Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 101

దావీదు కీర్తన.

101 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
    యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
నా యెదుట ఏ విగ్రహాలు[a] ఉంచుకోను.
    అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
    నేను అలా చేయను!
నేను నిజాయితీగా ఉంటాను.
    నేను దుర్మార్గపు పనులు చేయను.
ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
    అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ
    అతిశయించడం నేను జరుగనివ్వను.

నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
    ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
    యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
    అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
    దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.

1 రాజులు 8:1-21

నిబంధన మందసం దేవాలయానికి తేబడుట

రాజైన సొలొమోను తరువాత ఇశ్రాయేలు పెద్దలందరినీ, ఆయా వంశాల ప్రధాన పురుషులను, ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలను ఒక చోటికి పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో తన వద్దకు రమ్మని చెప్పాడు. సీయోను అనబడే దావీదుపురంనుండి దేవుని ఒడంబడిక పెట్టెను దేవాలయానికి తరలించే కార్యక్రమంలో పాల్గొనమని సొలొమోను వారిని కోరాడు. కావున ఇశ్రాయేలీయులందరూ రాజైన సొలొమోను వద్దకు వచ్చారు. ఏతనీము అనబడే మాసంలో పండుగ సందర్భంగా ప్రత్యేక సెలవు రోజున (పర్ణశాలల పండుగ) సమావేశం జరిగింది. అది సంవత్సరంలో ఏడవనెల.

ఇశ్రాయేలు పెద్దలందరూ ఆ స్థలానికి వచ్చారు. అప్పుడు యాజకులు పవిత్ర ఒడంబడిక పెట్టె తీసుకున్నారు. యెహోవా ఒడంబడిక పెట్టె సన్నిధి గుడారము, దానిలోని పవిత్ర వస్తువులతో పాటు వారు మోసుకొని వెళ్లారు. లేవీయులు కొందరు ఈ వస్తువులను మోయుటలో సహాయం చేశారు. రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒడంబడిక పెట్టె ముందు సమావేశమయ్యారు. వారప్పుడు ఎవ్వరూ లెక్కపెట్టలేనన్ని గొర్రెలను, పశువులను బలి యిచ్చారు. అప్పుడు యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టె దాని అసలైన స్థానంలో ఉంచారు. అది అతి పరిశుద్ధ స్థలము. ఒడంబడిక పెట్టె కెరూబుల రెక్కల కిందుగా ఉంచబడింది. ఒడంబడిక పెట్టె ఉంచబడిన స్థానం మీదుగా కెరూబుల రెక్కలు వ్యాపించి వున్నాయి. ఆ రెక్కలు ఒడంబడిక పెట్టె, దానిని మోయుటకు ఉపయోగించే కోలలను కప్పివేశాయి. ఒడంబడిక పెట్టె మోసే కోలలు (కర్రలు) చాలా పొడవైనవి. అతి పరిశుద్ధ స్థలం ముందు పవిత్ర స్థలంలో ఎవరు నిలబడి చూసినా ఆ కోలలను చివరి వరకు చూడగలరు. కాని వాటినెవరూ బయటి నుండి చూడలేరు. ఈ నాటికీ ఆ కోలలు అదే స్థానంలో వున్నాయి. ఆ ఒడంబడిక పెట్టెలో వున్నవి కేవలం రెండు రాతి ఫలకాలు. ఈ రెండు ఫలకాలను హోరేబు అనే చోట మోషే ఈ ఒడంబడిక పెట్టెలో భద్రపరచాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి బయటికి వచ్చిన తరువాత హోరేబు అనే చోటనే యెహోవా వారితో తన ఒడంబడిక చేశాడు.

10 యాజకులు అతి పరిశుద్ధ స్థలాన్ని వదిలి బయటికి వచ్చిన పిమ్మట, ఒక మేఘం యెహోవా దేవాలయాన్ని కమ్మివేసింది. 11 యెహోవా మహిమతో దేవాలయం నిండిపోగా యాజకులు తమ విధులను నిర్వర్తించలేక పోయారు. 12 అప్పుడు సొలొమోను ఇలా అన్నాడు:

“ఆకాశంలో ప్రకాశించటానికి యెహోవా సూర్యుడ్ని కలుగజేశాడు,
    కాని ఆయన మాత్రం ఒక నల్లని మేఘంలో నివసిస్తానన్నాడు.
13 నిజానికి నేకొక అద్భుతమైన దేవాలయాన్ని నీ కొరకు నిర్మించాను,
    అది నీవు శాశ్వతంగా నివసించే స్థలం.”

