Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 26

దావీదు కీర్తన.

26 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము.
    యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.
యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి.
    నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశితంగా చూడుము.
నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను.
    నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.
పనికిమాలిన ఆ మనుష్యుల్లో
    నేను ఒకడ్ని కాను.
ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం.
    ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.

యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను.
    నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.
యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను.
    నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.
యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ.
    మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.

యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము.
    ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము.
10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి.
    చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచం తీసుకొంటారు.
11 కాని నేను నిర్దోషిని.
    కనుక దేవా, నన్ను కరుణించి, రక్షించుము.
12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను.
    యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.

యోబు 2:11-3:26

ముగ్గురు స్నేహితులు యోబును చూడటానికి వచ్చారు

11 తేమాను వాడైన ఎలీఫజు, షూహీవాడైన బిల్దదు, నయమాతీవాడైన జోఫరు అనే ముగ్గురు యోబుకు స్నేహితులు. యోబుకు సంభవించిన చెడు సంగతులు అన్నింటిని గూర్చి ఈ ముగ్గురు స్నేహితులూ విన్నారు. ఈ ముగ్గురు స్నేహితులూ వారి ఇండ్లు విడిచి ఒకచోట సమావేశమయ్యారు. వారు వెళ్లి యోబుకు సానుభూతి చూపించి, ఆదరించాలని తీర్మానించుకున్నారు. 12 కాని ఆ స్నేహితులు ముగ్గురూ యోబును దూరమునుండి చూచి, అతడు చాలా వేరుగా కనబడటం చేత అతడు యోబు అని సరిగ్గా గుర్తించ లేక పోయారు. వారు గట్టిగా ఏడ్వటం మొదలు పెట్టారు. వారు తమ వస్త్రాలు చింపుకొని, తాము విచారంగాను, కలవరంగాను ఉన్నట్టు తెలియ చేయడానికి తమ తలల మీద దుమ్మెత్తి పోసుకొన్నారు. 13 తరువాత ఆ ముగ్గురు స్నేహితులూ యోబుతో పాటు ఏడు రాత్రుళ్లు, ఏడు పగళ్లు నేలమీద కూర్చున్నారు. యోబు చాలా శ్రమ పడుతూ ఉన్న కారణంగా వారిలో ఏ ఒక్కరూ యోబుతో ఒక్క మాట కూడా పలుకలేదు.

యోబు తన పుట్టిన రోజును శపించుట

అప్పుడు యోబు తన నోరు తెరచి, తాను పుట్టిన రోజును శపించాడు. 2-3 అతడు ఇలా అన్నాడు:

