Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 140

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

140 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రుల నుండి నన్ను కాపాడుము.
ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు.
    వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు.
వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి
    వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది.

యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు.
ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు.
    నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు.
    నా దారిలో వారు ఉచ్చు పెడతారు.

యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను.
    యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు.
    నీవు ఇనుప టోపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు.
యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు.
    వారి పథకాలు నెగ్గనీయకు.

యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము.
    ఆ మనుష్యులు చెడు కార్యాలు తలపెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చేయుము.
10 వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము.
    నా శత్రువులను అగ్నిలో పడవేయుము.
    వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము.
11 యెహోవా, ఆ అబద్దికులను బ్రతుకనియ్యకుము.
    ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము.
12 పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు.
    నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు.
13 యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తారు.
    నీ సన్నిధానంలో వారు నివసిస్తారు.

ఎస్తేరు 4

సహాయం చేయమని ఎస్తేరుకు మొర్దెకై నచ్చచెప్పటం

మొర్దకై జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. యూదులకు వ్యతిరేకంగా మహారాజు ఆజ్ఞలను గురించి విన్న మొర్దెకై తన బట్టలు చింపుకొని, తన నెత్తిమీద బూడిద పోసుకొని, విషాద సూచకమైన దుస్తులు ధరించి, నగరంలోకి పోయిగట్టిగా ఏడ్వ నారంభించాడు. కాని, మొర్దెకై రాజభవన ద్వారం వరకు మాత్రమే పోగలిగాడు. అయితే, విషాద సూచక దుస్తులు ధరించినవారెవరూ ఆ ద్వారంలో ప్రవేశించేందుకు అనుమతింపబడరు. రాజాజ్ఞ చేరిన ప్రతి సామంత రాజ్యంలోనూ యూదుల్లో విచారం అలుముకొంది. ఏడ్పులు చెలరేగాయి. వాళ్లు శోకాలు పెడుతూ, ఉపవాసాలుండసాగారు. చాలామంది యూదులు నెత్తిన బూడిద పోసుకొని, సంతాప సూచక దుస్తులు వేసుకొని నేలమీద పడి వున్నారు.

4-5 ఎస్తేరు పరిచారికలు, నపుంసకులు ఆమె దగ్గరికి వెళ్లి, ఆమెకి మొర్దెకై గురించి చెప్పారు. దానితో, ఎస్తేరు మహారాణి గాభరా చెందింది, బాగా విచారగ్రస్తి అయింది. విషాద సూచకమైన దుస్తులు వదలి, వాటి స్థానంలో వేసుకొనేందుకు మంచి దుస్తులు ఆమె మొర్దెకైకి పంపింది. కాని, అతను ఆ దుస్తులు ధరించేందుకు నిరాకరించాడు. హతాకు అనే నపుంసకుడు ఎస్తేరు ప్రధాన సేవకుడు. ఎస్తేరు అతన్ని మొర్దెకై వద్దకు పోయి అతన్ని కలవరపరుస్తున్నదేమిటో, దానికి కారణం ఏమిటో కనుక్కోమని పంపింది. రాజభవన ద్వారం ముందర నగరంలోని, ఖాళీ స్థలంలో వున్న మొర్దెకైని హతాకు పోయి కలిశాడు. అప్పుడు మొర్దెకై తన విషయంలో జరిగినదంతా హతాకుకి వివరించి చెప్పాడు. యూదులను హతమార్చేందుకు గాను రాజు గారి బొక్కసంలో సరిగ్గా ఎంత మొత్తం సొమ్ము జమ చేస్తానని హామాను వాగ్దానం చేశాడో చెప్పాడు. యూదులను చంపేయాలన్న మహారాజు ఆజ్ఞ ప్రతిని కూడా మొర్దెకై హతాకుకి ఇచ్చాడు. ఆ తాఖీదు షూషను నగరమంతటా ఎలా చాటబడిందో చెప్పాడు. ఆ ఆజ్ఞను ఎస్తేరుకి చూపించమనీ, విషయాలన్నీ వివరించి చెప్పమనీ, మహారాజు దగ్గరికి పోయి, మొర్దెకైకీ, తన స్వజనానికీ, క్షమాభిక్షను అర్థించేలా ఎస్తేరును ప్రోత్సహించమనీ అతను హతాకుకి చెప్పాడు.

హతాకు రాణివాసానికి తిరిగి వెళ్లి, మొర్దెకై తనకి చెప్పిన విషయాలన్నీ ఎస్తేరుకి చెప్పాడు.

