Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సామెతలు 1:20-33

మంచి స్త్రీ—జ్ఞానము

20 ఇలా విను! జ్ఞానము ప్రజలకు ఉపదేశించటానికి ప్రయత్నిస్తుంది. ఆమె (జ్ఞానము) వీధుల్లో, సంతల్లో అరుస్తుంది. 21 రద్దీగల వీధి మూలల్లో ఆమె (జ్ఞానము) పిలుస్తోంది. ఆమె (జ్ఞానము) తన మాటలు వినేందుకు ప్రజలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తూ పట్టణ ద్వారాల దగ్గర ఉంటూ (జ్ఞానము) చెపుతుంది:

22 “మీరు వెర్రివాళ్లు. ఇంకెన్నాళ్లు మీరు ఇలా వెర్రి పనులు చేస్తూనే ఉంటారు? ఎన్నాళ్లు మీరు తెలివిని ద్వేషీస్తూ ఉంటారు? 23 మీరు పశ్చాత్తాపపడి నా సలహా, నా ఉపదేశం విని ఉంటే, నాకు తెలిసింది అంతా నేను మీతో చెప్పి ఉండేదాన్ని. నాకు ఉన్న తెలివి అంతా మీకు ఇచ్చి ఉండేదాన్ని.

24 “కాని మీరు నా మాట వినేందుకు తిరస్కరించారు. సహాయం చేయటానికి నేను ప్రయత్నించాను. నేను నా చేయి అందించాను. కాని నా సహాయం స్వీకరించటానికి మీరు నిరాకరించారు. 25 నా సలహా అంతటినీ మీరు నిర్లక్ష్యం చేసి, తిప్పికొట్టారు. నా మాటలు స్వీకరించటానికి మీరు నిరాకరించారు. 26 అందుచేత నేను మీ కష్టం చూచి నవ్వుతాను. మీకు కష్టం కలగటం చూచి నేను సరదా పడతాను. 27 గొప్ప కష్టం తుఫానులా మీ మీదికి వస్తుంది. సమస్యలు ఒక బలమైన గాలిలా మీ మీద కొడతాయి. మీ కష్టాలు, మీ విచారం మీ మీద మహా గొప్ప భారంగా ఉంటాయి.

28 “ఈ సంగతులన్నీ జరిగినప్పుడు మీరు నా సహాయం కోసం అడుగుతారు. కాని నేను మీకు సహాయం చేయను. మీరు నాకోసం వెదుకుతారు, కాని మీరు నన్ను కనుగొనలేరు. 29 మీరు ఎన్నడూ నా తెలివిని కోరుకోలేదు, గనుక నేను మీకు సహాయం చేయను. మీరు యెహోవాకు భయపడి ఆయనను గౌరవించుటకు నిరాకరించారు. 30 నా సలహా మాటలు వినేందుకు ప్రజలారా మీరు నిరాకరించారు. నేను సరైనదారి మీకు చూపించినప్పుడు మీరు నా మాట వినేందుకు నిరాకరించారు. 31 కనుక మీరు మీ స్వంత విదానంలోనే పనులు చేసుకోవాలి. మీ స్వంత కీడు మార్గాల్లో జీవిస్తూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు.

32 “అవివేకులు జ్ఞానాన్ని అనుసరించేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తారు. వారి బుద్ధిహీన పధ్ధతులలో కొనసాగటం వారికి సంతోషం, అదే వారిని చంపుతుంది. 33 కాని, నాకు విధేయత చూపే వ్యక్తి క్షేమంగా జీవిస్తాడు. ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. అతడు కీడుకు భయపడాల్సిన అవసరం ఉండదు.”

కీర్తనలు. 19

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
    యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
    ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
    మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
    వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.

అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
    తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
    ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
    మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
    దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.

యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
    అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
    జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
యెహోవా చట్టాలు సరియైనవి.
    అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
    ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.

యెహోవాను ఆరాధించుట మంచిది.
    అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
    అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
    సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
    నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.

12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
    కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
    ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.

Error: Book name not found: Wis for the version: Telugu Holy Bible: Easy-to-Read Version
యాకోబు 3:1-12

నాలుకను మచ్చిక చేసుకొండి

నా సోదరులారా! దేవుడు మిగతావాళ్ళకన్నా, బోధించే మనల్ని కఠినంగా శిక్షస్తాడని మీకు తెలుసు. కనుక అందరూ బోధకులు కావాలని ఆశించకండి.

మనమంతా ఎన్నో తప్పులు చేస్తుంటాము. తాను ఆడే మాటల్లో ఏ తప్పూ చేయనివాడు పరిపూర్ణుడు. అలాంటివాడు కళ్ళెం వేసి తన శరీరాన్ని అదుపులో పెట్టుకోగలడు. చెప్పినట్లు వినాలనే ఉద్దేశ్యంతో మనం గుఱ్ఱం నోటికి కళ్ళెం వేస్తాం. అలా చేస్తేనే మనం దాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోగలము. ఓడను ఉదాహరణగా తీసుకొండి. అది చాలా పెద్దగా ఉంటుంది. బలమైన గాలివల్ల అది నడుస్తుంటుంది. కాని దాన్ని నావికుడు చిన్న చుక్కానితో తన యిష్టం వచ్చిన చోటికి తీసుకు వెళ్ళగలడు. అదేవిధంగా నాలుక శరీరంలో చిన్న భాగమైనా గొప్పలు పలుకుతుంది.

చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని ఏ విధంగా కాలుస్తుందో గమనించండి. నాలుక నిప్పులాంటిది. అది చెడుతో నిండిన ప్రపంచానికి ప్రతినిధిగా మన శరీరంలో ఉంది. అది మన శరీరంలో ఒక భాగంగా ఉండి శరీరమంతా చెడును వ్యాపింపచేస్తుంది. మనిషి యొక్క జీవితానికే నిప్పంటిస్తుంది. నాలుక ఈ నిప్పును నరకం నుండి పొందుతుంది.

మానవుడు అన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని, ప్రాకే జీవుల్ని, సముద్రంలోని ప్రాణుల్ని మచ్చిక చేసుకొంటున్నాడు; ఇదివరకే మచ్చిక చేసుకొన్నాడు. కాని నాలుకను ఎవ్వరూ మచ్చిక చేసుకోలేదు. అది ప్రాణాంతకమైన విషంతో కూడుకున్న ఒక అవయవం. అది చాలా చెడ్డది. విరామం లేకుండా ఉంటుంది. మనం, మన నాలుకతో ప్రభువును, తండ్రిని స్తుతిస్తాము. అదే నాలుకతో దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుణ్ణి శపిస్తాము. 10 స్తుతి, శాపము ఒకే నోటినుండి సంభవిస్తున్నాయి. నా సోదరులారా! ఇది తప్పు. 11 ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు ఒకే ఊట నుండి పారుతున్నాయా? 12 నా సోదరులారా! అంజూరపు చెట్టుకు ఒలీవ పండ్లు, లేక ద్రాక్షతీగకు అంజూరపు పండ్లు కాస్తాయా? అలాగే ఉప్పునీటి ఊటనుండి మంచి నీళ్ళు ఊరవు.

మార్కు 8:27-38

పేతురు యేసును క్రీస్తు అని చెప్పటం

(మత్తయి 16:13-20; లూకా 9:18-21)

27 యేసు తన శిష్యులతో కలిసి, కైసరయ ఫిలిప్పి పట్టణానికి చుట్టూవున్న పల్లెలకు వెళ్ళాడు. దారిలో యేసు వాళ్ళతో, “ప్రజలు నేనెవరని అనుకొంటున్నారు?” అని అడిగాడు.

28 వాళ్ళు, “బాప్తిస్మము నిచ్చే యోహాను అని కొందరు, ఏలీయా అని కొందరు, ప్రవక్తలలో ఒకడై ఉండవచ్చని మరికొందరు అంటున్నారు” అని సమాధానం చెప్పారు.

29 “మరి మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని అడిగాడు.

పేతురు, “మీరే క్రీస్తు”[a] అని సమాధానం చెప్పాడు.

30 తనను గురించి ఎవ్వరికి చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు.

యేసు తన మరణాన్ని గురించి చెప్పటం

(మత్తయి 16:21-28; లూకా 9:22-27)

31 ఆ తదుపరి యేసు వాళ్ళకు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు: “మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానయాజకులు, శాస్త్రులు, ఆయన్ని తృణీకరిస్తారు. ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికివస్తాడు.” 32 యేసు ఈ విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడాడు.

పేతురు ఆయన చేయిపట్టుకొని వారించటం మొదలు పెట్టాడు. 33 కాని యేసు వెనక్కు తిరిగి తన శిష్యుల వైపు ఒకసారి చూసి, పేతురుతో “సైతానా! నాముందు నుండి వెళ్ళిపో! నీవు మానవరీతిగా ఆలోచిస్తున్నావు కాని, దేవుని రీతిగా కాదు” అని అన్నాడు.

34 ఆ తర్వాత తన శిష్యుల్ని, ప్రజల్ని దగ్గరకు పిలిచి, “మీరు నన్ను అనుసరింపదలిస్తే, తనను తాను విసర్జించుకొని తన సిలువను మోస్తూ అనుసరించాలి. 35 ఎందుకంటే, తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నాకోసం, సువార్త కోసం ప్రాణాన్ని పోగొట్టుకొన్నవాడు దాన్ని కాపాడుకొంటాడు. 36 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని వదులుకొన్న మనిషికి ఏంలాభం కలుగుతుంది? 37 తన ప్రాణాన్ని తిరిగి పొందటానికి మనిషి ఏంయివ్వగలడు? 38 ఈ తరం వ్యభిచారంతో, పాపంతో నిండివుంది. నా విషయంలో కాని, నా బోధనల విషయంలో కాని ఎవ్వడు సిగ్గుపడతాడో, మనుష్య కుమారుడు తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతలతో కలసి వచ్చినప్పుడు వాని విషయంలో సిగ్గుపడతాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International