Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సామెతలు 22:1-2

22 ఐశ్వర్యవంతునిగా ఉండుటకంటే గౌరవింపబడటం మేలు. బంగారం, వెండి కంటే మంచి పేరు ఎక్కువ ముఖ్యం.

ధనికులు, దరిద్రులు అంతా ఒక్కటే. వాళ్లందరినీ యెహోవాయే సృష్టించాడు.

సామెతలు 22:8-9

కష్టాలను కలిగించే మనిషి కష్టాల పంటనే కోస్తాడు. ఆ మనిషి ఇతరులకు కలిగించిన కష్టాల మూలంగా చివరికి అతడు నాశనం చేయబడతాడు.

ధారాళంగా ఇచ్చేవాడు ఆశీర్వదించబడతాడు. అతడు తన ఆహారం పేదవారితో పంచుకొంటాడు. గనుక ఆశీర్వదించబడుతాడు.

సామెతలు 22:22-23

—1—

22 పేదవారివద్ద నుండి దొంగిలించటం సులభం. కాని అలా చేయవద్దు. న్యాయస్థానంలో పేదవాణ్ణి అణగ తొక్కవద్దు. 23 యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. ఆయన వారిని బలపరుస్తాడు, వారివద్ద నుండి తీసికొన్నవి ఎవరినైనా సరే వారి వస్తువులను ఆయన తీసివేస్తాడు.

కీర్తనలు. 125

యాత్ర కీర్తన.

125 యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు.
    వారు ఎన్నటికీ కదలరు.
    వారు శాశ్వతంగా కొనసాగుతారు.
యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి.
    అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.
దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు.
    దుర్మార్గులు అలా చేస్తే అప్పుడు మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం మొదలుపెడతారేమో.

యెహోవా, మంచి మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
    పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము.
    వాళ్లు వక్రమైన పనులు చేస్తారు.

ఇశ్రాయేలులో శాంతి ఉండనిమ్ము.

యాకోబు 2:1-10

పక్షపాతం చూపరాదు

నా సోదరులారా! తేజోవంతుడైన మన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్న మీరు పక్షపాతం చూపకూడదు. బంగారు ఉంగరాలు, మంచి దుస్తులు వేసుకొన్నవాడొకడు, మాసిన దుస్తులు వేసుకొన్నవాడొకడు మీ సమావేశానికి వస్తారనుకోండి. అప్పుడు మీరు మంచి దుస్తులు వేసుకొన్నవాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ, “రండి! ఈ మంచి స్థానంలో కూర్చోండి” అని అంటూ, పేదవానితో, “నీవక్కడ నిలబడు!” అనిగాని, “నా కాళ్ళ దగ్గర కూర్చో” అనిగాని అంటే, మీరు వ్యత్యాసము చూపుతున్నట్లే కదా! దుర్బుద్ధితో తీర్పు చెప్పినట్లే కదా!

నా ప్రియమైన సోదరులారా! ప్రపంచం దృష్టిలో పేదవాళ్ళు విశ్వాసంలో ధనికులు కావాలనీ, వాళ్ళు తన రాజ్యానికి వారసులు కావాలనీ దేవుడు వాళ్ళను ఎన్నుకోలేదా? తనను ప్రేమించినవాళ్ళకు రాజ్యాన్నిస్తానని దేవుడు యింతకు క్రితమే వాగ్దానం చేసాడు. మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. మిమ్మల్ని దోచుకొనే వాళ్ళు ధనికులే కదా! వాళ్ళేకదా మిమ్ములను న్యాయస్థానానికి ఈడ్చేది? మీరు ఎవరికి చెందారో గౌరవప్రదమైన ఆయన పేరును దూషిస్తున్నది వాళ్ళే కాదా?

“నీ పొరుగింటివాణ్ణి నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా ప్రేమించు”(A) అని ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞను మీరు నిజంగా పాటిస్తే మీలో సత్‌ప్రవర్తన ఉన్నట్లే. కాని ఒకవేళ మీరు పక్షపాతం చూపితే పాపం చేసినవాళ్ళౌతారు. తద్వారా ధర్మశాస్త్రం ప్రకారం మీరు నీతిని ఉల్లంఘించినవాళ్ళౌతారు.

10 ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలన్నిటినీ పాటిస్తూ ఒకే ఒక నియమాన్ని ఉల్లంఘిస్తే అలాంటివాడు ధర్మశాస్త్రాన్నంతా ఉల్లంఘించినవాడౌతాడు.

యాకోబు 2:11-13

11 ఎందుకంటే, “వ్యభిచారం చేయరాదు”(A) అని అన్నవాడే “హత్యచేయరాదు” అని కూడా అన్నాడు. మీరు వ్యభిచారం చేసివుండక పోవచ్చు. కాని హత్య చేసి ఉంటే! అలాంటప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లే కదా!