“నేను పుట్టిన ఆ రోజు ఉండకుండా పోవును గాక.
    ‘పిల్లవాడు పుట్టాడు!’ అని చెప్పబడిన ఆ రాత్రి ఉండకుండా పోవునుగాక. అది పోవునుగాక.
ఆ రోజు చీకటి అవును గాక.
    ఆ రోజును దేవుడు లక్ష్యపెట్టకుండును గాక. ఆ రోజున వెలుగు ప్రకాశింపకుండును గాక.
ఆ రోజు మరణాంధకారమవును గాక.
    ఆ రోజును ఒక మేఘము కప్పివేయును గాక.
నేను పుట్టిన ఆనాటి వెలుగును కారు మేఘాలు భయపెట్టి వెళ్లగొట్టును గాక.
గాఢాంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక.
    ఆ రాత్రి సంవత్సరపు దినములలో ఒకటిగా ఎంచబడకుండును గాక.
    ఆ రాత్రిని ఏ నెలలో కూడ చేర్చవద్దు.
ఆ రాత్రి ఎవడును జననం కాకపోవును గాక.
    ఆ రాత్రి ఏ ఆనంద శబ్దం వినుపించకుండా ఉండును గాక.
శాపాలు పెట్టే మంత్రగాళ్లు నేను పుట్టిన ఆ రోజును శపించెదరు గాక.
    సముద్రపు రాక్షసికి కోపం పుట్టించుట ఎట్లో ఎరిగిన మనుష్యులు వారు.
ఆ నాటి వేకువ చుక్క చీకటి అవునుగాక.
    ఆ రాత్రి ఉదయపు వెలుగుకోసం కనిపెట్టి ఉండును గాక.
    కానీ ఆ వెలుగు ఎన్నటికీ రాకుండును గాక.
    ఆ రాత్రి సూర్యోదయపు మొదటి కిరణాలు చూడకుండును గాక.
10 ఎందుకనగా ఆ రాత్రి, నా తల్లి గర్భద్వారాలను మూసివేయలేదు.
    (అది పుట్టకుండా అరికట్టలేదు) అది నా కన్నులనుండి కష్టాలను దాచలేదు.
11 నేను పుట్టినప్పుడే నేనెందుకు మరణించలేదు?
    నా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు నేనెందుకు మరణించలేదు?
12 నా తల్లి ఎందుకు నన్ను తన మోకాళ్లమీద పెట్టుకొంది?
    నా తల్లి స్తనములు నాకెందుకు పాలిచ్చాయి?
13 నేను పుట్టినప్పుడే నేను మరణించి ఉంటే
    ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండేవాణ్ణి.
14     భూమి మీద బ్రతికిన రాజులు, జ్ఞానులతో బాటు విశ్రాంతిలో ఉంటే ఎంత బాగుండును
    ఆ రాజులు, జ్ఞానులచే నిర్మింపబడిన ఆ కట్టడాలు ఇప్పుడు నాశనమై పోయాయి.
15 నేను కూడ ఆ పాలకులతో పాటు పాతిపెట్టబడి ఉంటే ఎంత బాగుండును.
    వారికి బంగారం ఉంది, వారి ఇండ్లను వెండితో నింపుకొన్నారు!
16 నేను పుట్టినప్పుడే చనిపోయి,
    మట్టిలో పాతి పెట్టబడిన శిశువుగా ఎందుకు ఉండలేదు?
ఎన్నడూ వెలుగు చూడని శిశువులా నేను ఉంటే
    ఎంత బాగుండును.
17 చెడ్డ మనుష్యులు సమాధిలో ఉన్నప్పుడు తొందర కలిగించటం మానివేస్తారు.
    అలసిపోయిన మనుష్యులకు సమాధిలో విశ్రాంతి లభిస్తుంది.
18 ఖైదీలు కూడా సమాధిలో సుఖంగా ఉంటారు.
    కాపలాదారుల స్వరం వారు వినరు.
19 ప్రముఖ ప్రజలు, సామాన్య ప్రజలు అన్ని రకాల ప్రజలు సమాధిలో ఉంటారు.
    మరియు బానిస తన యజమాని నుండి విడుదల అవుతాడు.

20 “శ్రమ పడుతూ, చాలా విచారంగా ఉన్న మనిషిని ఇంకా బ్రతుకుతూ ఉండనియ్యటం ఎందుకు?
    ఆత్మ వేదనతో ఉన్న వానికి జీవం ఇవ్వబడటం ఎందుకు?
21 ఆ మనిషి చావాలని కోరుకొంటాడు. కాని చావురాదు.
    విచారంలో ఉన్న ఆ మనిషి దాగి ఉన్న ఐశ్వర్యాలకంటే మరణంకోసం ఎక్కువగా వెదకుతాడు.
22 ఆ మనుష్యులు సమాధిని కనుగొన్నప్పుడు చాలా సంతోషిస్తారు.
    వారు పాతిపెట్టబడినప్పుడు ఆనందిస్తారు.
23 దేవుడు వారి భవిష్యత్తును రహస్యంగా ఉంచుతాడు.
    వారి చుట్టూ ఒక గోడ కడతాడు.
24 నేను భోజనం చేయను. కాని నేను దుఃఖధ్వనులు చేస్తాను.
    కాని సంతోషంతో కాదు. నా ఆరోపణలు నీళ్లలా ప్రవహిస్తున్నాయి.
25 నాకు ఏదో దారుణం జరుగుతుందేమో అని భయ పడ్డాను.
    అలానే జరిగింది నాకు!
26 నాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు.
    నాకు విశ్రాంతి లేదు. కష్టం మాత్రమే ఉంది!”

గలతీయులకు 3:23-29

23 విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసం మనకు బయలు పడేదాకా మనము ఖైదీలుగా ఉన్నాము. 24 మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్ళటానికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడింది. 25 ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది. కనుక ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏ మాత్రం అధికారం లేదు.

26 యేసుక్రీస్తులో మీకు విశ్వాసం వుండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు. 27 ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు. 28 ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తు యేసులో మీరందరు సమానం. 29 మీరు క్రీస్తుకు చెందితే అబ్రాహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమౌతాం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International