Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. గుహలో సౌలు నుండి అతడు పారిపోయినప్పటిది.
57 దేవా, నన్ను కరుణించు
నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము.
కష్టం దాటిపోయేవరకు
నేను నీ శరణు జొచ్చియున్నాను.
2 మహోన్నతుడైన దేవుని సహాయం కోసం నేను ప్రార్థించాను.
దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.
3 పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు.
నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యులను ఆయన శిక్షిస్తాడు.
దేవుడు తన నిజమైన ప్రేమను
నాకు చూపిస్తాడు.
4 నా జీవితం ప్రమాదంలో ఉంది.
నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు.
ఈటెలు, బాణాలవంటి పదునైన పళ్లు,
మనుష్యులను తినే ఖడ్గంలా పదునైన నాలుకలుగల సింహాల్లా వారున్నారు.
5 దేవా, నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు.
నీ మహిమ భూమిని ఆవరించి ఉంది.
6 నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు.
వారు నన్ను ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు.
నేను పడుటకు వారు గొయ్యి తవ్వారు.
కాని వారే దానిలో పడ్డారు.
7 దేవా, నిన్ను విశ్వసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది.
నేను నీకు స్తుతులు పాడుతాను.
8 నా ఆత్మా, మేలుకొనుము!
స్వరమండలమా, సితారా, మేలుకోండి. వేకువను మనం మేల్కొందాము
9 నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను.
ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతిగీతాలు పాడుతాను.
10 నీ నిజమైన ప్రేమ ఆకాశంలోకెల్లా అత్యున్నత మేఘాలకంటె ఎత్తయింది.
11 ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు.
ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.
అబ్షాలోము పథకాన్ని దావీదు వినటం
13 ఈ వార్త దావీదుకు చెప్పటానికి ఒక వ్యక్తి వచ్చాడు. “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోమును అనుసరించటం మొదలు పెట్టారు” అని అతడు చెప్పాడు.
14 అది విని దావీదు యెరూషలేములో తనతో ఉన్న సేవకులను పిలిచి ఇలా చెప్పాడు: “మనం ఇప్పుడు అవశ్యంగా తప్పించుకోవాలి! మనం అలా చేయకపోతే అబ్షాలోము మనల్ని వదిలిపెట్టడు. అబ్షాలోము మనల్ని పట్టుకొనే లోపు మనం త్వరపడాలి. అతడు మనందరినీ నాశనం చేస్తాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను కత్తితో నరికి చంపుతాడు.”
15 “మీరు ఏమి చేయాలని మాకు చెబుతారో మేమది చేస్తాము” అని రాజు యొక్క సేవకులు అన్నారు.
దావీదు, అతని మనుష్యులు తప్పించుకోవటం
16 రాజు (దావీదు) తన ఇంటి వారందరితో కలిసి బయటికి పోయాడు. రాజు తన ఉంపుడుగత్తెలలో పది మందిని ఇంటిని చూస్తూ వుండేటందుకు వదిలి పెట్టాడు. 17 తన ప్రజలందరూ వెంటరాగా రాజు బయలుదేరి వెళ్లాడు. వారు చివరి ఇంటివద్ద ఆగారు. 18 సేవకులంతా రాజు ముందునుంచి వెళ్లారు. కెరేతీయులు, పెలేతీయులు మరియు గిత్తీయులు (ఆరు వందల మంది గాతువారు) అందరూ రాజు ముందు నుంచి నడిచి వెళ్లారు.
19 గిత్తీయుడైన ఇత్తయిని చూచి రాజు, “నీవెందుకు మాతో వస్తున్నావు? తిరిగిపోయి, కొత్త రాజుతో (అబ్షాలోము) వుండిపో. నీవు పరదేశీయుడవు. ఇది నీ స్వదేశం కాదు. 20 నిన్న మాత్రమే నీవు నన్ను కలియటానికి వచ్చావు. ఇప్పుడు నీవు నాతో కలిసి వివిధ ప్రాంతాలు తిరిగే అవసరం వుందా? లేదు. తిరిగి వెళ్లిపో నీ సోదరులను కూడ నీతో తీసుకొని వెళ్లు. దయ, విశ్వాసం నీకు అండగా వుండుగాక!” అని అన్నాడు.
21 కాని ఇత్తయి రాజుకు సమాధానమిస్తూ, “యెహోవా జీవము తోడుగా, నీ జీవము తోడుగా నేను నీతోనే వుంటాను! చావుబ్రతుకుల్లో కూడ నేను నీతోనే వుంటాను!” అని అన్నాడు.
