Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
25 అబ్షాలోము అందంలో అందరి ప్రశంసలూ పొందిన వాడు. అబ్షాలోమంత అందగాడు ఇశ్రాయేలంతటిలో మరొకడు లేడు. అరికాలు నుండి నడినెత్తివరకు అతనిలో రవ్వంత కూడా లోపం లేదు. 26 ప్రతి సంవత్సరాంతానా అబ్షాలోము తన తల వెండ్రుకలు కత్తిరించి తూచేవాడు. తూకం ప్రకారం రెండు వందల తులముల[a] బరువు ఉండేవి. 27 అబ్షాలోముకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు తామారు. తామారు సౌందర్యవతి.
తనను వచ్చి చూడమని యోవాబుపై అబ్షాలోము వత్తిడి
28 అబ్షాలోము యెరూషలేములో రెండు సంవత్సరాలున్నాడు. అయినా అతనికి రాజదర్శనం నిరాకరింపబడింది. 29 యోవాబు వద్దకు అబ్షాలోము దూతలను పంపాడు. ఈ దూతలు అబ్షాలోమును రాజు వద్దకు పంపమని అడిగారు. కాని యోవాబు అబ్షాలోము వద్దకు రాకపోయెను. రెండవసారి మరొక దూతను అబ్షాలోము పంపాడు. అయినా యోవాబు రావటానికి నిరాకరించాడు.
30 దానితో అబ్షాలోము తన సేవకులను పిలిచి ఇలా అన్నాడు: “చూడండి; యోవాబు పొలం నా పొలానికి ప్రక్కనే వున్నది. తన పొలంలో యవల ధాన్యం పండివుంది. వెళ్లి ఆ యవల ధాన్యాన్ని తగుల బెట్టండి.”
ఆ మాట మీద అబ్షాలోము సేవకులు వెళ్లి యోవాబు పొలంలో పంటకు నిప్పుపెట్టారు. 31 యోవాబు లేచి అబ్షాలోము ఇంటికి వెళ్లి, “నీ సేవకులు నా పంటను ఎందుకు తగులబెట్టారు” అని అడిగాడు.
32 యోవాబుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “నీకు నేను వర్తమానం పంపాను. ఇక్కడికి నిన్ను రమ్మన్నాను. నేను నిన్ను రాజు వద్దకు పంపాలని అనుకున్నాను గెషూరు నుండి నన్ను ఆయన ఎందుకు రప్పించాడో నిన్ను పంపి అడిగించాలనుకున్నాను. నేను ఆయనను చూడలేను. కావున ఈ పరిస్థితుల్లో నేను గెషూరుకు పోయి అక్కడవుండటం మంచిది! ఇప్పుడు నాకు రాజదర్శనం ఏర్పాటు చేయుము. నేను పాపం చేస్తే ఆయన నన్ను చంపవచ్చు!”
అబ్షాలోము దావీదును దర్శించటం
33 అప్పుడు యోవాబు రాజు వద్దకు వచ్చి అబ్షాలోము అన్న మాటలన్నీ చెప్పాడు. రాజు అబ్షాలోమును పిలిపించగా, అబ్షాలోము వచ్చాడు. అబ్షాలోము రాజు ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు.
అందరికీ మంచి చెయ్యండి
6 నా సోదరులారా! మీలో ఎవరైనా పాపం చేస్తే, మీలో ఆత్మీయంగా జీవిస్తున్నవాళ్ళు అతన్ని సరిదిద్దాలి. ఇది వినయంగా చెయ్యాలి. కాని మీరు స్వతహాగా ఆ పాపంలో చిక్కుకుపోకుండా జాగ్రత్త పడండి. 2 పరస్పరం కష్టాలు పంచుకోండి. అప్పుడే క్రీస్తు ఆజ్ఞను పాటించినవాళ్ళౌతారు. 3 తనలో ఏ గొప్పతనమూ లేనివాడు, తాను గొప్ప అని అనుకొంటే తనను తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. 4 ప్రతి ఒక్కడూ తన నడవడికను స్వయంగా పరీక్షించుకోవాలి. అప్పుడు తాను మరొకరితో పోల్చుకోకుండా తన నడతను గురించి గర్వించవచ్చు. 5 ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
మంచి చేయుట ఎన్నడూ మానవద్దు
6 దేవుణ్ణి గురించి బోధన పొందినవాడు, బోధించిన వానికి అన్ని విధాల సహాయం చెయ్యాలి.
7 మోసపోకండి, ప్రతి ఒక్కడూ తాను నాటిన చెట్టు ఫలాన్నే పొందుతాడు. ఈ విషయంలో దేవుణ్ణి మోసం చెయ్యలేము. 8 శారీరిక వాంఛలు అనే పొలంలో విత్తనం నాటితే మరణాన్ని ఫలంగా పొందుతాడు. పరిశుద్ధాత్మను మెప్పించే విధంగా నాటితే పరిశుద్ధాత్మ నుండి అనంతజీవితం అనే ఫలం పొందుతాడు. 9 కనుక మనం విశ్రాంతి తీసుకోకుండా మంచి చేద్దాం. మనము విడువకుండా మంచి చేస్తే సరియైన సమయానికి మంచి అనే పంట కోయగలుగుతాము. 10 మనకు మంచి చేసే అవకాశం ఉంది కనుక అందరికీ మంచి చేద్దాం. ముఖ్యంగా విశ్వాసులకు మంచి చేద్దాం.
© 1997 Bible League International