Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: అయ్యలెత్ షహరు రాగం. దావీదు కీర్తన.
22 నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు?
నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
2 నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను.
కాని నీవు నాకు జవాబు ఇవ్వలేదు.
మరియు నేను రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను.
3 దేవా, నీవు పవిత్రుడవు.
నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహాసనం.
4 మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు.
అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు.
5 మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువుల నుంచి వారు తప్పించుకొన్నారు.
వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు.
6 కాని, నేను మనిషిని కానా, పురుగునా?
మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు.
7 నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు.
నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు.
8 వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి.
ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో!
నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.”
9 దేవా, నిజంగా నేను నీ మీద ఆధారపడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగినవాడవు నీవే.
నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆదరించావు.
10 నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు.
నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చినప్పటినుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను.
11 కనుక దేవా, నన్ను విడువకు.
కష్టం దగ్గర్లో ఉంది. పైగా నాకు సహాయం చేసేవారు. ఎవ్వరూ లేరు.
12 మనుష్యులు రంకెవేసే ఆబోతుల్లాగా నా చుట్టూ వున్నారు.
వారు బలిసిన బాషాను ఆబోతుల వలె నన్ను చుట్టుముట్టియున్నారు.
(బాషాను అనగా యొర్దాను నది తూర్పు ప్రాంతం. అది పశువులకు ప్రసిద్ధికెక్కిన ప్రాంతం.)
13 ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు.
వారి నోళ్లు పెద్దగా తెరచుకొని ఉన్నాయి.
14 నేలమీద పోయబడ్డ నీళ్లలా
నా బలం పోయినది.
నా ఎముకలు విడిపోయాయి.
నా ధైర్యం పోయినది.
15 నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది.
నా నాలుక నా అంగిటికి అతుక్కొని పోతోంది.
“మరణ ధూళిలో” నీవు నన్ను ఉంచావు.
యోబుకు బిల్దదు జవాబు
18 అప్పుడు షూహీ దేశస్తుడైన బిల్దదు యోబుకు ఇలా జవాబు చెప్పాడు:
2 “యోబూ! ఈ మాటలన్నీ ఎప్పుడు చాలిస్తావు?
నీవు మౌనంగా ఉండి వినాలి. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు
3 మేము పశువుల్లా బుద్ధిహీనులం అని నీవు ఎందుకు తలస్తావు?
4 యోబూ! నీ కోపంతో నీకు నీవే హాని చేసుకొంటున్నావు.
కేవలం నీ కోసం మనుష్యులు ఈ భూమిని విడిచిపోవాలా?
కేవలం నిన్ను తృప్తి పరచటం కోసం దేవుడు పర్వతాలను కదిపిస్తాడని నీవు తలస్తున్నావా?
5 “అవును నిజమే, దుర్మార్గుని దీపం ఆరిపోతుంది.
అతని అగ్ని కాలకుండా ఆగిపోతుంది.
6 అతని ఇంటిలోని వెలుగు చీకటి అవుతుంది.
అతని ప్రక్కగా ఉన్న దీపం ఆరిపోతుంది.
7 ఆ మనిషి అడుగులు మరల గట్టిగా, వేగంగా ఉండవు. కానీ అతడు నిధానంగా నడుస్తాడు, బలహీనంగా ఉంటాడు.
అతని స్వంత దుర్మార్గపు ఆలోచనలే అతడు పడిపోయేట్టు చేస్తాయి.
8 అతని స్వంత పాదాలే అతనిని వలలో పడదోస్తాయి.
అతడు బోనులోనికి నడచి, అందులో చిక్కుకొంటాడు.
9 ఒక బోను అతని మడిమెను పట్టేస్తుంది.
ఒక బోను అతన్ని గట్టిగా బంధిస్తుంది.
10 అతని కోసం నేలమీద ఒక తాడు దాచబడి ఉంటుంది.
అతని తోవలో ఒక బోను సిద్ధంగా ఉంది.
