Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 125

యాత్ర కీర్తన.

125 యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు.
    వారు ఎన్నటికీ కదలరు.
    వారు శాశ్వతంగా కొనసాగుతారు.
యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి.
    అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.
దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు.
    దుర్మార్గులు అలా చేస్తే అప్పుడు మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం మొదలుపెడతారేమో.

యెహోవా, మంచి మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
    పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము.
    వాళ్లు వక్రమైన పనులు చేస్తారు.

ఇశ్రాయేలులో శాంతి ఉండనిమ్ము.

సామెతలు 4:10-27

10 కనుక నా మాట విను. నేను చెప్పే సంగతులను జరిగించు. అప్పుడు నీవు ఎక్కువ కాలం జీవిస్తావు. 11 జ్ఞానాన్ని గూర్చి నేను నీకు నేర్పిస్తున్నాను. నేను నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నాను. 12 ఈ మార్గాన్ని అనుసరించు, అప్పుడు నీ పాదం ఉచ్చులో చిక్కుకోదు. నీవు తూలిపోకుండా పారిపోవచ్చు. నీవు చేయాలని ప్రయత్నించే వాటిలో నీవు క్షేమంగా ఉంటావు. 13 ఈ పాఠాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఈ పాఠాలు మరచిపోకు. అవే నీకు జీవం!

14 దుర్మార్గులు నడిచే మార్గాన్ని అనుసరించకు. అలా నడుచుకొనవద్దు. వారిలా ఉండేందుకు ప్రయత్నించవద్దు. 15 దుర్మార్గానికి దూరంగా ఉండు. దానికి దగ్గరగా వెళ్లవద్దు. దానిని దాటి తిన్నగా వెళ్లిపో. 16 చెడ్డవాళ్లు ఏదో ఒక చెడు చేసేటంత వరకు నిద్రపోలేరు. ఆ మనుష్యులు మరో వ్యక్తిని బాధించేటంతవరకు నిద్రపోలేరు. 17 ఆ మనుష్యులు దౌర్జన్యము అనే మద్యం తాగుతూ దుర్మార్గము అనే రొట్టెను తింటారు. ఇతరులను బాధించకుండా జీవించలేరు.

18 మంచి మనుష్యులు ఉదయకాంతిలా ఉంటారు. సూర్యోదయమౌతుంది. ఆ రోజు మరింత ప్రకాశవంతంగా సంతోషంగా తయారవుతుంది. 19 చెడు మనుష్యులు చీకటి రాత్రివలె ఉంటారు. వారు చీకటిలో తప్పిపోయి, వారికి కనపడని వాటి మీద పడిపోతూవుంటారు.

20 నా కుమారుడా, నేను చెప్పే విషయాలు గమనించు. నా మాటలు జాగ్రత్తగా విను. 21 నా మాటలు నిన్ను విడిచి పోనియ్యకు. నేను చెప్పే సంగతులు జ్ఞాపకం ఉంచుకో. 22 నా ఉపదేశము వినేవారికి అది జీవం కలిగిస్తుంది నా మాటలు శరీరానికి మంచి ఆరోగ్యంలాంటివి. 23 నీవు తలంచే విషయాలలో నీవు జాగ్రత్తగా ఉండటమే నీకు అతి ముఖ్యమైన విషయం. నీ తలంపులు నీ జీవితాన్ని ఆధీనంలో ఉంచుకుంటాయి.

24 సత్యమును వక్రం చేయవద్దు, సరికాని మాటలు చేప్పవద్దు. అబద్ధాలు చెప్పకు. 25 నీ యెదుట ఉన్న జ్ఞానముగల మంచి ఆశయాలనుండి నిన్ను నీవు తిరిగి పోనివ్వకు. 26 సరైన విధంగా జీవించుటకు చాలా జాగ్రత్తగా ఉండు, అప్పుడు నీకు స్థిరమైన మంచిజీవితం ఉంటుంది. 27 తిన్నని మార్గం విడిచిపెట్టకు అది మంచిది, సరైనది. కాని కీడు నుండి ఎల్లప్పుడూ తిరిగిపొమ్ము.

రోమీయులకు 2:12-16

12 ధర్మశాస్త్రము లేని పాపులు ధర్మశాస్త్రము లేకుండానే నశించిపోతారు. అలాగే ధర్మశాస్త్రం ఉండి కూడా పాపం చేసినవాళ్ళపై దేవుడు ధర్మ శాస్త్రానుసారం తీర్పు చెపుతాడు. 13 ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేరు. కాని ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని విధేయతతో ఆచరించేవాళ్ళను దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తాడు.

14 యూదులుకానివాళ్ళకు ధర్మశాస్త్రం లేదు. కాని వాళ్ళు సహజంగా ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకొంటే వాళ్ళకు ధర్మశాస్త్రం లేకపోయినా, వాళ్ళు నడుచుకునే పద్ధతే ఒక ధర్మశాస్త్రం అవుతుంది. 15 వాళ్ళ ప్రవర్తన ధర్మశాస్త్ర నియమాలు వాళ్ళ హృదయాలపై వ్రాయబడినట్లు చూపిస్తుంది. ఇది నిజమని వాళ్ళ అంతరాత్మలు కూడా చెపుతున్నాయి. వాళ్ళు కొన్నిసార్లు సమర్థించుకొంటూ, మరి కొన్నిసార్లు నిందించుకొంటూ, తమలోతాము వాదించుకుంటూ ఉంటారు.

16 ఆ రోజు దేవుడు మానవుల రహస్య ఆలోచనలపై యేసు క్రీస్తు ద్వారా తీర్పు చెపుతాడు. నేను ప్రజలకు అందించే సువార్త ఈ విషయాన్ని తెలియజేస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International