Revised Common Lectionary (Semicontinuous)
దావీదు యాత్ర కీర్తన.
124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
2 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
3 అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
4 అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
5 అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.
6 యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.
7 మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
8 మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
వష్తి రాణి రాజుకు అవిధేయురాలగుట
1 అహష్వేరోషు రాజ్యపాలన కాలంలో జరిగిన సంఘటన యిది. అహష్వేరోషు భారత దేశంనుంచి కూషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలతో కూడిన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. 2 అహష్వేరోషు తన రాజధాని నగరమైన షూషనులో సింహాసనాధిష్ఠుతుడై, తన పాలన సాగించాడు.
3 అహష్వేరోషు తన రాజ్యపాలన మూడేళ్లు నిండిన సందర్భంగా అధికారులకూ, నాయకులకూ విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకి పారసీక దేశమంతటినుంచి, మాదియా దేశం నుంచి సేనానులూ, ప్రముఖ నాయకులూ హాజరయ్యారు. ఆ విందు నూట ఎనభై రోజులు కొనసాగింది. 4 ఆ విందుసాగిన అన్ని రోజులూ అహష్వేరోషు రాజు తన రాజ్యంలోని గొప్ప సంపదను ప్రదర్శించాడు. రాజభవనపు అందాలనూ, ఐశ్వర్యాన్నీ ప్రదర్శిస్తూ వచ్చాడు. 5 ఆ నూట ఎనభై రోజుల విందు ముగిశాక అహహ్వేరోషు మరో విందు ఏర్పాటు చేశాడు. అది వారం రోజులపాటు కొనసాగింది. ఆ విందు రాజనగరులోని తోటలో జరిగింది. ఆ విందుకి రాజధాని నగరమైన షూషనులోని ప్రజలందరినీ, అత్యంత ముఖ్యులు మొదలుకొని అత్యల్పులను కూడా ఆహ్వానించాడు. 6 ఆ లోపలి తోట చుట్టూ తెలుపు, నీలి తెరలు వేలాడదీయబడ్డాయి. అవి చలువరాతి స్తంభాలకు, తాపిన వెండి కమ్ములకు అవిసెనార, నూలు తాళ్లతో బిగించబడ్డాయి. అక్కడ ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు మొదలైన రంగుల విలువైన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి, బంగారాలతో చేసిన పడకలు వున్నాయి. 7 అతిథులకు ద్రాక్షాసారా బంగారు పాత్రల్లో అందించబడింది. చిత్రమేమిటంటే, ఆ పాత్రల్లో ఒకదాన్ని పోలినది మరొకటి లేదు! రాజు బాగా ఔదార్యవంతుడేమో, ద్రాక్షాసారాకి కొదువ లేకపోయింది. 8 రాజు ఆజ్ఞమేరకు ద్రాక్షాసారా వడ్డించేవాడు ప్రతి ఒక్క అతిథికీ అతను కోరినంత పోశాడు.
9 మహారాణి వష్తి కూడా స్త్రీలకు రాజభవనంలో విందుచేసింది.
10-11 ఆ విందు ఏడవ రోజున రాజు అహష్వేరోషు ద్రాక్షాసారా ఎక్కువగా సేవించాడు. మంచి మత్తులో వున్న మహారాజు తనను సేవించిన ఏడు మంది సేవకులైన మెహోమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే నపుంసకులకు మహారాణికి కిరీటం ధరింపజేసి, తన ఎదుటకు తీసుకు రావాలని ఆజ్ఞాపించాడు. మహారాణి వష్తి మహా సౌందర్యవతి. ఆమె సౌందర్యాన్ని అధికారులకూ, ప్రముఖులకూ ప్రదర్శించి మెప్పు పొందాలన్నది అతని సంకల్పం.
