Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 125

యాత్ర కీర్తన.

125 యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు.
    వారు ఎన్నటికీ కదలరు.
    వారు శాశ్వతంగా కొనసాగుతారు.
యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి.
    అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.
దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు.
    దుర్మార్గులు అలా చేస్తే అప్పుడు మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం మొదలుపెడతారేమో.

యెహోవా, మంచి మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
    పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము.
    వాళ్లు వక్రమైన పనులు చేస్తారు.

ఇశ్రాయేలులో శాంతి ఉండనిమ్ము.

సామెతలు 8:1-31

జ్ఞానము, ఒక మంచి స్త్రీ

జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి!
    మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది.
మార్గం ప్రక్కగా, దారులు కలిసే చొట
    కొండ శిఖరము మీద అవి నిలబడ్డాయి.
పట్టణంలోకి ద్వారాలు తెరచుకొనే చోట అవి వున్నాయి.
    తెరువబడిన ద్వారాల్లోనుంచి అవి పిలుస్తున్నాయి.

జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, మిమ్మల్ని
    నేను పిలుస్తున్నా మనుష్యులందరినీ నేను పిలుస్తున్నా.
మీరు బుద్ధిహీనులైతే, జ్ఞానం గలిగి ఉండటం నేర్చుకోండి.
    అవివేకులారా, తెలివిగలిగి ఉండటం నేర్చుకోండి.
వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి.
    సరైన విషయాలు నేను మీకు చెబుతాను.
నా మాటలు సత్యం.
    చెడు అబద్ధాలు నాకు అసహ్యం.
నేను చెప్పే విషయాలు సరైనవి.
    నా మాటల్లో తప్పుగాని, అబద్ధంగాని ఏమీలేదు.
తెలివిగల వాడికి ఈ విషయాలన్నీ తేటగా ఉంటాయి.
    తెలివిగల మనిషి ఈ సంగతులు గ్రహిస్తాడు.
10 నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండికంటె విలువైనది.
    ఆ తెలివి మంచి బంగారం కంటె ఎక్కువ విలువగలది.
11 జ్ఞానము ముత్యాలకంటె విలువగలది.
    ఒకడు కోరుకోదగిన దేని కంటే కూడ జ్ఞానము ఎక్కువ విలువగలది.

జ్ఞానము విలువ

12 “నేను జ్ఞానాన్ని,
    నేను మంచి తీర్పుతో జీవిస్తాను.
    తెలివితో, మంచి పథకాలతో నేను ఉండటం మీరు చూడగలరు.
13 ఒక మనిషి యెహోవాను గౌరవిస్తే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు.
    నేను (జ్ఞానము) గర్విష్ఠులను, ఇతరులకంటె మేమే గొప్ప అనుకొనేవాళ్లను అసహ్యించుకొంటాను.
    చెడు మార్గాలు, అబద్ధపు నోరు నాకు అసహ్యం.
14 కాని మంచి నిర్ణయాలు చేయటానికి, మంచితీర్పు చెప్పటానికి మనుష్యులకు నేను (జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను.
    తెలివిని, శక్తిని నేను వారికి ఇస్తాను!
15 రాజులు పరిపాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తారు.
    న్యాయ చట్టాలు చేయటానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు.
16 భూమిమీద ప్రతి మంచి పాలకుడూ తన క్రింద ఉన్న
    ప్రజలను పాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తాడు.
17 నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను.
    నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను కనుగొంటారు.
18 నేను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి.
    నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను.
19 నేను ఇచ్చేవి మేలిమి బంగారంకంటె మంచివి.
    నా కానుకలు స్వచ్ఛమైన వెండికంటే మంచివి.
20 నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను.
    సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను.
21 నన్ను ప్రేమించే మనుష్యులకు నేను ఐశ్వర్యం ఇస్తాను.
    అవును, వారి గృహాలను ఐశ్వర్యాలతో నేను నింపుతాను.

