Revised Common Lectionary (Semicontinuous)
24 విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు.
నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజయంతో ఊరేగింపు నడిపించటం ప్రజలు చూస్తారు.
25 గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు.
మధ్యలో ఆడపడుచులు తంబురలు వాయిస్తారు.
26 మహా సమాజంలో దేవుని స్తుతించండి.
ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
27 చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు.
యూదా మహా వంశం అక్కడ ఉంది.
జెబూలూను, నఫ్తాలి నాయకులు అక్కడ ఉన్నారు.
28 దేవా, నీ శక్తి మాకు చూపించుము,
దేవా, గత కాలంలో మాకోసం నీవు ఉపయోగించిన నీ శక్తి మాకు చూపించుము.
29 రాజులు వారి ఐశ్వర్యాలను నీ వద్దకు,
యెరూషలేములోని మందిరానికి తీసుకొని వస్తారు.
30 ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము.
ఆ దేశాలలోని “ఎద్దులు, ఆవులు” నీకు లోబడేలా చేయుము
ఆ రాజ్యాలను యుద్ధంలో
నీవు ఓడించావు.
ఇప్పుడు వారు నీ వద్దకు వెండి
తీసుకొని వచ్చునట్లు చేయుము.
31 వారు ఈజిప్టు నుండి ఐశ్వర్యం తీసుకొని వచ్చేలా చేయుము.
దేవా, ఇథియోపియా (కూషు) వారు వారి ఐశ్వర్యాన్ని నీ వద్దకు తెచ్చేలా చేయుము.
32 భూరాజులారా, దేవునికి పాడండి.
మన యెహోవాకు స్తుతి కీర్తనలు పాడండి.
33 దేవునికి పాడండి. ప్రాచీన ఆకాశాలలో ఆయన తన రథాల మీద పయనిస్తున్నాడు.
ఆయన శక్తిగల స్వరాన్ని ఆలకించండి.
34 మీ దేవుళ్లందరి కంటె యెహోవా ఎక్కువ శక్తిగలవాడు.
ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలను బలపరుస్తాడు.
35 దేవుడు తన ఆలయంలో ఆశ్చర్యకరుడు.
ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు శక్తిని, బలాన్ని ఇస్తాడు.
దేవుని స్తుతించండి.
16 సౌలు కుమార్తె మీకాలు ఒక కిటికీ గుండా చూస్తూ వుంది. యెహోవా పవిత్ర పెట్టె నగరంలోనికి వచ్చినప్పుడు, యెహోవా ముందు దావీదు చిందులేస్తూ, నాట్యం చేస్తూవున్నాడు. ఇదంతా మీకాలు చూసి, దావీదును తన మనసులో అవమానించింది.
17 పవిత్ర పెట్టె కొరకు దావీదు ఒక గుడారం నిర్మింపజేశాడు. ఇశ్రాయేలీయులు యెహోవా పవిత్ర పెట్టెను గుడారంలో దాని స్థానంలో నిలిపారు. దావీదు అప్పుడు దహన బలులు, సమాధాన బలులు యెహోవాకు సమర్పించాడు.
18 దహన బలులు, సమాధాన బలులు సమర్పించాక, సర్వశక్తిమంతుడైన యెహోవా పేరిట దావీదు ప్రజలను ఆశీర్వదించాడు. 19 నైవేద్యంగా ఉంచిన రొట్టె, ఎండిన ద్రాక్ష భక్ష్యములు, ఖర్జూరపు పండువేసి చేసిన రొట్టెలను స్త్రీ పురుషులందరికీ, ఇశ్రాయేలీయులందరికీ ప్రసాదంగా పంచి పెట్టాడు. తరువాత వారంతా తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు.
మీకాలు దావీదును అవమానించటం
20 దావీదు తన ఇంటి వారిని ఆశీర్వదించటానికి వెళ్లాడు. కాని సౌలు కుమార్తె మీకాలు దావీదును కలవటానికి బయటికి వచ్చింది. “ఇశ్రాయేలు రాజు ఈనాడు తనను తాను ఏమాత్రం గౌరవించుకోలేదు. నీ సేవకుల పని గత్తెల ముందు నీవు నీ బట్టలు విప్పివేశావు.[a] సిగ్గు విడిచి బట్టలు విప్పుకునే ఒక మూర్ఖునిలా ప్రవర్తించావు!” అని బాగా అవమానించింది.
21 అందుకు దావీదు మీకాలుతో ఇలా అన్నాడు: “యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అంతేగాని నీ తండ్రనీ కాదు, లేక అతని కుటుంబంలో మరెవ్వరినీ కాదు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరికీ నాయకునిగా యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అందువల్ల యెహోవా ఎదుట నేను ఉత్సవం చేశాను. 22 బహుశః నీ దృష్టిలో నాకు గౌరవం లేకుండా పోవచ్చు. నాకు నేను ఇంకా కించ పర్చుకోవచ్చు. కాని నీవు చెప్పిన ఆ పనిగత్తెలు మాత్రం నన్ను గౌరవిస్తారు!”
23 ఈ రీతిగా దావీదును అవమానించినందున సౌలు కుమార్తె మీకాలుకు పిల్లలు కలుగలేదు. ఆమె గొడ్రాలుగానే చనిపోయింది.
31 “మరి ఈ కాలపు ప్రజల్ని నేను దేనితో పోల్చాలి? వాళ్ళు ఏ విధంగా ఉంటారు? 32 వాళ్ళు సంతలో కూర్చొని,
‘మేము మీకోసం పిల్లన గ్రోవి ఊదాము.
కాని మీరు నాట్యం చేయలేదు.
మేము చనిపోయిన వానికోసం పాట పాడాము.
కాని మీరు దుఃఖించలేదు.’
అని మాట్లాడుకొంటున్న చిన్న పిల్లల్లాంటి వాళ్ళు. 33 బాప్తిస్మమునిచ్చే యోహాను ఆహారం తినలేదు. ద్రాక్షారసం త్రాగలేదు. మీరు అతనికి దయ్యం పట్టిందన్నారు. 34 మనుష్యకుమారుడు తింటూ, త్రాగుతూ వచ్చాడు. ఆయన్ని మీరు తిండిపోతు, త్రాగుపోతు అని అన్నారు. పన్నులు వసూలు చేసే వాళ్ళతో, పాపులతో స్నేహం చేస్తాడని ఆయన్ని విమర్శించారు. 35 జ్ఞానము దానిని పొందినవాని ద్వారా సరైనదని ఋజువు చేయబడుతుంది.”
© 1997 Bible League International