12 ఆ సేవకులు మహారాణికి మహారాజు ఆజ్ఞను విన్నవించారు. కాని, ఆమె అందరి ముందుకు వెళ్లేందుకు నిరాకరించింది. మహారాజుకు అధికంగా కోపం వచ్చింది. 13-14 న్యాయ చట్టం గురించీ, శిక్షలను గురించి నిపుణుల సలహాలు అడగటం మహారాజుకి పరిపాటి. అందుకని, న్యాయనిపుణులైన తన సలహాదారులతో మహారాజు సంప్రదించాడు. మహా రాజుకి సన్నిహితులైన ఆ సలహాదారుల పేర్లు: కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెను, మర్సెనా, మెమూకాను. ఈ యేడుగురూ పారశీక, మాదీయ దేశాల ప్రముఖులు. మహారాజును దర్శించేందుకు ప్రత్యేకమైన అనుమతులు కలిగినవాళ్లు. సామ్రాజ్యంలో అత్యున్నతమైన అధికారులు. 15 మహారాజు వాళ్లని ఇలా ప్రశ్నించాడు: “మహారాజు తన నపుంసకులద్వారా వష్తి మహారాణికి ఒక ఆజ్ఞ పంపాడు. కాని, ఆమె రాజాజ్ఞను మన్నించలేదు. న్యాయచట్టం ప్రకారం ఆమెపైన ఎలాంటి చర్య తీసుకోవాలి?”
16 అప్పుడు మెమూకాను యితర అధికారులు వింటూండగా మహారాజుకి ఇలా సమాధానమిచ్చాడు: “మహారాణి వష్తి చేసినది నేరం. ఆమె మహారాజు అహష్వేరోషు పట్లనే కాక రాజ్యములోని ఆయన సంస్థా నములన్నిటిలోనుండు అధికారుల పట్ల, ప్రముఖుల పట్ల కూడా నేరం చేసింది. 17 నేనీ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మహారాణి వష్తి చేసిన యీ ఆజ్ఞోల్లంఘనాన్ని గురించి మిగిలిన స్త్రీలందరూ వింటారు. అప్పుడింక యితర స్త్రీలు కూడా తమ భర్తల పట్ల విధేయత చూపడం మానేస్తారు. వాళ్లు తమ భర్తలతో ఇలా వాదిస్తారు: ‘అహష్వేరోషు మహారాజు వష్తి మహారాణిని రమ్మని ఆజ్ఞాపించాడు. కాని, ఆమె వచ్చేందుకు నిరాకరించింది కదా.’
18 “పారశీక, మాదీయ నాయకుల భార్యలు ఈనాడు మహారాణి చేసినదాన్ని గురించి విన్నారు. ఆమె చేసిన పనిచేత వాళ్లు ప్రభావితులవుతారు. ఆ స్త్రీలు కూడా మహారాజుగారి ప్రముఖుల పట్ల అలాగే వ్యవహరిస్తారు. దానితో అవిధేయతా, కోపతాపాలూ రెచ్చిపోతాయి.
19 “మహారాజు సమ్మతిస్తే, నాదొక సూచన, మహారాజా, మీరు ఒక శాసనం జారీచెయ్యాలి. దాన్ని పారశీక, మాదీయ రాజ్యాల న్యాయచట్టాల్లో నమోదు చేయించాలి. అప్పుడిక పారశీక, మాదియ న్యాయచట్టాలను మార్చడం సాధ్యంకాదు. వష్తి అహష్వేరోషు మహారాజు సమక్షంలోకి యిక ఎన్నడూ రాకూడదు. అంతేకాదు, మహారాజు ఆమె (రాణి) పట్టమహిషిత్వ స్థానాన్ని ఆమెకంటె మెరుగైన స్త్రీకి ఇవ్వాలి. 20 మహారాజు ఆజ్ఞ ఆయన సువిశాల సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లోనూ చాటింపబడినాక, స్త్రీలందరూ తమ భర్తలను గౌరవిస్తారు. అప్పుడిక అల్పుల దగ్గర్నుంచి అధికులదాకా స్త్రీలందరూ తమతమ భర్తల్ని గౌరవిస్తారు.”
