Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
26 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము.
యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.
2 యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి.
నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశితంగా చూడుము.
3 నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను.
నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.
4 పనికిమాలిన ఆ మనుష్యుల్లో
నేను ఒకడ్ని కాను.
5 ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం.
ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.
6 యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను.
నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.
7 యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను.
నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.
8 యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ.
మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.
9 యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము.
ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము.
10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి.
చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచం తీసుకొంటారు.
11 కాని నేను నిర్దోషిని.
కనుక దేవా, నన్ను కరుణించి, రక్షించుము.
12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను.
యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.
7 యోబు చెప్పాడు, “మనిషికి భూమి మీద కష్టతరమైన సంఘర్షణ ఉంది.
అతని జీవితం రోజు కూలివానిదిలా ఉంది.
2 ఒక ఎండ రోజున కష్టపడి పనిచేసిన తర్వాత చల్లటి నీడ కావాల్సిన బానిసలా ఉన్నాడు మనిషి.
జీతంరోజు కోసం ఎదురు చూసే కూలివానిలా ఉన్నాడు మనిషి.
3 అదే విధంగా నాకూ నెల తర్వాత నెల ఇవ్వబడుతోంది. ఆ నెలలు శూన్యంతో, విసుగుతో నిండి పోయి ఉంటాయి.
శ్రమ రాత్రుళ్లు ఒకదాని వెంట ఒకటి నాకు ఇవ్వబడ్డాయి.
4 నేను పండుకొన్నప్పుడు, ఆలోచిస్తాను,
‘నేను లేచేందుకు ఇంకా ఎంత సమయం ఉంది?’ అని.
రాత్రి జరుగుతూనే ఉంటుంది.
సూర్యుడు వచ్చేంతవరకు నేను అటూ యిటూ దొర్లుతూనే ఉంటాను.
5 నా శరీరం పురుగులతోనూ, మురికితోనూ కప్పబడింది.
నా చర్మం పగిలిపోయి, రసి కారుతూన్న పుండ్లతో నిండిపోయింది.
6 “నేతగాని నాడెకంటె తొందరగా నా దినాలు గతిస్తున్నాయి.
నిరీక్షణ లేకుండా నా జీవితం అంతం అవుతుంది.
7 దేవా, నా జీవితం కేవలం ఒక ఊపిరి మాత్రమే అని జ్ఞాపకం చేసుకో.
నా కళ్లు మంచిదానిని దేనినీ మరల చూడవు.
8 నీవు నన్ను ఇప్పుడు చూస్తావు. కానీ నన్ను మరల చూడవు.
నీవు నాకోసం చూస్తావు. కాని నేను చనిపోయి వుంటాను.
9 ఒక మేఘం కనబడకుండ మాయమవుతుంది.
అదేవిధంగా మరణించిన ఒక మనిషి సమాదిలో పాతి పెట్టబడతాడు. మరల తిరిగిరాడు.
10 అతడు తన ఇంటికి ఎన్నటికీ తిరిగిరాడు.
అతనిస్థలం అతన్ని ఇంకెంత మాత్రం గుర్తించదు.
11 “అందుచేత నేను మౌనంగా ఉండను.
నేను గట్టిగా మాట్లాడతాను. నా ఆత్మ శ్రమ పడుతోంది.
నా ఆత్మ వేదనపడుతోంది గనుక నేను ఆరోపణ చేస్తాను.
12 ఓ దేవా, నీ వెందుకు నాకు కాపలా కాస్తున్నావు?
నేను ఏమైనా సముద్రాన్నా, లేక సముద్ర రాక్షసినా?
13 నా పడక నాకు విశ్రాంతి నివ్వాలి
నా మంచం నాకు విశ్రాంతి, విరామాన్ని ఇవ్వాలి
14 కాని, దేవా! నీవు నన్ను కలలతో భయపెడుతున్నావు.
దర్శనాలతో నన్ను భయపెడుతున్నావు.
15 అందుచేత బ్రతకటం కంటె
చంపబడటం నాకు మేలు.
16 నా బ్రదుకు నాకు అసహ్యం.
నేను శాశ్వతంగా జీవించాలని కోరను
నన్ను ఒంటరిగా ఉండనివ్వు.
నా జీవితానికి అర్థం శూన్యం.
17 దేవా, ఎందుకు మనిషి అంటే నీకు ఇంత ముఖ్యం? నీవు అతనిని ఎందుకు గౌరవించాలి?
మనిషికి నీవసలు గుర్తింపు ఎందుకు ఇవ్వాలి?
18 నీవు ప్రతి ఉదయం మనిషిని ఎందుకు దర్శిస్తావు,
ప్రతిక్షణం ఎందుకు పరీక్షిస్తావు?
19 దేవా, నీవు ఎన్నడూ నన్ను విడిచి అవతలకు ఎందుకు చూడవు?
ఒక క్షణమైన నీవు నన్ను ఒంటరిగా ఉండనియ్యవు?
20 మనుష్యులను గమనించువాడా,
నేను పాపం చేశానంటావా, సరే, మరి నన్నేం చేయమంటావు?
దేవా, గురిపెట్టేందుకు ప్రయోగంగా నీవు నన్నెందుకు ఉపయోగించావు?
నేను నీకు ఒక భారమై పోయానా?
21 నీవు నా తప్పిదాలు క్షమించి,
నా పాపాలను ఎందుకు క్షమించకూడదు?
త్వరలోనే నేను చచ్చి సమాధిలో ఉంటాను.
అప్పుడు నీవు నాకోసం వెదకుతావు. నేను పోయి ఉంటాను.”
ధర్మశాస్త్రము, దేవుని రాజ్యము
(మత్తయి 11:12-13)
14 పరిసయ్యులు ధనాన్ని ప్రేమించేవాళ్ళు కనుక వాళ్ళు ఇది విని యేసును హేళన చేశారు. 15 యేసు వాళ్ళతో, “మీరు ప్రజల ముందు నీతిమంతులుగా ప్రవర్తిస్తారు. కాని మీ హృదయాల్లో ఏముందో దేవునికి తెలుసు. మానవులు వేటికి అత్యధికమైన విలువనిస్తారో వాటిని దేవుడు తిరస్కరిస్తాడు.
16 “యోహాను కాలాందాకా ధర్మశాస్త్రము, ప్రవక్తలు వ్రాసిన విషయాలు ఆచరణలో ఉన్నాయి. యోహాను కాలం నుండి దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటింపబడుతోంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలోకి వెళ్ళాలని తమ శక్త్యానుసారం కష్టపడుతున్నారు. 17 భూమి, ఆకాశము నశించిపోవచ్చు, కాని ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు.
విడాకులు మరియు పునర్వివాహము
18 “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకొన్న ప్రతివాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడాకులివ్వబడిన స్త్రీని వివాహం చేసుకొన్నవాడు కూడా వ్యభిచారిగా పరిగణింపబడతాడు” అని అన్నాడు.
© 1997 Bible League International