Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
అబ్షాలోము అనేకులను స్నేహితులుగా చేసుకోవటం
15 ఇదంతా ఆయిన పిమ్మట అబ్షాలోము తనకై ప్రత్యేకంగా ఒక రథాన్ని మరియు గుర్రములను సమకూర్చుకున్నాడు. తన రథం సాగుతూ వుండగా ముందు వెళ్లటానికి ఏబది మంది సైనికులను ఏర్పాటు చేసుకున్నాడు. 2 అబ్షాలోము ఉదయం పెందలకడలేచి నగర ద్వారం[a] వద్ద నిలబడేవాడు. అక్కడికి ఎవరైనా ఏదైనా సమస్యపై న్యాయం కోరుతూ దావీదు రాజు కొరకు వస్తే, అబ్షాలోము వారిని పిలిచేవాడు. వారిని “ఏ నగరం నుండి వచ్చినారని” అడిగేవాడు. “ఇశ్రాయేలు వంశాలలో ఒకడినని” ఆ వచ్చినవాడు చెప్పేవాడు. 3 అందుకు అబ్షాలోము “చూడు, నీవు నిజమే చెబుతున్నావు. కాని దావీదు రాజు నీవు చెప్పేది వినడు” అని అనేవాడు.
4 అబ్షాలోము ఇంకా ఇలా అనేవాడు, “ఓహో, ఈ రాజ్యంలో నన్నెవరైనా న్యాయాధిపతిగా చేయాలని నేను ఆశిస్తున్నాను. న్యాయం కోరుతూ ఎవరు ఏ సమస్యతో వచ్చినా వారికి తగిన న్యాయం నేనప్పుడు చేయగలుగుతాను. వచ్చిన వాని సమస్యకు తగిన పరిష్కారం కనుగొని సహాయం చేయగలుగుతాను.”
5 ఎవరైనా అబ్షాలోము వద్దకు వచ్చి ప్రణమిల్లి నమస్కరించబోతే, అతను వాని కొరకు ముందుకు వెళ్లి, అతనిని ఆదరంగా తన వద్దకు తీసుకొనేవాడు. తరువాత ఆ వచ్చిన వానిని అతను స్నేహపూర్వకంగా ముద్దు పెట్టుకొనేవాడు. 6 దావీదు రాజు వద్దకు న్యాయం కోసం ఇశ్రాయేలు నుండి ఎవరు వచ్చినా అబ్షాలోము అలా చేసేవాడు. ఈ రకంగా ఇశ్రాయేలు ప్రజలందరి హృదయాలనూ అబ్షాలోము గెలిచాడు.
దావీదు రాజ్యాన్ని కైవశం చేసుకోవటానికి అబ్షాలోము పథకం
7 నాలుగేండ్ల[b] తరువాత దావీదు రాజుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “హెబ్రోనులో నేను వుండగా యెహోవాకి నేను మొక్కుకున్నాను. దయచేసి ఆ మొక్కు చెల్లించటానికి నన్ను వెళ్లనీయండి. 8 గతంలో నేను సిరియ దేశమందలి గెషూరులో వుండగా మొక్కాను. నన్ను యెహోవా మరల యెరూషలేముకు తీసుకొని వస్తే యెహోవాను ఆరాధించెదనని మొక్కుకున్నాను.”
9 “ప్రశాంతంగా వెళ్లిరా!” అని దావీదు రాజు అన్నాడు.
అబ్షాలోము హెబ్రోనుకు వెళ్లాడు. 10 కాని అబ్షాలోము వేగుల వారిని ఇశ్రాయేలు వంశాల వారందరి వద్దకు పంపాడు. వారు వెళ్లి ప్రజలలో, “మీరు బాకా నాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో రాజయ్యాడు.!” అని కేకలు పెట్టమన్నాడు.
11 అబ్షాలోము తనతో వెళ్లటానికి రెండువందల మందిని ఆహ్వానించాడు. యెరూషలేము నుండి వారంతా అతనితో వెళ్లారు. కాని అతడు ఏమి యుక్తి పన్నుతున్నాడో వారికి తెలియదు.
12 అహీతోపెలు దావీదు సలహాదారులలో ఒకడు. అహీతోపెలు గీలో పట్టణవాసి, అబ్షాలోము బలులు సమర్పించేటప్పుడు అతడు అహీతోపెలును గీలో పట్టణం నుంచి రమ్మని కబురు పంపాడు. అబ్షాలోము పన్నినయుక్తులన్నీ సక్రమంగా సాగుతున్నాయి. ప్రజలు అబ్షాలోమును అధిక సంఖ్యలో బలపర్చ నారంభించారు.
అబ్షాలోము పథకాన్ని దావీదు వినటం
13 ఈ వార్త దావీదుకు చెప్పటానికి ఒక వ్యక్తి వచ్చాడు. “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోమును అనుసరించటం మొదలు పెట్టారు” అని అతడు చెప్పాడు.
నీకు కావల్సినవాటికై దేవుని అడుగుము
(లూకా 11:9-13)
7 “అడిగితే లభిస్తుంది. వెతికితే దొరుకుతుంది. తట్టితే తలుపు తెరుచుకుంటుంది. 8 ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన ప్రతి ఒక్కనికి దొరుకుతుంది. తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది.
9 “రొట్టె నడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా? 10 లేక చేపనడిగితే పామునెవరైనా యిస్తారా? 11 దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలివ్వాలని తెలుసు కదా! మరి అలాంటప్పుడు పరలోకంలోవున్న మీ తండ్రి తన్నడిగిన వాళ్ళకు మంచి కానుకలివ్వడా? తప్పకుండా యిస్తాడు.
© 1997 Bible League International