14 ఇశ్రాయేలీయులందరూ అక్కడ నిలబడియున్నారు. రాజైన సొలొమోను వారి వైపు తిరిగి వారిని దీవించుమని దేవుడిని అడిగాడు. 15 తరువాత రాజైన సొలొమోను దేవునికి సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. అతడిలా అన్నాడు:

“ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉన్నతుడు. నా తండ్రి దావీదుకు ఇచ్చిన మాట ప్రకారం అతడు అన్నీ నెరవేర్చాడు. 16 యెహోవా నా తండ్రితో, ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టునుండి విముక్తులను చేసి తీసుకొని వచ్చాను. కాని నా గౌరవార్థం నాకో దేవాలయం కట్టించటానికి ఇశ్రాయేలు వంశాలు నివసించే ఏ పట్టణాన్నీ నేనింకా ఎన్నుకో లేదు. నా ప్రజలైన ఇశ్రాయేలును ఏలటానికి నేనొక యువరాజును ఎంపిక చేయలేదు. కాని నేను గౌరవింపబడే చోటుగా ఇప్పుడు యెరూషలేమును ఎన్నుకున్నాను. మరియు నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించటానికి దావీదును ఎంపిక చేశాను’ అని చెప్పాడు.

17 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఘనంగా ఒక దేవాలయం కట్టించాలని నా తండ్రి దావీదు మిక్కిలిగా కోరుకున్నాడు. 18 కాని యెహోవా నా తండ్రి దావీదుతో ‘నాకు తెలుసు, నీవు నాకు దేవాలయం కట్టించి గౌరవించాలని మిక్కిలి ఆసక్తితో ఉన్నావు. నాకు దేవాలయ నిర్మాణం చేయాలను కోవటం సంతోషించ తగ్గ విషయం. 19 కాని నాకు దేవాలయం కట్టించేది నీవు కాదు. నేను ఆ పనికి నిన్ను ఎంపిక చేయలేదు. నీ రక్తం పంచుకు పుట్టిన నీ కుమారుడు నాకు దేవాలయ నిర్మాణం చేయిస్తాడు,’ అని అన్నాడు.

20 “కావున యెహోవా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. నా తండ్రి దావీదు స్థానంలో ఇప్పుడు నేను రాజును. యెహోవా కనికరించిన విధంగా ఇప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తున్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను దేవాలయం కట్టించాను. 21 దేవాలయంలో దేవుని ఒడంబడిక పెట్టెకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేశాను. మన పూర్వీకులతో యెహోవా చేసిన ఒక ఒడంబడిక ఆ మందసంలో వుంది. యెహోవా మన పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆ ఒడంబడిక చేశాడు.”

మార్కు 8:14-21

శిష్యులు యేసుని అపార్థము చేసికొనటం

(మత్తయి 16:5-12)

14 శిష్యులు రొట్టెలు తేవటం మరిచిపోయారు. వాళ్ళ దగ్గర ఒక రొట్టె మాత్రమే ఉంది. 15 యేసు, “జాగ్రత్తగా ఉండండి. పరిసయ్యుల పులుపును హేరోదు పులుపును[a] గమనిస్తూ ఉండండి” అని వాళ్ళను హెచ్చరించాడు.

16 ఇది వాళ్ళు పరస్పరం చర్చించుకొంటూ, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా!” అని అనుకొన్నారు.

17 వాళ్ళు ఏమి చర్చించుకొంటున్నారో యేసు కనిపెట్టి, “రొట్టెలులేవని ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు యింకా అర్థంకాలేదా? మీరు చూడలేదా? మీ బుద్ధి మందగించిందా? 18 మీకు కళ్ళున్నాయి కాని చూడలేరు. చెవులున్నాయి కాని వినలేరు. మీకు జ్ఞాకపం లేదా? 19 నేను ఐదు రొట్టెల్ని విరిచి ఐదువేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపలనిండా నింపారు?” అని అడిగాడు.

“పన్నెండు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

20 “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని గంపలనిండా నింపారు?” అని యేసు అన్నాడు.

“ఏడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

21 “యింకా మీకు అర్థం కాలేదా?” అని ఆయన వాళ్ళతో అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International