21 మహారాజుకి, ఆయన ముఖ్యాధికారులకీ యీ సలహా నచ్చింది. దానితో అహష్వేరోషు మహారాజు మెమూకాను చేసిన యీ సూచనను శాసనం చేశాడు.
13 పేతురు, యోహాను చదువురాని మామూలు మనుష్యులని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడా సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్నవాళ్ళని గ్రహించారు. 14 కాని నయమైన మనిషి వాళ్ళతో నిలిచి ఉండటం చూసి యింకే ఆక్షేపణలు చెయ్యలేక పోయారు.
15 వాళ్ళను మహాసభనుండి వెళ్ళమని ఆజ్ఞాపించి పరస్పరం యిలా చర్చించుకొన్నారు: 16 “వీళ్ళనేం చెయ్యాలి? యెరూషలేము నివాసులందరికి వీళ్ళు అద్భుతమైన మహిమ చేసారని బాగా తెలుసు. మనం దాన్ని కాదనలేం. 17 కాని యిది ప్రజల్లో యింకా ఎక్కువగా వ్యాపించక ముందే యిక మీదట అతని పేరిట ఎవరితో ఏమీ మాట్లాడవద్దని వాళ్ళను వారించాలి.”
18 వాళ్ళను మళ్ళీ పిలిచి యేసు పేరిట బోధించకూడదని, ఆయన గురించి మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు. 19 కాని పేతురు, యోహాను వాళ్ళకు సమాధానం చెబుతూ, “మీరు చెప్పింది చెయ్యాలో, లేక దేవుడు చెప్పింది చెయ్యాలో, దేవుని దృష్టిలో ఏది న్యాయమో మీలో మీరు నిర్ణయించుకోండి. 20 ఎందుకంటే మేము చూసినదాన్ని, విన్నదాన్ని గురించి ప్రజలకు చెప్పకుండా వుండలేము” అని అన్నారు.
21 వాళ్ళు పేతురును, యోహానును యింకా కొంచెం భయపెట్టి వదిలేసారు. 22 దేవుని మహిమవల్ల నయమైన వ్యక్తి నలభై ఏండ్లు దాటినవాడు. ఈ జరిగిన సంఘటనవల్ల ప్రజలంతా కలిసి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. అందువలన వీళ్ళను ఏ విధంగా శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు.
విశ్వాసుల ప్రార్థన
23 విడుదలయ్యాక పేతురు, యోహాను తమ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రధానయాజకులు, పెద్దలు చెప్పినదంతా చెప్పారు. 24 ఇది విన్నాక వాళ్ళంతా కలిసి ఒకే ధ్యేయంతో దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు: “మహా ప్రభూ! నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు. 25 నీవు పవిత్రాత్మ ద్వారా నీ సేవకుడు, మా తండ్రి అయిన దావీదు నోటినుండి యిలా పలికించావు:
‘జనాంగములు ఎందుకు రెచ్చుతున్నాయి?
ప్రజలెందుకు వృథాగా పన్నాగాలు పన్నుతున్నారు?
26 ‘రాజులు, పాలకులు కలిసి ప్రభువును,
ఆయన క్రీస్తును ఎందుకు ఎదిరిస్తున్నారు?’(A)
27 హేరోదు మరియు పొంతి పిలాతు ఇశ్రాయేలు ప్రజలతో మరియు యితర దేశ ప్రజలతో కలిసారు. అంతా కలిసి పవిత్రతగల నీ సేవుకుణ్ణి, నీవు క్రీస్తుగా నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు. 28 ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్ళు నీవు నిర్ణయించినట్లే చేసారు. 29 ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు! 30 యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. ఆయన పేరిట రోగుల్ని నయం చెయ్యటానికి, అద్భుతాలు, మహత్యాలు చెయ్యటానికి నీ అభయ హస్తాన్ని చాపి మాకు శక్తినివ్వు!”
31 వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవసందేశాన్ని ధైర్యంగా చెప్పటం మొదలు పెట్టారు.
© 1997 Bible League International