12 స్వేచ్ఛను కలిగించే క్రొత్త ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు పొందనున్న వాళ్ళలా ప్రవర్తించండి. అదేవిధంగా మాట్లాడండి. 13 దేవుడు తీర్పు చెప్పేటప్పుడు దయాహీనులపై దయ చూపడు. కాని దయచూపిన వాళ్ళు తీర్పు చెప్పే సమయంలో ఆనందిస్తారు.

యాకోబు 2:14-17

విశ్వాసము, క్రియ

14 నా సోదరులారా! “నాకు విశ్వాసం ఉంది” అని అన్న వ్యక్తి ఆ విశ్వాసాన్ని క్రియా రూపకంగా చూపకపోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి రక్షించగలదా? 15 ఒక సోదరుడో లేక సోదరియో కూడూ గుడ్డా లేక బాధపడ్తున్నారనుకోండి. 16 అప్పుడు మీరు అతనితో, “క్షేమంగా వెళ్ళిరా! కడుపునిండా తిని, ఒంటి నిండా దుస్తులు వేసుకో!” అని అంటూ వాళ్ళ అవసరాలు తీర్చకపోతే దానివల్ల వచ్చిన లాభమేమిటి? 17 విశ్వాసంతో పాటు క్రియ లేకపోతే ఆ విశ్వాసం పూర్తిగా నిష్ప్రయోజనమైపోతుంది.

మార్కు 7:24-37

యేసు యూదేతర స్త్రీకి సహాయం చేయటం

(మత్తయి 15:21-28)

24 యేసు ఆ ప్రాంతం వదిలి తూరు[a] ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒకరి యింటికి వెళ్ళాడు. తనక్కడ ఉన్నట్లు ఎవ్వరికి తెలియరాదని ఆయన ఉద్దేశ్యం. కాని దాన్ని రహస్యంగా ఉంచలేకపోయాడు. 25 ఒక స్త్రీ వెంటనే యేసును గురించి విన్నది. ఆమె కూతురుకు దయ్యం పట్టివుంది. ఆమె అక్కడికి వచ్చి యేసు కాళ్ళపై పడింది. 26 ఆమె గ్రీసు దేశస్తురాలు. జన్మస్థానం సిరియ దేశంలోని ఫొనీషియా. తన కూతురు నుండి ఆ దయ్యాన్ని వదిలించమని ఆమె యేసును వేడుకొంది.

27 ఆయన ఆమెతో, “మొదట చిన్నపిల్లల్ని వాళ్ళకు కావలసినవి తిననివ్వాలి. ఎందుకంటే చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకొని కుక్కలకు వేయటం సమంజసం కాదు”[b] అని అన్నాడు.

28 “ఔను! ప్రభూ! కాని, బల్లక్రిందవున్న కుక్కలు కూడా చిన్నపిల్లలు వదిలివేసిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె సమాధానం చెప్పింది.

29 అప్పుడు యేసు ఆమెతో, “అలాంటి సమాధానం చెప్పావు కనుక వెళ్ళు. దయ్యం నీ కూతుర్ని వదిలి వెళ్ళింది” అని అన్నాడు.

30 ఆమె యింటికి వెళ్ళి తన కూతురు పడకపై పడుకొని ఉండటం చూసింది. దయ్యం నిజంగా ఆమె నుండి వెళ్ళిపోయింది.

చెముడు, నత్తి ఉన్న వానికి నయం చేయటం

31 ఆ తర్వాత యేసు తూరు ప్రాంతం వదిలి, సీదోను వెళ్ళి అక్కడినుండి దెకపొలి ద్వారా గలిలయ సముద్రం చేరుకొన్నాడు. 32 అక్కడ కొందరు చెముడు, నత్తి ఉన్న ఒక మనిషిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. అతనిపై తన చేయి పెట్టమని వాళ్ళు యేసును వేడుకొన్నారు.

33 యేసు అతణ్ణి ప్రజలనుండి ప్రక్కకు పిలుచుకు వెళ్ళి తన చేతి వ్రేళ్ళను అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి ఆ వ్యక్తి యొక్క నాలుక తాకాడు. 34 ఆకాశం వైపుచూసి నిట్టూర్చి, “ఎఫ్ఫతా” అని అన్నాడు. (ఎఫ్ఫతా అంటే “తెరుచుకో” అని అర్థం.) 35 వెంటనే అతని చెవులు తెరుచుకొన్నాయి. అతని నాలుక వదులైంది. అతడు స్పష్టంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

36 యేసు దీన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. కాని ఆయన చెప్పినకొద్దీ వాళ్ళు దాన్ని గురించి యింకా ఎక్కువగా చెప్పారు. 37 ప్రజల ఆశ్చర్యానికి అంతులేక పోయింది. వాళ్ళు, “ఈయన అన్నీ బాగా చేస్తాడు. పైగా చెవిటివాడు వినేటట్లు, నత్తివాడు మాట్లాడేటట్లు కూడా చేస్తున్నాడు” అని అన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International