Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: వాయిద్యాలతోపాడునది. దావీదు ప్రార్థన.
55 దేవా, నా ప్రార్థన వినుము.
దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
2 దేవా, దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము.
నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
3 నా శత్రువులు నాకు విరోధముగా చెప్పినదాన్నిబట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను.
నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు.
వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
4 నాలో నా గుండె అదురుతోంది.
నాకు చచ్చిపోయేటంత భయంగా ఉంది.
5 నాకు భయము మరియు వణకుగా ఉంది.
నేను భయపడిపోయాను.
6 ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది.
నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.
7 నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.
8 నేను పరుగెత్తి పోదును.
నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.
9 నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము.
ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
10 పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి.
ఈ పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.
11 వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది.
ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
12 ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే
దానిని నేను భరించగలను.
ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే
నేను దాక్కోగలను.
13 కాని, అది చేస్తున్నది నీవే.
నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.
14 మనం కలిసి మధుర సంభాషణ చేసేవాళ్లము.
దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.
15 నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను.
వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను.
ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.
జోఫరు యోబుతో మాట్లాడటం
11 అప్పుడు నయమాతీ వాడైన జోఫరు యోబుకు జవాబిచ్చాడు:
2 “ఈ మాటల ప్రవాహానికి జవాబు ఇచ్చి తీరాల్సిందే!
ఈ వాగుడు అంతా కలిసి, యోబు చెప్పింది సరే అనిపిస్తుందా? లేదు.
3 యోబూ, నీకు చెప్పేందుకు
మా వద్ద జవాబు లేదనుకొంటున్నావా?
నీవు దేవునిగూర్చి నవ్వినప్పుడు,
నిన్ను ఎవ్వరూ హెచ్చరించరు అనుకొంటున్నావా?
4 యోబూ! నీవు దేవునితో,
‘నా నమ్మకాలు సరియైనవే,
కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే’ అని చెబుతున్నావు.
5 యోబూ! దేవుడే నీకు జవాబిచ్చి,
నీవు చేసేది తప్పు అని చెబితే బాగుండును అని నేను ఆశిస్తున్నాను.
6 అప్పుడు జ్ఞాన రహస్యాలు దేవుడు నీతో చెప్పగలడు.
ప్రతి విషయానికీ, నిజంగా రెండు వైపులు ఉంటాయని ఆయన నీతో చెబుతాడు.
అది నిజమైన జ్ఞానం! యోబూ! ఇది తెలుసుకో:
దేవుడు నిన్ను నిజంగా శిక్షించాల్సిన దానికంటె తక్కువగానే శిక్షిస్తున్నాడు.
7 “యోబూ, దేవుని రహస్య సత్యాలను నీవు గ్రహించగలవా?
సర్వశక్తిమంతుడైన దేవుని గొప్పదనాన్నీ, శక్తినీ చూపించే హద్దులను నీవు గ్రహించలేవు.
8 అతని జ్ఞానం ఆకాశమంత ఎత్తైనది!
ఆ హద్దులు సమాధి లోతులకంటె లోతైనవి.
కానీ, అది నీవు గ్రహించలేవు!
9 దేవుడు భూమికంటే గొప్పవాడు,
సముద్రంకంటే పెద్దవాడు.
10 “దేవుడు ఒకవేళ నిన్ను బంధిస్తే, నిన్ను న్యాయ స్థానానికి తీసుకొనివస్తే,
ఏ మనిషీ ఆయనను వారించలేడు.
11 నిజంగా, ఎవరు పనికిమాలిన వాళ్లో దేవునికి తెలుసు.
దేవుడు దుర్మార్గాన్ని చూసినప్పుడు, ఆయన దానిని జ్ఞాపకం ఉంచుకొంటాడు.
12 ఒక అడవి గాడిద ఎలాగైతే ఒక మనిషికి జన్మ ఇవ్వలేదో,
అలాగే బుద్ధిహీనుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు.
13 అయితే యోబూ! దేవుణ్ణి మాత్రమే సేవించటానికి, నీవు నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి.
