Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 18:5-9

యోవాబు, అబీషై మరియు ఇత్తయికి రాజు, “నాకొరకు ఈ పని చేయండి. యువకుడైన అబ్షాలోము పట్ల ఉదారంగా ప్రవర్తించండి!” అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సైన్యాధిపతులకు రాజు యిచ్చిన ఆజ్ఞలను ఆ ప్రజలంతా విన్నారు.

దావీదు సైన్యం అబ్షాలోము సైన్యాన్ని ఓడించటం

అబ్షాలోము తరపున వచ్చిన ఇశ్రాయేలీయుల పైకి దావీదు సైన్యం రణరంగంలోకి ప్రవేశించింది. ఎఫ్రాయిము అరణ్యంలో వారు పోరాడారు. దావీదు సైన్యం ఇశ్రాయేలీయులను ఓడించింది. ఆ రోజు ఇరవై వేలమంది చనిపోయారు. యుద్ధం దేశవ్యాప్తంగా జరిగింది. ఆ రోజు కత్తివేటుకు చచ్చిన వారికంటే అడవిలో చిక్కుకొని చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

అబ్షాలోము దావీదు సేవకులను కలవటం జరిగింది. అబ్షాలోము తప్పించుకు పోవటానికి ఒక కంచరగాడిదను ఎక్కాడు. ఆ కంచర గాడిద పెద్ద సింధూర వృక్షం కొమ్మల క్రిందుగా వెళ్లింది. కొమ్మలు చిక్కగా అల్లుకొని ఉన్నాయి. అబ్షాలోము తల ఆ కొమ్మల్లో చిక్కుకు పోయింది. తన కంచర గాడిద తన క్రిందనుంచి పారిపోయింది. ఆ విధంగా అబ్షాలోము భూమికి పైగా[a] వేలాడుచున్నాడు.

2 సమూయేలు 18:15

15 యోవాబుకు యుద్ధంలో సహాయపడుతూ అతని వెంట పది మంది యువ సైనికులున్నారు. ఆ పదిమంది అబ్షాలోము చుట్టూచేరి అతనిని చంపివేశారు.

2 సమూయేలు 18:31-33

31 తరువాత కూషీయుడు వచ్చాడు. “నా ఏలినవాడవైన రాజుకు ఒక వార్త! నీకు వ్యతిరేకులైన ప్రజలను యెహోవా ఈ రోజు శిక్షించాడు” అని చెప్పాడు.

32 “యువకుడైన అబ్షాలోము క్షేమంగా వున్నాడా?” అని రాజు కూషీయుని అడిగాడు.

“నీ శత్రువులు, నిన్ను గాయపర్చాలని నీకు వ్యతిరేకంగా వచ్చే ఇతర మనుష్యులు ఆ యువకునిలా (అబ్షాలోము) అయిపోతారని నేను అనుకుంటున్నాను” అని కూషీయుడు చెప్పాడు.

33 దానితో అబ్షాలోము చనిపోయాడని రాజుకు అర్థమయింది. రాజు మిక్కిలి కలతపడిపోయాడు. నగర ద్వారం మీద వున్న గది వద్దకు వెళ్లాడు. అక్కడ బాగా విలపించాడు. గదిలోకి వెళ్లాడు. గదిలోకి పోతూ, “నా కుమారుడా, అబ్షాలోమా! నా కుమారుడా, అబ్షాలోమా! నీ బదులు నేను చనిపోయి వుండవలసింది. ఓ అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా!” అని దుఃఖించాడు.

కీర్తనలు. 130

యాత్ర కీర్తన.

130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
    కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రభువా, నా మాట వినుము.
    సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
    ఒక్క మనిషి కూడా మిగలడు.
యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
    అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.

యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
    నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
    యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
    ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
    నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
    మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.

ఎఫెసీయులకు 4:25-5:2

25 మనమంతా ఒకే శరీరానికి చెందిన వాళ్ళము కనుక అబద్ధం చెప్పటం మానుకోవాలి. సత్యమే మాట్లాడాలి. 26 మీరు మీ కోపంలో పాపం చెయ్యకండి. ఒకవేళ కోప్పడినా సూర్యాస్తమయం కాకముందే మీ కోపం తగ్గిపోవాలి. 27 సాతానుకు అవకాశమివ్వకండి. 28 దొంగలు యికమీదట దొంగతనం చెయ్యరాదు. వాళ్ళు తమ చేతుల్ని మంచి పనులు చెయ్యటానికి ఉపయోగించాలి. అప్పుడు వాళ్ళు పేదవాళ్ళకు సహాయం చెయ్యగలుగుతారు.

29 దుర్భాషలాడకండి. ఇతర్ల అభివృద్ధికి తోడ్పడే విధంగా, వాళ్ళకు అవసరమైన విధంగా మాట్లాడండి. మీ మాటలు విన్నవాళ్ళకు లాభం కలగాలి. 30 మీకు విమోచన కలిగే రోజుదాకా మీలో ముద్రింపబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. 31 మీలో ఉన్న కక్షను, కోపాన్ని, పోట్లాడే గుణాన్ని, దూషించే గుణాన్ని మీ నుండి తరిమివేయండి. మీలో ఎలాంటి చెడుగుణం ఉండకూడదు. 32 దయాదాక్షిణ్యాలు అలవరచుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి.

మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటివాళ్ళను ప్రేమిస్తూ జీవించండి.

యోహాను 6:35

35 యేసు ఈ విధంగా చెప్పాడు: “నేను జీవాన్నిచ్చే ఆహారాన్ని, నా దగ్గరకు వచ్చినవాడు ఆకలితో పోడు. నన్ను నమ్మినవానికి ఎన్నడూ దాహం కలుగదు.

యోహాను 6:41-51

41 ఆయన, “నేను పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని” అని అనటం విని యూదులు గొణిగారు. 42 “ఇతడు యోసేపు కుమారుడైన యేసు కదా! ఇతని తల్లిదండ్రుల్ని మనం ఎరుగుదుమే! మరి యిప్పుడితడు, ‘నేను పరలోకం నుండి దిగి వచ్చానని’ ఎందుకు అంటున్నాడు?” అని వాళ్ళన్నారు.

43 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీలో మీరు గొణుక్కోవడం చాలించండి. 44 నన్ను పంపిన తండ్రి పంపితే తప్ప, నా దగ్గరకు ఎవ్వడూ రాలేడు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణి చివరి రోజు నేను బ్రతికిస్తాను. 45 ప్రవక్తల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది: ‘దేవుడు వాళ్ళందరికీ బోధిస్తాడు.’(A) తండ్రి మాట విని ఆయన చెప్పింది నేర్చుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు. 46 దేవుని నుండి వచ్చినవాడు తప్ప తండ్రినెవ్వరూ చూడలేదు. ఆయన మాత్రమే తండ్రిని చూసాడు.

47 “ఇది నిజం. నమ్మినవానికి అనంత జీవితం లభిస్తుంది. 48 నేను మీ జీవితానికి ఆహారాన్ని. 49 మీ పూర్వీకులు ఎడారిలో ఉన్నప్పుడు మన్నా తిన్నారు. అయినా చనిపోయారు. 50 కాని ఈయన పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం. దీన్ని అందరూ తినవచ్చు. దీన్ని తిన్నవాడు మరణించడు. 51 పరలోకం నుండి వచ్చిన సజీవమైన ఆ ఆహారాన్ని నేనే. దీన్ని తిన్నవాడు చిరకాలం జీవిస్తాడు. ఆ ఆహారం నా శరీరం. నా శరీరాన్ని లోకం యొక్క జీవం కోసం యిస్తాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International