Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 73:21-28

21-22 నేను చాలా తెలివి తక్కువ వాడను.
    ధనికులను, దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను.
దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను.
    తెలివితక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను.
23 నాకు కావలసిందంతా నాకు ఉంది. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను.
    దేవా, నీవు నా చేయి పట్టుకొనుము.
24 దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము.
    ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు.
25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు.
    మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి?
26 ఒకవేళ నా మనస్సు,[a] నా శరీరం నాశనం చేయబడతాయేమో.
    కాని నేను ప్రేమించే బండ[b] నాకు ఉంది.
    నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు.
27 దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు.
    నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
28 కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను.
    దేవుడు నా యెడల దయ చూపించాడు.
    నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం.
    దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబుతాను.

సామెతలు 29

29 ఒక మనిషి మొండివాడై, అతడు చేస్తున్నది తప్పు అని ప్రజలు అతనితో చెప్పినప్పుడల్లా అతనికి మరింత కోపం వస్తే అప్పుడు ఆ మనిషి ఆకస్మాత్తుగా నాశనం చేయబడతాడు. ఆశ ఏమీ ఉండదు.

పాలించేవాడు మంచి మనిషి అయితే ప్రజలంతా సంతోషిస్తారు. కాని ఒక దుర్మార్గుడు పాలన చేస్తే అప్పుడు ప్రజలంతా నిట్టూర్చి ఆరోపణ చేస్తారు.

ఒక మనిషి జ్ఞానమును ప్రేమిస్తే అప్పుడు అతని తండ్రికి చాలా సంతోషం. కాని ఒక మనిషి తన డబ్బును వేశ్యల కోసం వ్యర్థం చేస్తే అప్పుడు అతడు తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకొంటాడు.

ఒక రాజు న్యాయంగా ఉంటే, అప్పుడు ఆ రాజ్యం బలంగా ఉంటుంది. కాని రాజు స్వార్థపరుడై ప్రజల కోసం చేసే పనులన్నిటికి వారు అతనికి డబ్బు చెల్లించాల్సి వస్తే, అప్పుడు ఆ దేశం బలహీనంగా ఉంటుంది.

ఒక వ్యక్తి మనుష్యులకు చక్కని మాటలు చెప్పి తాను కోరింది సంపాదించాలని ప్రయత్నిస్తే, అప్పుడు అతడు తనకు తానే ఒక ఉచ్చు పెట్టుకుంటున్నట్టు అవుతుంది.

దుర్మార్గులు వారి స్వంత పాపం మూలంగానే ఓడించబడతారు. కాని ఒక మంచి మనిషి పాడుతూ సంతోషంగా ఉండగలడు.

మంచి మనుష్యులు పేద ప్రజలకోసం సరైనదానిని చేయాలని కోరుతారు. కాని చేడ్డవాళ్లు ఏమీ పట్టించుకోరు.

ఇతరులకంటే మేమే మంచివాళ్లం అనుకొనే మనుష్యులు చాలా చిక్కులు కలిగిస్తారు. వారు మొత్తం పట్టణాలనే గందరగోళం చేయగలరు. కాని జ్ఞానముగల మనుష్యులు శాంతి కలిగిస్తారు.

జ్ఞానముగల మనిషి తెలివి తక్కువ వానితో ఒక సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తే ఆ తెలివి తక్కువ వాడు వాదం పెట్టుకొని మూర్ఖంగా మాట్లాడుతాడు. ఆ ఇద్దరూ ఎన్నటికీ ఏకీభవించరు.

10 నరహంతకులు నిజాయితీగల మనుష్యులను ఎల్లప్పుడూ ద్వేషిస్తారు. ఆ దుర్మార్గులు నిజాయితీగల మంచి మనుష్యులను చంపాలని అనుకొంటారు.

11 తెలివితక్కువ వానికి త్వరగా కోపం వస్తుంది. కాని జ్ఞానముగల మనిషి సహనం కలిగి తనను తాను సంబాళించుకొంటాడు.

12 ఒక పాలకుడు అబద్ధాలు వింటే అప్పుడు అతని అధికారులంతా దుర్మార్గులు అవుతారు.

13 ఒక పేద మనిషి, పేదవాని దగ్గర దొంగిలించే మనిషి ఒక విధంగా ఇద్దరూ ఒకటే. వారిద్దరినీ యెహోవా చేశాడు.

14 ఒక రాజు పేదవారి యెడల న్యాయంగా ఉంటే అతడు చాలా కాలం పరిపాలిస్తాడు.

15 దెబ్బలు కొట్టటం, ఉపదేశాలు పిల్లలకు మంచివి. ఒక బిడ్డను తన ఇష్టానుసారంగా తల్లిదండ్రులు చేయనిస్తే అప్పుడు ఆ బిడ్డ తన తల్లికి అవమానం తీసికొని వస్తాడు.

16 దుర్మార్గులు గనుక దేశాన్ని పాలిస్తూంటే, అప్పుడు ఎక్కడ చూసినా పాపమే ఉంటుంది. కాని చివరికి మంచి మనుష్యులు జయిస్తారు.

17 నీ కుమారుడు తప్పు చేసినప్పుడు వానిని శిక్షించు, అప్పుడు వాడిని గూర్చి నీవు ఎల్లప్పుడూ అతిశయిస్తావు. వాడు నిన్ను ఎన్నడూ సిగ్గుపడనియ్యడు.

