Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 89:20-37

20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
    నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
    మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
    దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
    ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
    నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
    నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
    అని అతడు నాతో చెబుతాడు.
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
    భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
    అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
    ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
30 అతని సంతతివారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే,
    నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.
31 ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞలను ఉల్లంఘించి,
    నా ఆదేశాలను పాటించకపోతే
32 అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
33 కాని వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను.
    నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.
34 దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను.
    మా ఒడంబడికను నేను మార్చను.
35 నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్దానం చేసాను.
    మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.
36 దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
    సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
37     చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది.
ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”

1 దినవృత్తాంతములు 11:15-19

15 ముప్పై మంది నాయకులలో ముగ్గురు దావీదు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో దావీదు అదుల్లాము గుహగల కొండ వద్ద ఉన్నాడు. అదే సమయంలో ఫిలిష్తీయుల సైనికులు కొందరు రెఫాయిము లోయలో గుడారాలు వేశారు.

16 అప్పుడు దావీదు కోటలో వున్నాడు. ఫిలిష్తీయుల సైన్యం బేత్లెహేములో దిగివుంది. 17 దావీదుకు అప్పుడు దాహం వేసింది. అతడు, “ఓహో, ఇప్పుడు నాకెవరైనా బేత్లెహేము[a] నగర ద్వారం వద్దగల బావి నీరు తాగటానికి తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను!” (దావీదు నిజంగా దీనిని కోరుకోలేదు) అని అన్నాడు. 18 అప్పుడు ఆ ముగ్గురు యోధులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఛేదించుకుంటూపోయి, బేత్లెహేము నగర ద్వారంవద్ద గల బావినుండి నీరు తీసుకొన్నారు. ఆ ముగ్గురు యోధులు నీటిని తెచ్చి దావీదుకు ఇచ్చారు. కాని దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఆ నీటిని యెహోవాకి అర్పణగా పారపోశాడు. 19 దావీదు ఇలా అన్నాడు, “యెహోవా నన్ను ఈ నీటిని తాగకుండా చేయుగాక! ఈ నీటిని నేను తాగటం సరియైనది కాదు. ఎందువల్లననగా ఈ మనుష్యులు ఈ నీటిని తేవటానికి తమ ప్రాణాలను లెక్క చేయలేదు. వారు మృత్యుముఖంలో పడి బయటపడ్డారు.” అందువల్ల దావీదు ఆ నీటిని తాగలేదు. ఆ విధంగా ఆ ముగ్గురు మహాయోధులు వీరోచిత కార్యాలు సాధించారు.

కొలొస్సయులకు 1:15-23

క్రీస్తు యొక్క గొప్పతనము

15 క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన
    అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు
    పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు.
16 క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు.
    పరలోకంలో ఉన్న వాటిని, భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని,
    సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, అన్నిటినీ ఆయనే సృష్టించాడు.
అన్నీ తన కోసం సృష్టించుకొన్నాడు.

17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు.
    ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి.
18 సంఘం ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు.
    ఆయనే అన్నిటికీ మూలం.
    చనిపోయి తిరిగి బ్రతికినవాళ్ళలో ఆయన మొదటివాడు.
అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు.

19 దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు.
20     దేవుడు అన్నిటినీ, అంటే భూమ్మీద ఉన్నవాటినీ, పరలోకంలో ఉన్నవాటిని,
    కుమారుని ద్వారా తిరిగి తనలో చేర్చుకోవాలనుకొన్నాడు.
తన కుమారుడు సిలువపై చిందించిన రక్తం ద్వారా ఈ సంధి కలగాలని ఆయన ఉద్దేశ్యం.

21 మీ దుష్ప్రవర్తనలవల్ల, మీ మనస్సులో ఉన్న దురాలోచనలవల్ల ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండి, ఆయనకు శత్రువులుగా జీవించారు. 22 కాని ప్రస్తుతం తన కుమారుని భౌతిక మరణం ద్వారా మీతో సంధి చేసి, మిమ్మల్ని పవిత్రం చేసి, మిమ్మల్ని నిష్కళంకులుగా, నిరపరాధులుగా తన ముందు నిలబెట్టుకోవాలని ఆయన ఉద్దేశ్యం.

23 మీరు విన్న సువార్త వలన రక్షణ కలుగుతుందన్న ఆశ మీలో కలిగింది. దాన్ని పోగొట్టుకోకుండా, దృఢంగా, స్థిరంగా ఆయన్ని విశ్వసిస్తూ ఉంటేనే అది సంభవిస్తుంది. మీరు విన్న ఈ సువార్త ఆకాశం క్రింద ఉన్న ప్రతీ జీవికి ప్రకటింపబడింది. నేను ఈ సందేశానికి సేవకుణ్ణి అయ్యాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International