Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.
అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
24 సోమరి తనను పోషించుకొనేందుకు తాను చేయాల్సిన పనులు కూడ చేయడు. తన పళ్లెంలోని భోజనం తన నోటి వద్దకు ఎత్తుకోటానికి కూడా అతనికి బద్ధకమే.
25 దేనికీ గౌరవం చూపనివారు శిక్షించబడాలి. అప్పుడు బుద్ధిహీనులు ఒక పాఠం నేర్చుకొంటారు. జ్ఞానముగల మనిషి విమర్శించ బడినప్పుడు నేర్చుకొంటాడు.
26 ఒక వ్యక్తి తన తండ్రి దగ్గర దొంగతనం చేసి తన తల్లిని బలవంతంగా వెళ్లగొడితే, అతడు చాలా దుర్మార్గుడు. అతడు తనకు తానే సిగ్గు, అవమానం తెచ్చుకొంటాడు.
27 నేర్చుకొనేందుకు నీవు నిరాకరిస్తే, అప్పటికే నీకు తెలిసిన విషయాలను త్వరలోనే నీవు మరచిపోతావు.
28 సాక్షి నమ్మకంగా లేకపోతే అప్పుడు తీర్పు న్యాయంగా ఉండదు. దుర్మార్గులు చెప్పే విషయాలు మరింత దుర్మార్గం తెచ్చి పెడతాయి.
29 ఇతరులకంటే తానే మంచి వాడిని అనుకొనే మనిషి శిక్షించబడతాడు. బుద్ధిహీనుడు తనకోసం దాచబడిన శిక్షను పొందుతాడు.
17 విశ్వాసంతో పాటు క్రియ లేకపోతే ఆ విశ్వాసం పూర్తిగా నిష్ప్రయోజనమైపోతుంది.
18 కాని, “ఒకనిలో విశ్వాసం ఉండవచ్చు. మరొకనిలో క్రియ ఉండవచ్చు!” అని మీరనవచ్చు! అలాగైతే క్రియలు లేకుండా మీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపండి. నేను క్రియారూపకంగా నా విశ్వాసాన్ని చూపుతాను. 19 ఒక్కడే దేవుడున్నాడని మీరు విశ్వసిస్తారు. మంచిదే. దయ్యాలు కూడా దాన్ని నమ్ముతాయి. అయినా, దేవుడు తమను శిక్షిస్తాడేమోనని భయపడ్తూ ఉంటాయి.
20 ఓ మూర్ఖుడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న[a] దానికి నీకు ఋజువు కావాలా? 21 మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై బలిగా యివ్వటానికి సిద్ధమైనందుకు దేవుడతణ్ణి, అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణించలేదా? 22 అతనిలో ఉన్న విశ్వాసము క్రియతో కలిసి పని చెయ్యటం మీరు గమనించారు. అతడు చేసిన క్రియ అతని విశ్వాసానికి పరిపూర్ణత కలిగించింది. 23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. తద్వారా దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు”(A) అని లేఖనాల్లో చెప్పిన విషయం నిజమైంది. దేవుడతణ్ణి తన మిత్రునిగా పిలిచాడు. 24 మానవునిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే కాకుండా అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణింపబడటం మీరు చూసారు.
25 మరొక ఉదాహరణ రాహాబు. ఆమె గూఢచారులకు ఆతిథ్యమిచ్చి వాళ్ళను వేరొక దారిన పంపివేసింది. ఆమె చేసిన క్రియను బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలిగా పరిగణించ లేదా?
26 ఆత్మలేని శరీరం ఏ విధంగా నిర్జీవమైందో అదే విధంగా క్రియలేని విశ్వాసము నిర్జీవమైనది.
© 1997 Bible League International