11 అతని చుట్టూరా భయం పొంచి ఉంది.
అతడు వేసే ప్రతి అడుగు వెనుక భయం ఉంటుంది.
12 చెడ్డ కష్టాలు అతని కోసం ఆకలితో వున్నాయి.
అతడు పడిపోయినప్పుడు పతనం, నాశనం అతని కోసం సిద్ధంగా ఉన్నాయి.
13 భయంకర రోగం అతని చర్మంలో కొన్ని భాగాలను తినివేస్తుంది.
అది అతని చేతులను, కాళ్లను కుళ్లిపోచేస్తుంది.
14 దుర్మార్గుడు క్షేమంగా ఉన్న తన ఇంటిలో నుండి తీసుకొని పోబడతాడు.
భయాన రాజును ఎదుర్కొనేందుకు అతడు నడిపించబడతాడు.
15 అతనికి తన ఇంటిలో ఏమీ విడిచిపెట్టబడదు.
ఎందుకంటే అతని ఇంటినిండా, మండుతున్న గంధకం చల్లబడుతుంది.
16 క్రింద అతని వేర్లు ఎండిపోతాయి.
పైన అతని కొమ్మలు చస్తాయి.
17 భూమి మీద మనుష్యులు అతనిని జ్ఞాపకం చేసుకోరు.
ఏ వ్యక్తికూడ అతన్ని ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకోడు.
18 మనుష్యులు అతనిని వెలుతురు నుండి నెట్టివేస్తారు.
అతడు చీకటిలోనికి శిక్షించబడతాడు.
వారు అతన్నిలోకంలో నుండి తరిమివేస్తారు.
19 అతనికి పిల్లలు లేక మనుమలు ఎవ్వరూ ఉండరు.
అతని కుమారుల నుండి వారసులు ఉండరు.
అతనియింట యింకా సజీవంగా ఉండే మనుష్యులు ఎవ్వరూ ఉండరు.
20 దుర్మార్గునికి సంభవించిన దానిని గూర్చి విన్నప్పుడు పడమట ఉన్న ప్రజలు అదిరిపోతారు.
తూర్పున ఉన్న ప్రజలు భయంతో మెత్తబడి పోతారు.
21 ఇది నిజం, దుర్మార్గునికి, అతని ఇంటికి ఇలాగే జరుగుతుంది.
దేవుని గూర్చి లక్ష్యపెట్టని వానికి ఇలాగే జరుగుతుంది!”
4 దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం. 2 ఎందుకంటే, వాళ్ళకు ప్రకటింపబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కాని, వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక అది వాళ్ళకు నిష్ర్పయోజనమైపోయింది. 3 సువార్తను విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము.
“నా కోపంతో ప్రమాణం చేసి చెప్పుచున్నాను:
‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను’”(A)
అని దేవుడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన కార్యం ముగిసింది. 4 కాని, “దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను”(B) అని ఏడవ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది. 5 దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు.
6 ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకావుంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్నవాళ్ళు, వాళ్ళ అవిధేయతవల్ల లోపలికి వెళ్ళలేకపొయ్యారు. 7 అందువల్ల దేవుడు మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని “ఈ రోజు” అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు చాలాకాలం తర్వాత దేవుడు దావీదు ద్వారా ఈ విధంగా మాట్లాడాడు:
“ఈ రోజు మీరాయన స్వరం వింటే,
మూర్ఖంగా ప్రవర్తించకండి.”(C)
8 యెహోషువ వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడి ఉండేవాడు కాదు. 9 అందువల్ల, దేవుని ప్రజల కోసం “విశ్రాంతి” కాచుకొని ఉంది. 10 దేవుడు తన పని ముగించి విశ్రమించాడు. అలాగే, దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ప్రతి ఒక్కడూ తన పనినుండి విశ్రాంతి పొందుతాడు. 11 అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం.
© 1997 Bible League International