10 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఈ క్రింది మాటలు చెప్పమని హతాకును ఆజ్ఞాపించింది: 11 “మహారాజు పిలువ నంపితేగాని స్త్రీగాని, పురుషుడుగాని మహారాజు సన్నిధికి వెళ్లడం నిషిద్ధం. అలా వెళ్లే వ్యక్తి మరణ శిక్షకి గురి అవుతాడు. మహారాజు సామంతులందరికీ, ఆయా సామంత దేశాల ప్రజలందరికీ యీ విషయం తెలుసు. ఆ వ్యక్తిని మహారాజు తన బంగారపు దండంతో అంటినప్పుడు మాత్రమే ఆ మరణ శిక్ష అమలు జరపబడదు. మహారాజు అలా చేస్తే, ఆ వ్యక్తి ప్రాణం నిలుస్తుంది. 30 రోజులుగా మహారాజు నన్ను పిలువనంపలేదు. మరి నేనెలా వెళ్లాలి?”

12-13 అలా ఎస్తేరు పంపిన సందేశానికి బదులుగా మొర్దెకై ఆమెకి ఇలా సమాధనం పంపాడు: “ఎస్తేరూ, నువ్వు రాజభవనంలో వున్నావు, అంతమాత్రాన, యూదులందరిలో నీకొక్కదానికే రక్షణ వుంటుందని భ్రమపడకు. 14 ఒకవేళ నువ్విప్పుడు మౌనం వహిస్తే యూదులకు స్వేచ్ఛా సహాయాలు మరొక చోటునుంచి వస్తాయి. కాని నువ్వూ, నీ తండ్రి కుటుంబ సభ్యులూ అందరూ మరణిస్తారు. బహుశా నువ్వీ మహాత్కార్యం కోసమే మహారాణిగా ఈ సమయంలో ఎంచుకోబడ్డావేమో ఆలోచించుకో.”

15-16 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఈ క్రింది సమాధానం పంపింది: “మొర్దెకై! పోయి షూషను నగరంలోని యూదులందర్నీ కూడగట్టు, నా కోసం ఉపవాసం ఉండండి. నేను మూడు రాత్రులూ, పగళ్లూ అన్నపానాలు విసర్జిస్తాను. నేను నీలాగే ఉపవాసముంటాను. అలాగే, నా పరిచారికలు కూడా ఉపవాసం ఉంటారు. మా ఉపవాస దినాలు ముగిశాక, నేను మహారాజు సన్నిధికి వెళ్తాను, ఆయన నన్ను పిలువనంపక పోయినా సరే, వెళ్తాను. పిలుపు రాకుండా మహారాజు సమక్షానికి వెళ్లడం చట్టవిరుద్ధమని నాకు తెలుసు. అయినా సరే, నేను వెళ్తాను. నేను చనిపోతే చనిపోతాను.”

17 మొర్దెకై అక్కడ్నుంచి వెళ్లిపోయి, ఎస్తేరు చెయ్యమన్నట్లు చేశాడు.

1 పేతురు 1:3-9

సజీవమైన ఆశాభావం

మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించుదాం. ఆయనకు మనపై అనుగ్రహం ఉండటం వల్ల యేసు క్రీస్తును బ్రతికించి మనకు క్రొత్త జీవితాన్ని యిచ్చాడు. అంతేకాక మనలో సజీవమైన ఆశాభావాన్ని కలిగించాడు. నాశనంకాని, మచ్చలేని, తరగని వారసత్వం పొందటానికి ఆశించండి. దేవుడు మీకోసం దాన్ని పరలోకంలో దాచి ఉంచాడు.

చివరి దశలో మనకు వ్యక్తం కావటానికి రక్షణ సిద్ధంగా ఉంది. మీలో విశ్వాసం ఉండటంవల్ల, అది లభించే వరకూ మీకు దైవశక్తి రక్షణ కలిగిస్తుంది. కొంతకాలం సంభవించిన అనేక రకాల కష్టాల్ని అనుభవించవలసి వచ్చినప్పుడు మీరు అనుభవించారు. దానికి ఆనందించండి. మీ విశ్వాసం యథార్థమైనదని రుజువగుటకు ఈ శ్రమలు మీకొచ్చాయి. బంగారం నిప్పుచేత కాల్చబడి శుద్ధి అయినా, చివరికది నాశనం కాక తప్పదు. మీ విశ్వాసం బంగారం కంటే విలువైనదిగా యుండి యేసు క్రీస్తు వచ్చినప్పుడు ప్రశంస, మహిమ, ఘనత పొంద తగినదిగా వుంటుంది.

మీరాయన్ని చూడలేదు. అయినా ప్రేమిస్తున్నారు. ప్రస్తుతం చూడటం లేదు. అయినా విశ్వసిస్తున్నారు. వ్యక్తం చేయలేని దివ్యమైన ఆనందం మీలో నిండిపోయింది. ఎందుకంటే ఏ ఉద్దేశ్యంతో మీరు విశ్వసిస్తున్నారో ఆ ఉద్దేశ్యం నెరవేరుతోంది. మీ ఆత్మలకు రక్షణ లభిస్తోంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International