితమైన స్నేహితునిగా ఉండే రోజుల కోసం నేను ఆశిస్తున్నాను.
అవి దేవుడు నా ఇంటిని ఆశీర్వదించిన రోజులు.
5 సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకా నాతో ఉండగా
నా పిల్లలు నా దగ్గర ఉన్న సమయం కోసం నేను ఆశిస్తున్నాను.
6 అది నా జీవితం ఎంతో బాగున్నప్పటి మాట.
నా మార్గం అంతా మీగడతో నిండిపోయినట్టు, నా కోసం ఒలీవ నూనెను నదులుగా ప్రవహించి నట్టు అది కనబడింది.
7 “నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి పట్టణ పెద్దలతో కలిసి
ఆరుబయట కూర్చున్న రోజులు అవి.
8 అక్కడ ప్రజలంతా నన్ను గౌరవించేవారు. యువకులు నన్ను చూచినప్పుడు పక్కకు తప్పుకొనేవారు.
పెద్దలు నా యెడల గౌరవ సూచకంగా లేచి నిలబడేవారు.
9 ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం నిలిపివేసి
నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరులను నిశ్శబ్దంగా ఉంచటానికి).
10 చాలా ప్రముఖ నాయకులు కూడా, నేను వారిని సమీపించినప్పుడు వారి స్వరాలు తగ్గించేవారు.
అవును వారి నాలుకలు వారి అంగిట అంటుకొని పోయినట్లు కనిపించేది.
ఏడవ ముద్ర
8 ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో అరగంటదాకా నిశ్శబ్దంగా ఉండెను. 2 దేవుని ముందు నిలబడి ఉన్న ఆ ఏడుగురు దేవదూతల్ని చూసాను. వాళ్ళకు ఏడు బూరలు యివ్వబడ్డాయి.
3 బంగారు ధూపార్తి పట్టుకొన్న మరొక దూత వచ్చి ధూప వేదిక ముందు నిలుచున్నాడు. సింహాసనం ముందున్న ధూప వేదికలో ధూపం వేయటానికి అతనికి ఎన్నో ధూపద్రవ్యాలు యివ్వబడ్డాయి. పవిత్రుల ప్రార్థనలతో ధూపం వేయబడింది. 4 దూత వేసిన సుగంధ ధూపము, పవిత్రుల ప్రార్థనలతో పాటు దేవునికి అందింది. 5 దూత ధూపార్తిని తీసుకొని ధూప వేదికలో ఉన్న నిప్పు అందులో ఉంచి దాన్ని భూమ్మీదకు విసిరివేసాడు. దాంతో ఉరుములు, పెద్దగర్జనలు, మెరుపులు, భూకంపాలు కలిగాయి.
© 1997 Bible League International