22 “అయితే మనం కిద్రోను వాగు దాటుదాము,” అన్నాడు రాజు ఇత్తయితో.
అప్పుడు గిత్తీయుడైన ఇత్తయి తన వారితోను, వారి పిల్లలతోను కిద్రోను వాగు దాటాడు. 23 ప్రజలంతా[a] బిగ్గరగా ఏడ్వసాగారు. రాజు (దావీదు) కిద్రోనువాగు దాటాడు. అప్పుడు వారంతా ఎడారివైపు ప్రయాణం సాగించారు. 24 సాదోకు, తనతో వున్న తదితర లేవీయులందరూ దేవుని ఒడంబడిక పెట్టెను మోసుకొని వస్తూవున్నారు. వారు దేవుని పెట్టెను దించారు. ప్రజలంతా యెరూషలేము నగరం నుండి వెళ్లిపోయే వరకు అబ్యాతారు ప్రార్థన[b] చేస్తూవున్నాడు.
25 సాదోకుతో రాజు (దావీదు) ఈ విధంగా చెప్పాడు: “దేవుని పవిత్ర పెట్టెను యెరూషలేముకు తిరిగి తీసుకొని వెళ్లు. ఒక వేళ యెహోవా నన్ననుగ్రహించితే, ఆయన నన్ను యెరూషలేముకు తిరిగి తీసుకొని వస్తాడు. యెహోవా మరల నన్ను యెరూషలేమును, ఆయన దేవాలయమును చూసేలా చేస్తాడు. 26 కాని దేవుడు నేనంటే ఇష్టంలేదని చెప్పితే ఆయన నాకు వ్యతిరేకంగా తన ఇష్టం వచ్చినట్లు చేయగలడు.”
27 యాజకుడు సాదోకుతో రాజు ఇంకా ఇలా అన్నాడు: “నీవు దీర్ఘదర్శివి.[c] నగరానికి ప్రశాంతంగా వెళ్లు. నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును నీతో తీసుకొని వెళ్లు. 28 ప్రజలు ఎడారిలోకి ప్రవేశించే స్థలంలో నేను మీనుండి మళ్లీ సమాచారం వచ్చేవరకు వేచి వుంటాను.”
29 కావున సాదోకు, అబ్యాతారు దేవుని పవిత్ర పెట్టెను తీసుకొని యెరూషలేముకు తిరిగి వెళ్లి అక్కడ వుండి పోయారు.
అహీతోపెలుకు వ్యతిరేకంగా దావీదు ప్రార్థించుట
30 దావీదు ఒలీవల పర్వతం మీదికి వెళ్లాడు. అతడు ఏడుస్తూవున్నాడు. తలమీద ముసుగు వేసికొని, చెప్పులు కూడ లేకుండా వెళ్లాడు. దావీదుతో వున్న మనుష్యులంతా కూడ తలపై ముసుగు వేసుకున్నారు. వారు ఏడుస్తూ దావీదు వెంట వెళ్లారు.
31 ఒక వ్యక్తి దావీదు వద్దకు వచ్చి, “అబ్షాలోముతో కలిసి పథకం వేసిన వారిలో అహీతోపెలు ఒకడు” అని చెప్పాడు. అది విని దావీదు యెహోవాకు “అహీతోపెలు సలహా నిరుపయోగమయ్యేలా చేయమని నిన్ను వేడుకుంటున్నాను” అని ప్రార్థన చేశాడు.
5 మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. 2 క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటివాళ్ళను ప్రేమిస్తూ జీవించండి.
3 కాని మీరు వ్యభిచారాన్ని గురించి గాని, అపవిత్రతను గురించి గాని, దురాశను గురించి గాని మాట కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసుల్లో ఉండకూడదు. 4 అంతేకాక మీరు బూతు మాటలు, అర్థంలేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. 5 ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యాశాపరులు, నిజానికి ఇలాంటి వాళ్ళు విగ్రహారాధకులతో సమానము, ఇలాంటి వాళ్ళు దేవుడు మరియు క్రీస్తు పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు.
6 వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. 7 వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. 8 ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. 9 ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. 10 ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. 11 చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి. 12 అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం. 13 వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. 14 వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది:
“నిద్రిస్తున్న ఓ మనిషీ, మేలుకో!
బ్రతికి లేచిరా!
క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.”
© 1997 Bible League International