22 “ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం క్రిందట
    యెహోవాచేత చేయబడింది నేనే
23 నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను.
    ప్రపంచం ప్రారంభం గాక ముందే నేను చేయబడ్డాను.
24 నేను (జ్ఞానము) మహా సముద్రాలు పుట్టక ముందే పుట్టాను.
    నీళ్లు లేక ముందు నేను చేయబడ్డాను.
25 నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను.
26     యెహోవా భూమిని చేయకముందే నేను (జ్ఞానము) పుట్టాను. పొలాలకంటె ముందు నేను పుట్టాను.
    ప్రపంచంలోని మొదటి ధూళిని, దేవుడు చేయక ముందే నేను పుట్టాను.
27 యెహోవా ఆకాశాలను చేసినప్పుడు
    నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను.
    యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు,
    మహా సముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు
    నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను.
28 ఆకాశంలో యెహోవా మేఘాలను
    ఉంచకముందే నేను పుట్టాను.
    మహా సముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు
    నేను అక్కడ ఉన్నాను.
29 సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు
    నేను అక్కడ ఉన్నాను.
    యెహోవా అనుమతించిన దానికంటె నీళ్లు ఎత్తుగా పోవు,
    భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను.
30 నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు.
    ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను.
31 యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూచి ఉప్పొంగి పోయాడు.
    అక్కడ ఆయన మనుష్యుల విషయమై సంతోషించాడు.

మత్తయి 15:21-31

యేసు యూదులు కాని స్త్రీకి సహాయం చేయటం

(మార్కు 7:24-30)

21 యేసు ఆ ప్రదేశాన్ని వదిలి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. 22 కనాను ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ యేసు దగ్గరకు ఏడుస్తూ వచ్చి, “ప్రభూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు. నా కూతురు దయ్యం పట్టి చాలా బాధ పడుతుంది” అని ఆయనతో అన్నది.

23 యేసు ఏ సమాధానం చెప్పలేదు. అందువల్ల శిష్యులు వచ్చి, “ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ మనవెంట వస్తోంది. ఆమెను వెళ్ళమనండి” అని విజ్ఞప్తి చేసారు.

24 యేసు, “తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల[a] కోసం మాత్రమే దేవుడు నన్ను పంపాడు” అని అన్నాడు.

25 ఆ స్త్రీ వచ్చి యేసు ముందు మోకరిల్లి, “ప్రభూ! నాకు సహాయం చెయ్యండి!” అని అడిగింది.

26 యేసు, “దేవుని సంతానానికి చెందిన ఆహారం తీసుకొని కుక్కలకు వెయ్యటం న్యాయం కాదు” అని సమాధానం చెప్పాడు.

27 “ఔను ప్రభూ! కాని, కుక్కలు కూడా తమ యజమాని విస్తరు నుండి పడిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె అన్నది.

28 అప్పుడు యేసు, “అమ్మా! నీలో ఉన్న విశ్వాసం గొప్పది. నీవు కోరినట్లే జరుగుతుంది” అని సమాధానం చెప్పాడు. ఆ క్షణంలోనే ఆమె కూతురుకు నయమై పోయింది.

యేసు అనేకులను నయం చేయటం

29 యేసు అక్కడి నుండి బయలుదేరి, గలిలయ సరస్సు తీరము మీదుగా నడిచి కొండ మీదికి వెళ్ళి కూర్చున్నాడు.

30 ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు. వాళ్ళు తమ వెంట కుంటి వాళ్ళను, గ్రుడ్డి వాళ్ళను, కాళ్ళు చేతులు పడి పోయిన వాళ్ళను, మూగ వాళ్ళను యింకా అనేక రకాల రోగాలున్న వాళ్ళను తీసికొని వచ్చి ఆయన కాళ్ళ ముందు పడ వేసారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు. 31 మూగ వాళ్ళకు మాట వచ్చింది. కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకు నయమైపోయింది. కుంటి వాళ్ళు నడిచారు. గ్రుడ్డి వాళ్ళకు చూపు వచ్చింది. ఇవన్నీ జరగటం చూసి ప్రజలు ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International