Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
పరమ గీతము 2:8-13

ఆమె మళ్లీ అంటుంది

నా ప్రియుని గొంతు వింటున్నాను.
అదిగో అతడు వస్తున్నాడు.
    పర్వతాల మీది నుంచి దూకుతూ
    కొండల మీది నుంచి వస్తున్నాడు.
నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు
    లేదా లేడి పిల్లలా ఉన్నాడు.
మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు,
    కిటికీలోనుంచి తేరి పార చూస్తూ,
    అల్లిక కిటికీలోనుంచి[a] చూస్తూ
10 నా ప్రియుడు నాతో అంటున్నాడు,
“నా ప్రియురాలా, లెమ్ము,
    నా సుందరవతీ, రా, వెళ్లిపోదాం!
11 చూడు, శీతాకాలం వెళ్లిపోయింది,
    వర్షాలు వచ్చి వెళ్లిపోయాయి.
12 పొలాల్లో పూలు వికసిస్తున్నాయి
    ఇది పాడే సమయం![b]
    విను, పావురాలు తిరిగి వచ్చాయి.
13 అంజూర చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి.
    పూస్తున్న ద్రాక్షా పూల సువాసన చూడు.
నా ప్రియురాలా, సుందరవతీ, లేచిరా,
    మనం వెళ్లిపోదాం!”

కీర్తనలు. 45:1-2

సంగీత నాయకునికి: “శోషనీము” రాగం. కోరహు కుటుంబం రచించిన దైవ ధ్యానం మరియు ఒక ప్రేమగీతం.

45 రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా
    అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి.
నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా
    నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి.

నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు!
    నీ పెదవులనుండి దయ వెలువడుతుంది
    కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.

కీర్తనలు. 45:6-9

దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!
    నీ నీతి రాజదండము.
నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు.
    కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా
    నీ దేవుడు కోరుకొన్నాడు.
నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.
    నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు.
    నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.

యాకోబు 1:17-27

17 ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్ఠమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. 18 దేవుడు తన సృష్టిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జన్మనివ్వటానికి సంకల్పించాడు.

వినటం, చెయ్యటం

19 నా ప్రియమైన సోదరులారా! ఈ విషయాల్ని తెలుసుకోండి: ప్రతి మనిషి వినటానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపాన్ని అణచుకోవాలి. 20 ఎందుకంటే కోపం ద్వారా దేవుడు ఆశించే నీతి కలుగదు. 21 అందువల్ల దుర్మార్గాల్ని, అవినీతిని పూర్తిగా వదిలివెయ్యండి. మీలో నాటుకుపోయిన దైవసందేశాన్ని విధేయతతో ఆచరించండి. అది మీ ఆత్మల్ని రక్షించగలదు.

22 దైవసందేశం చెప్పినట్లు చెయ్యండి. దాన్ని విని కూడా మీరు ఏమీ చెయ్యలేకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొన్న వాళ్ళవుతారు. 23-24 దైవసందేశం విని అది చెప్పినట్లు చెయ్యని వాడు అద్దంలో తన ముఖం చూసుకొని తానేవిధంగా కనిపించాడో వెంటనే మరచిపోయే వ్యక్తిలాంటివాడు. 25 స్వేచ్ఛను కలిగించే పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తూ దాని ప్రకారం జీవించేవాడు క్రియచేస్తున్న వానిగా పరిగణింపబడతాడు. అలాంటివాడు విని మరచిపోయే రకం కాదు. అతడు చేస్తున్న ప్రతీ కార్యము ఫలించాలని దేవుడు అతణ్ణి దీవిస్తాడు.

దేవుణ్ణి ఆరాధించే సత్యమార్గం

26 తానొక విశ్వాసినని తలంచి తన నాలుకకు కళ్ళెం వేసుకోకపోతె తనకు తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. అతని విశ్వాసం నిష్ప్రయోజనమౌతుంది. 27 అనాథుల్ని, వితంతువుల్ని కష్టాల్లో ఆదుకోవటం, ఈ ప్రపంచంలో ఉన్న చెడువల్ల మలినం కాకుండా ఉండటము, ఇదే మన తండ్రియైన దేవుడు అంగీకరించే నిజమైన భక్తి.

మార్కు 7:1-8

దేవుని ప్రేమ మరియు మానవ సాంప్రదాయం

(మత్తయి 15:1-20)

యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు,[a] శాస్త్రులు యేసు చుట్టూ చేరారు. వాళ్ళు, యేసు శిష్యుల్లో కొందరు అపరిశుభ్రమైన చేతులతో, అంటే ఆచారం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం గమనించారు. పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారం తమ చేతుల్ని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోకుండా భోజనం చెయ్యరు. వాళ్ళు వీథిలోకి వెళ్ళివస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యరు. ఇదేకాక వాళ్ళింకా అనేకమైన ఆచారాలు పాటిస్తారు. లోటాలను, చెంబులను, గిన్నెలను[b] శుద్ధి చేయటం వాళ్ళ ఆచారం.

అందువల్ల పరిసయ్యులు, శాస్త్రులు యేసుతో, “మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తారు? పెద్దలు చెప్పిన ఆచారం ఎందుకు పాటించరు?” అని అడిగారు.

యేసు సమాధానంగా, “యెషయా వేషధారులైన మిమ్మల్ని గురించి సరిగ్గా ప్రవచించాడు. అతడు తన గ్రంథంలో ఇలా ప్రవచించాడు:

‘వీళ్ళు మాటలతో నన్ను గౌరవిస్తారు.
    కాని వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి.
వాళ్ళు మానవ కల్పితమైన నియమాలను బోధిస్తారు.
    కనుక వాళ్ళ ఆరాధన నిరర్థకం.’(A)

దేవుని ఆజ్ఞల్ని పాటించటం మానేసి, మానవుడు కల్పించిన ఆచారాల్ని పట్టుకొని మీరు పాటిస్తున్నారు.

మార్కు 7:14-15

14 యేసు మళ్ళీ, ప్రజల్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి. అర్థం చేసుకోండి. 15 బయట ఉన్నవేవీ మనిషి కడుపులోకి వెళ్ళి అతణ్ణి అపవిత్రం చేయవు.

మార్కు 7:21-23

21 ఎందుకంటే, మానవుల హృదయాల నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, 22 లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయటకు వస్తాయి. 23 ఇవే లోపలనుండి బయటకు వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International