ఆయన తట్టు నీవు నీ చేతులు ఎత్తి ఆరాధించాలి.
14 నీ ఇంట్లో ఉన్న పాపం నీవు తొలగించి వేయాలి.
నీ గుడారంలో చెడు నివాసం చేయనియ్యకు.
15 అప్పుడు నీవు సిగ్గుపడకుండా దేవుని తట్టు నిశ్చలంగా చూడగలుగుతావు.
నీవు బలంగా నిలబడతావు. భయపడవు.
16 యోబూ! అప్పుడు నీవు నీ కష్టం మరచిపోగలవు.
నీ కష్టాలను దొర్లిపోయిన నీళ్లలా నీవు జ్ఞాపకం చేసుకొంటావు.
17 అప్పుడు మధ్యాహ్నపు సూర్యకాంతి కంటె నీ జీవితం ఎక్కువ ప్రకాశమానంగా ఉంటుంది.
జీవితపు గాఢాంధకార ఘడియలు సూర్యోదయంలా ప్రకాశిస్తాయి.
18 యోబూ! నిరీక్షణ ఉంది గనుక నీవు క్షేమంగా ఉంటావు.
దేవుడు నిన్ను సురక్షితంగా వుంచి నీకు విశ్రాంతినిస్తాడు.
19 నీవు విశ్రాంతిగా పండుకొంటావు. నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, బాధించరు.
మరియు అనేక మంది నీ సహాయం వేడుకొంటారు.
20 కానీ, చెడ్డవాళ్లు సహాయం కోసం చూస్తారు,
అయితే ఆశ ఏమి ఉండదు. వారు వారి కష్టాలు తప్పించుకోలేరు.
వారు చస్తారు అనేది ఒక్కటే వారికి ఉన్న ఆశ.”
10 వివాహితులకు నా ఆజ్ఞ ఇది. ఇది నా ఆజ్ఞ కాదు. ప్రభువుయొక్క ఆజ్ఞ. భార్య తన భర్తను వదిలివేయరాదు. 11 అలా వదిలివేస్తే ఆమె తిరిగి పెళ్ళి చేసుకోకూడదు. లేదా భర్తతో సమాధాన పడాలి. అలాగే భర్త తన భార్యకు విడాకులు ఇవ్వకూడదు.
12 మిగతా వాళ్ళకు నా ఆజ్ఞ యిది. ఇది ప్రభువు ఆజ్ఞ కాదు. నా ఆజ్ఞ. ఒక విశ్వాసి భార్య ప్రభువును నమ్మనిదై అతనితో ఉండటానికిష్టపడితే అతడు ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. 13 అలాగే ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి అతడు ఆమెతో జీవించాలని అనుకొంటే ఆమె అతనికి విడాకులు ఇవ్వకూడదు. 14 అంటే, విశ్వాసం లేని భర్త విశ్వాసురాలైన భార్యతో కలిసి జీవించటంవల్ల పవిత్రమౌతాడు. అదే విధంగా అవిశ్వాసియైన భార్య విశ్వాసియైన భర్తతో కలసి జీవించటం వల్ల పవిత్రమౌతుంది. అలాకానట్లయితే మీ సంతానం అపవిత్రంగా ఉంటుంది. కాని ఇప్పుడున్న ప్రకారం వాళ్ళు పవిత్రులే.
15 కాని, విశ్వాసి కానివాడు వెళ్ళిపోవాలని అనుకొంటే వెళ్ళిపోనివ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసికి కాని, విశ్వాసురాలికి కాని ఏ నిర్భంధం ఉండకూడదు. దేవుడు శాంతితో జీవించటానికే మనల్ని పిలిచాడు. 16 ఓ స్త్రీ! నీ వల్ల నీ భర్త రక్షింపబడుతాడో లేదో! నీకేమి తెలుసు? ఓ పురుషుడా! నీ వల్ల నీ భార్య రక్షింబడుతుందో లేదో! నీకేమి తెలుసు?
© 1997 Bible League International