Revised Common Lectionary (Semicontinuous)
21-22 నేను చాలా తెలివి తక్కువ వాడను.
ధనికులను, దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను.
దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను.
తెలివితక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను.
23 నాకు కావలసిందంతా నాకు ఉంది. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను.
దేవా, నీవు నా చేయి పట్టుకొనుము.
24 దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము.
ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు.
25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు.
మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి?
26 ఒకవేళ నా మనస్సు,[a] నా శరీరం నాశనం చేయబడతాయేమో.
కాని నేను ప్రేమించే బండ[b] నాకు ఉంది.
నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు.
27 దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు.
నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
28 కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను.
దేవుడు నా యెడల దయ చూపించాడు.
నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం.
దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబుతాను.
22 ఐశ్వర్యవంతునిగా ఉండుటకంటే గౌరవింపబడటం మేలు. బంగారం, వెండి కంటే మంచి పేరు ఎక్కువ ముఖ్యం.
2 ధనికులు, దరిద్రులు అంతా ఒక్కటే. వాళ్లందరినీ యెహోవాయే సృష్టించాడు.
3 జ్ఞానముగలవారు కష్టం రావటం చూచి దాని దారిలో నుండి తప్పుకొంటారు. కాని తెలివి తక్కువ వాళ్లు తిన్నగా కష్టంలోనికి వెళ్లి, దాని మూలంగా శ్రమపడతారు.
4 యెహోవాను గౌరవించి దీనుడవుగా ఉండు. అప్పుడు నీకు ఐశ్వర్యం, ఘనత నిత్యజీవం ఉంటాయి.
5 దుర్మార్గులు అనేక కష్టాలవల్ల పట్టుబడతారు. అయితే తన ఆత్మ విషయం జాగ్రత్త గలవాడు కష్టాలకు దూరంగా ఉంటాడు.
6 ఒక బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే, జీవిచుటకు సరైన మార్గం నేర్చించు. అప్పుడు ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు కూడ ఆ మార్గంలోనే జీవించటానికి కొనసాగిస్తాడు.
7 పేదవాళ్లు ధనికులకు సేవకులు. అప్పు పుచ్చుకొనేవాడు, అప్పు ఇచ్చేవానికి సేవకుడు.
8 కష్టాలను కలిగించే మనిషి కష్టాల పంటనే కోస్తాడు. ఆ మనిషి ఇతరులకు కలిగించిన కష్టాల మూలంగా చివరికి అతడు నాశనం చేయబడతాడు.
9 ధారాళంగా ఇచ్చేవాడు ఆశీర్వదించబడతాడు. అతడు తన ఆహారం పేదవారితో పంచుకొంటాడు. గనుక ఆశీర్వదించబడుతాడు.
10 ఒక వ్యక్తి యితరులకంటె తానే మంచివాడిని అని తలిస్తే, వానిని బలవంతంగా వెళ్లగొట్టండి. అతడు వెళ్లి పోయినప్పుడు అతనితోబాటు ఆ కష్టం కూడా వెళ్లిపోతుంది. అంతటితో వివాదాలు అంతరిస్తాయి.
11 పవిత్ర హృదయం, దయగల మాటలను నీవు ప్రేమిస్తే రాజు నీ స్నేహితుడు అవుతాడు.
12 యెహోవాను ఎరిగిన మనుష్యులను ఆయన కాపాడుతూ, భద్రంగా ఉంచుతాడు. కాని ఆయనకు విరోధంగా ఉండే వారిని ఆయన నాశనం చేస్తాడు.
13 “నేను ఇప్పుడు పనికి వెళ్లలేను. బయట సింహం ఉంది. అది నన్ను చంపేస్తుందేమో” అంటాడు సోమరివాడు.
14 వ్యభిచార పాపం ఒక లోతైన గొయ్యిలాంటిది. ఆ గొయ్యిలో పడే మనిషి అంటే యెహోవాకు చాలా కోపం వస్తుంది.
15 పిల్లలు తెలివి తక్కువ పనులు చేస్తారు. కాని నీవు వారిని శిక్షిస్తే, వారు అలాంటి పనులు చేయకుండా ఉండటం నేర్చుకొంటారు.
16 నిన్ను నీవే ధనికుణ్ణి చేసుకొనేందుకుగాను, పేదవాళ్లను బాధించటం, ధనికులకు కానుకలు ఇవ్వటం ఇవి రెండూ నిన్ను దరిద్రునిగా చేస్తాయి.
ముప్పయి జ్ఞాన సూక్తులు
17 నేను చెప్పే మాటలు విను. జ్ఞానులు చెప్పిన మాటలు నేను నీకు నేర్పిస్తాను. ఈ ఉపదేశాల ద్వారా నేర్చుకో. 18 వీటిని నీవు జ్ఞాపకం ఉంచుకోవటం నీకు మంచిది. ఒకవేళ నీ పెదవులు ఒప్పుకొనేందుకు అలవాటు పడితే అది నీకు సహాయంగా ఉంటుంది.
19 ఈ విషయాలు ఇప్పుడు నీకు నేను నేర్పిస్తాను. నీవు యెహోవాను సమ్ముకోవాలని నేను కోరుతున్నాను.
20 నీ కోసం నేను ముప్పయి సూక్తులు వ్రాశాను. ఇవి సలహాలు, జ్ఞానముగల మాటలూను. 21 ఈ మాటలు సత్యమైన ముఖ్య విషయాలను నీకు నేర్పిస్తాయి. అప్పుడు నిన్ను పంపినవానికి నీవు మంచి జవాబులు ఇవ్వగలవు.
నీతిమంతుడొక్కడూ లేడు
9 మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్ళకంటే ఉత్తమమైనవాళ్ళమనా? ఎన్నటికి కాదు. యూదులు, యూదులుకానివాళ్ళు, అందరూ సమానంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే రుజువు చేసాను. 10 ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది:
“నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు!
11 అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు.
దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు.
12 అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.
అందరూ కలిసి పనికిరానివాళ్ళైపోయారు.
మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడు!”(A)
13 “వాళ్ళ నోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి.
వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి.”(B)
“వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!”(C)
14 “వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!”(D)
15 “వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి.
16 వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశనాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు.
17 వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!”(E)
18 “వాళ్ళ కళ్ళలో దైవభీతి కనిపించదు.”(F)
19 ధర్మశాస్త్ర నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసినవారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ, అంటే యూదులు కానివాళ్ళేకాక, యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. 20 ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని, ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము.
© 1997 Bible League International