18 ఒక దేశం గనుక దేవునిచే నడిపించబడకపోతే అప్పుడు ఆ దేశంలో శాంతి ఉండదు. కాని దేవుని న్యాయచట్టానికి లోబడే దేశం సంతోషంగా ఉంటుంది.

19 ఒక సేవకునితో నీవు ఊరక మాటలే చెబితే అతడు పాఠం నేర్చుకోడు. ఆ సేవకుడు నీ మాటలు గ్రహించవచ్చుగాని అతడు లోబడడు.

20 ఒక మనిషి ఆలోచన లేకుండా మాట్లాడితే వానికి ఆశ లేదు. ఆలోచన లేకుండా మాట్లాడే ఒక మనిషికంటే ఒక బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ ఉంది.

21 నీ సేవకునికి కావలసినవి అన్నీ నీవు ఎల్లప్పుడూ ఇస్తూఉంటే చివరికి వాడు మంచి సేవకునిగా ఉండడు.

22 కోపంగల మనిషి చిక్కు కలిగిస్తాడు. మరియు కోపపడే మనిషి అనేక పాపాలతో దోషిగా ఉంటాడు.

23 ఒక మనిషి ఇతరులకంటే తానే మంచి వాడిని అనుకొంటే అదే అతనిని నాశనం చేస్తుంది. కాని ఒక మనిషి వినమ్రంగా ఉంటే అప్పుడు యితరులు అతనిని గౌరవిస్తారు.

24 కలిసి పని చేసే ఇద్దరు దొంగలు శత్రువులు. ఒక దొంగ మరో దొంగను బెదిరిస్తాడు. కనుక అతడు సత్యం చేప్పేందుకు న్యాయస్థానంలో బలవంతం చేయబడితే మాట్లాడేందుకు కూడ అతడు ఎంతో భయపడతాడు.

25 భయం ఒక ఉచ్చులాంటిది. కాని యెహోవాయందు నీవు నమ్మకం ఉంచితే, నీవు క్షేమంగా ఉంటావు.

26 చాలా మంది మనుష్యులు ఒక అధికారికి స్నేహితులుగా ఉండాలని కోరుకొంటారు. కాని ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేవాడు యెహోవా మాత్రమే.

27 నిజాయితీ లేని మనుష్యులను మంచి మనుష్యులు అసహ్యించుకొంటారు. మరియు దుర్మార్గులు నిజాయితీగల మనుష్యులను అసహ్యించుకొంటారు.

యోహాను 7:25-36

యేసు, “క్రీస్తా”?

25 అదే క్షణాన కొందరు యెరూషలేము ప్రజలు ఈ విధంగా అనటం మొదలుపెట్టారు: “వాళ్ళు చంపాలని ప్రయత్నిస్తున్నది ఈయనే కదా! 26 ఆయనిక్కడ బహిరంగంగా మాట్లాడుతున్నా వాళ్ళు ఆయన్ని ఒక్క మాట కూడా అనటం లేదే! అధికారులు కూడా ఈయన నిజంగా క్రీస్తు అని తలంచారా ఏమి? 27 కాని క్రీస్తు వచ్చేటప్పుడు ఎక్కడనుండి వస్తాడో ఎవ్వరికీ తెలియదు. మరి ఈయనెక్కడి నుండి వచ్చాడో మనకందరికి తెలుసు!”

28 అప్పుడు యేసు మందిరంలో ఇంకను మాట్లాడుతూ ఉండినాడు. ఆయన బిగ్గరగా, “ఔను! నేనెవరినో మీకు తెలుసు. నేను స్వతహాగా యిక్కడికి రాలేదు నన్ను పంపించినవాడు సత్యవంతుడు. ఆయనెవరో మీకు తెలియదు. 29 కాని ఆయన నన్ను పంపాడు కాబట్టి ఆయన దగ్గర నుండి నేను యిక్కడికీ వచ్చాను. కాబట్టి ఆయనెవరో నాకు తెలుసు” అని అన్నాడు.

30 ఇది విని వాళ్ళు ఆయన్ని బంధించాలని ప్రయత్నించారు. కాని ఆయన సమయం యింకా రాలేదు కనుక ఆయన మీద ఎవ్వరూ చేయి వేయలేదు. 31 అక్కడున్న వాళ్ళలో చాలా మంది ఆయన్ని విశ్వసించారు. వాళ్ళు, “క్రీస్తు వచ్చినప్పుడు ఈయన కన్నా గొప్ప అద్భుతాలు చేస్తాడా?” అని అన్నారు.

యూదా నాయకులు యేసును బంధించుటకు ప్రయత్నించటం

32 ప్రజలు ఆయన్ని గురించి యిలా మాట్లాడు కోవటం పరిసయ్యులు విన్నారు. వాళ్ళు, ప్రధాన యాజకులు కలిసి ఆయన్ని బంధించటానికి భటుల్ని పంపారు. 33 కనుక యేసు ప్రజలతో, “నేను మీతో కొద్దికాలమే ఉంటాను. ఆ తర్వాత నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తాను. 34 నా కోసం మీరు వెతుకుతారు. కాని నన్ను కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు” అని అన్నాడు.

35 యూదులు తమలో తాము, “మనం కనుక్కోకుండా ఉండేటట్లు ఇతడు ఎక్కడికి వెళ్ళదలిచాడు? గ్రీకుల మధ్య నివసిస్తున్న మనవాళ్ళ దగ్గరకు వెళ్ళి గ్రీకులకు బోధిస్తాడా? 36 ‘నా కోసం వెతుకుతారు, కాని కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు’ అని అతడు అనటంలో అర్థమేమిటి?” అని మాట్లాడుకున్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International