Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: వాయిద్యాలతోపాడునది. దావీదు ప్రార్థన.
55 దేవా, నా ప్రార్థన వినుము.
దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
2 దేవా, దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము.
నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
3 నా శత్రువులు నాకు విరోధముగా చెప్పినదాన్నిబట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను.
నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు.
వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
4 నాలో నా గుండె అదురుతోంది.
నాకు చచ్చిపోయేటంత భయంగా ఉంది.
5 నాకు భయము మరియు వణకుగా ఉంది.
నేను భయపడిపోయాను.
6 ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది.
నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.
7 నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.
8 నేను పరుగెత్తి పోదును.
నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.
9 నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము.
ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
10 పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి.
ఈ పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.
11 వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది.
ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
12 ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే
దానిని నేను భరించగలను.
ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే
నేను దాక్కోగలను.
13 కాని, అది చేస్తున్నది నీవే.
నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.
14 మనం కలిసి మధుర సంభాషణ చేసేవాళ్లము.
దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.
15 నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను.
వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను.
ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.
బిల్దదు యోబుతో మాట్లాడటం
8 అప్పుడు షూహీ వాడైన బిల్దదు జవాబిచ్చాడు:
2 “ఎన్నాళ్ల వరకు నీవు అలా మాట్లాడతావు?
నీ మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి.
3 దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాడు.
సక్రమంగా ఉన్నవాటిని, న్యాయాన్ని లేక నీతిని, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ చెరపడు.
4 నీ పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, ఆయన వారిని శిక్షించాడు.
వారు వారి పాపాలకు వెల చెల్లించారు.
5 అయితే యోబూ, ఇప్పుడు దేవుని వైపు చూడు.
ఆ సర్వశక్తిమంతునికి ప్రార్థించు.
6 నీవు పరిశుద్ధంగా, మంచివానిగా ఉంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు.
మరియు నీ కుటుంబాన్ని, నీ వస్తువులను అయన తిరిగి నీకు ఇస్తాడు.
7 నీకు మొదట ఉన్నదానికంటె
ఎక్కువగా వస్తుంది.
8 “యోబూ, వృద్ధులను అడిగి వారు తమ పూర్వీకుల నుండి
ఏమి నేర్చుకొన్నారో తెలుసుకో.
9 ఎందుకంటే మనం నిన్ననే జన్మించినట్టు ఉంటుంది గనుక.
మనకు ఏమీ తెలియదు.
భూమి మీద మన జీవితాలు, ఒక నీడలా ఉన్నవి.
10 చాలాకాలం క్రిందట జీవించిన మనుష్యులు నీకు నేర్పిస్తారు.
వారి అవగాహనతో వారు నీకు ఒక జ్ఞాన సందేశం ఇస్తారు.
11 “బిల్దదు చెప్పాడు, ఎండిన నేలమీద జమ్ము ఎత్తుగా పెరుగుతుందా?
నీళ్లు లేకుండా రెల్లు పెరుగుతుందా?
12 లేదు, నీళ్లు గనుక ఎండిపోతే అవి వెంటనే ఎండి పోతాయి.
వాటిని కోసి, ఉపయోగించలేనంత చిన్నవిగా అవి ఉంటాయి.
13 దేవుణ్ణి మరచిపోయే ఏ మనిషైనా సరే ఆ రెల్లులాగానే ఉంటాడు.
దేవుణ్ణి మరచిపోయే మనిషికి భవిష్యత్తు ఉండదు.
14 ఆ మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది.
ఆ మనిషి నమ్మకం సాలెగూడును పోలివుంటుంది.
15 ఆ మనిషి సాలెగూటిమీద ఆనుకోగా
ఆ గూడు తెగిపోతుంది.
అతడు సాలెగూటిని పట్టుకొని ఉంటాడు
కాని అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు.
16 సమృద్ధిగా నీళ్లు, సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న మొక్కల్లా అతడు ఉంటాడు.
ఆ మొక్క కొమ్మలు తోట అంతటా వ్యాపిస్తాయి.
17 అది దాని వేళ్లను బండల చుట్టూరా అల్లి
ఆ బండల్లో ఎదిగేందుకు చోటుకోసం చూస్తూ ఉంటుంది.
18 కాని మొక్క దాని చోటునుండి పెరికివేయబడినప్పుడు అది అక్కడే ఉండేదని ఎవరికీ తెలియదు.
‘నేను ఇంతకు ముందు ఎన్నడూ నిన్ను చూడలేదు’ అని ఆ తోట అంటుంది.
19 కనుక ఆ మొక్కను ఉన్న సంతోషం అంతా అంతే.
తర్వాత బురదలోనుంచి ఇతర మొక్కలు పెరుగుతాయి.
20 నిర్దోషియైన మనిషిని దేవుడు విడువడు.
చెడ్డ మనుష్యులకు ఆయన సహాయం చేయడు.
21 అప్పటికీ దేవుడు నీ నోటిని నవ్వుతోను,
నీ పెదవులను సంతోష ధ్వనులతోను నింపుతాడు.
22 కానీ నీ శత్రువులను దేవుడు సిగ్గుపరుస్తాడు.
దుష్టుల గృహాలను ఆయన నాశనం చేస్తాడు.”
వివాహం
7 ఇక మీరు వ్రాసిన ప్రశ్నలకు నా సమాధానం ఇది: ఔను. వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది. 2 కాని లైంగిక అవినీతి చాలా వ్యాపించిపోయింది కనుక స్త్రీపురుషులు వివాహం చేసుకోవటం మంచిది. 3 ప్రతీ పురుషుడు భర్తగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. అలాగే ప్రతీ స్త్రీ భార్యగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. 4 భార్యకు తన శరీరంపై అధికారం లేదు. భర్తకు మాత్రమే ఆమె శరీరంపై అధికారం ఉంది. అలాగే భర్తకు తన శరీరంపై అధికారం లేదు. అతని శరీరంపై అతని భార్యకు మాత్రమే అధికారం ఉంది. 5 భార్యాభర్తలు ఇరువురు సమ్మతించి దేవుని ప్రార్థించటంలో తమ కాలాన్ని గడపదలిస్తే తప్ప వేరువేరుగా ఉండకూడదు. ప్రార్థనా సమయం ముగిసాక మళ్ళీ మీరు కలిసికొనండి. మీలో ఆత్మనిగ్రహంలేదు. కనుక సాతాను ప్రేరేపణకు లొంగిపోకుండా జాగ్రత్త పడటానికి ఇలా చెయ్యటం అవసరం. 6 ఇలా చెయ్యమని నేను ఆజ్ఞాపించటం లేదు. ఇలా చెయ్యటానికి నా అనుమతి తెలుపుతున్నాను. 7 అందరూ నాలా ఉండాలని నా కోరిక. కాని ప్రతి ఒక్కనికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకనికి ఒక వరం, ఇంకొకనికి ఇంకొక వరం ఇచ్చాడు.
8 అవివాహితులకు, వితంతువులకు నా సలహా ఇది: వాళ్ళు నాలాగే పెళ్ళి చేసుకోకుండా ఉండటం మంచిది. 9 కాని వాళ్ళలో నిగ్రహం లేకపోతే పెళ్ళి చేసుకోవటం ఉత్తమం. కామంతో కాలిపోవటం కన్నా పెళ్ళి చేసుకోవటం మంచిది.
© 1997 Bible League International