Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
101 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
2 నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
3 నా యెదుట ఏ విగ్రహాలు[a] ఉంచుకోను.
అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
నేను అలా చేయను!
4 నేను నిజాయితీగా ఉంటాను.
నేను దుర్మార్గపు పనులు చేయను.
5 ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ
అతిశయించడం నేను జరుగనివ్వను.
6 నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
7 అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
8 ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.
సొలొమోను జ్ఞానం రుజువగుట
16 ఒక రోజు ఇద్దరు వేశ్యా స్త్రీలు సొలొమోను వద్దకు వచ్చారు. వారు రాజు ముందు నిలబడ్డారు. 17 ఆ ఇద్దరిలో ఒక స్త్రీ ఇలా అన్నది, “అయ్యా, ఈమె, నేను ఒకే ఇంట్లో నివసిస్తూ వుంటాము. మేమిద్దరం గర్భవతుల మైనాము. కాన్పు నెలలు వచ్చాయి. నేనొక బిడ్డను ప్రసవించాను. అప్పుడు ఈమె నా పక్కనేవుంది. 18 మూడు రోజుల తరువాత ఈమె కూడ ఒక బిడ్డను కన్నది. మా ఇద్దరితో పాటు ఇంటిలో మరెవ్వరూ లేరు. కేవలం మేమిద్దరమే వుంటున్నాము. 19 ఒక రోజు రాత్రి ఈ స్త్రీ తన బిడ్డతో నిద్రిస్తూండగా, ఆ బిడ్డ చనిపోయింది. 20 అప్పుడు ఆమె ఆ రాత్రి సమయంలో నేను నిద్రిస్తూండగా నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొన్నది. నా బిడ్డను ఆమె తన పక్కలో వేసుకొన్నది. చనిపోయిన బిడ్డను నా పక్కమీద వుంచింది. 21 మరునాటి ఉదయం నేను లేచి నా బిడ్డకు పాలివ్వబోయాను. కాని బిడ్డ చనిపోయినట్లు గమనించాను. నేను బిడ్డకేసి తేరిపార చూడగా ఆ బిడ్డ నా బిడ్డ కాదని కనుగొన్నాను.”
22 కాని ఆ రెండవ స్త్రీ, “కాదు! బ్రతికివున్న బిడ్డే నా బిడ్డ, చనిపోయిన బిడ్డే నీ బిడ్డ” అని అన్నది.
అందుకు మొదటి స్త్రీ ఇలా అన్నది, “కాదు! నీవు పొరాపాటు పడుతున్నావు! చనిపోయిన బిడ్డే నీది. బ్రతికివున్న బిడ్డ నాది!” ఇలా ఆ యిద్దరు స్త్రీలు రాజు ముందు వాదోపవాదాలు చేసుకొన్నారు.
23 ఇదంతా విన్న సొలొమోను, “మీ ఇద్దరిలో ప్రతి ఒక్కరూ బతికివున్న బిడ్డ ‘నాదే’ అంటున్నారు. మీలో ప్రతి ఒక్కరు చనిపోయిన బిడ్డ ఎదుటి వ్యక్తిదని అంటున్నారు” అని అన్నాడు. 24 అప్పుడు సొలొమోను రాజు తన సేవకుడిని పంపి ఒక కత్తి తెప్పించాడు. 25 సొలొమోను రాజు ఇలా అన్నాడు, “ఇప్పుడు మనం ఈ రకంగా చేద్దాం. బ్రతికి వున్న బిడ్డను రెండు ముక్కలుగా నరికేద్దాం. ఆ ఇద్దరు స్త్రీలకు చెరియొక ముక్క ఇద్దాం!”
26 ఇది విన్న ఆ రెండవ స్త్రీ, “ఈ పని చాలా బాగుంటుంది. బిడ్డను రెండు ముక్కలు చేయండి, అప్పుడు మా ఇద్దరిలో ఎవ్వరికీ ఆ బిడ్డ రాకుండా పోతుంది” అని అన్నది. కాని బిడ్డయొక్క నిజమైన తల్లియగు మొదటి స్త్రీ తన బిడ్డపట్ల నిండైన ప్రేమతో రాజుతో, “అయ్యా, దయచేసి బిడ్డను చంపవద్దు! బిడ్డను ఆమెకే ఇవ్వండి,” అని అన్నది.
27 సొలొమోను రాజు అప్పుడిలా అన్నాడు, “బిడ్డను చంపకండి! బిడ్డను మొదటి స్త్రీకి ఇవ్వండి, అసలైన తల్లి ఆమెయే!”
28 ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను రాజు తీర్పును విన్నారు. ఆయన చాలా తెలివైనవాడు కావున అతనిని ప్రజలు చాలా గౌరవించారు. న్యాయ నిర్ణయం చేయుటలో ఆయనకు దేవుడిచ్చిన వివేకం[a] ఉన్నట్లు వారు గమనించారు.
ఏడుగురిని ఎన్నుకోవటం
6 యేసు అనుచరుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ రోజుల్లో గ్రీకు భాషలో మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదులతో, “మా వితంతువుల్ని ప్రతి రోజు చేసే దానాల విషయంలో సరిగ్గా చూడటం లేదు” అని తగువు పెట్టుకొన్నారు.
2 అందువల్ల ఆ పన్నెండుమంది అపొస్తలులు అనుచరులందర్ని సమావేశ పరిచి ఈ విధంగా అన్నారు: “అన్నదానాల విషయం చూడటానికోసం మేము దేవుని సందేశం యొక్క బోధ విషయంలో అశ్రద్ధ వహించటం మంచిది కాదు. 3 సోదరులారా! పవిత్రాత్మ సంపూర్ణంగా గలవాళ్ళను, పూర్ణ జ్ఞానం కలవాళ్ళను ఏడుగురిని మీలోనుండి ఎన్నుకోండి. ఈ బాధ్యత వాళ్ళకప్పగిస్తాం. 4 మేము మా కాలాన్ని ప్రార్థనలకు, దేవుని సందేశాన్ని ఉపదేశించటానికి వినియోగిస్తాము.”
5 అపొస్తలులు చెప్పింది వాళ్ళకందరికీ బాగా నచ్చింది. వాళ్ళు స్తెఫనును ఎన్నుకొన్నారు. స్తెఫను దేవుని పట్ల గొప్ప విశ్వాసం గలవాడు. అతనిలో పవిత్రాత్మ సంపూర్ణంగా ఉంది. అతణ్ణే కాక ఫిలిప్పును, ప్రొకొరును, నీకానోరును, తీమోనును, పర్మెనాసును, నీకొలాసును కూడా ఎన్నుకొన్నారు. ఈ నీకొలాసు అంతియొకయకు చెందినవాడు. పూర్వం యూదుల మతంలో చేరినవాడు. 6 ప్రజలు వీళ్ళను అపొస్తలుల ముందుకు పిలుచుకొని వచ్చారు. అపొస్తలులు ప్రార్థించి తమ చేతుల్ని వాళ్ళపై ఉంచారు.
7 దేవుని సందేశం ప్రచారమైంది. యెరూషలేములో శిష్యుల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది యాజకులు విశ్వసించారు.
© 1997 Bible League International