Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
2 జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.
3 యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
4 అక్కడ ఎవరు ఆరాధించగలరు?
చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.
5 మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
6 దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.
7 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
8 ఈ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.
9 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.
ఒడంబడిక పెట్టె (మందసము)
10 “తుమ్మకర్ర ఉపయోగించి ఒక ప్రత్యేక పెట్టె తయారు చెయ్యి. ఈ పెట్టె పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు, ఎత్తు 27 అంగుళాలు ఉండాలి. 11 ఆ పెట్టెలోపల, బంగారు రేకుతో పెట్టెను కప్పాలి. ఆ పెట్టె చుట్టూ అంచుల మీద బంగారపు నగిషీబద్ద పెట్టాలి. 12 ఆ పెట్టె చుట్టూ మోసేందుకు నాలుగు బంగారు ఉంగరాలను తయారు చెయ్యాలి. ఆ పెట్టెకు ఒక్కోపక్క రెండేసి చొప్పున నాలుగు మూలలా ఆ ఉంగరాలను అమర్చాలి. 13 తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను తయారు చేయాలి. ఈ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం పొదిగించాలి. 14 ఆ పెట్టె మూలల్లో ఉన్న ఉంగరాల గుండా ఆ కర్రలను పెట్టాలి. ఆ పెట్టెను మోసేందుకు ఈ కర్రలను ఉపయోగించాలి. 15 ఈ కర్రలు ఎప్పుడూ వాటి ఉంగరాల్లోనే ఉండాలి. కర్రలను బయటికి తియ్యవద్దు.”
16 దేవుడు అన్నాడు: “నేను ఒడంబడికను[a] నీకు ఇస్తాను. ఆ ఒడంబడికను ఈ పెట్టెలో పెట్టు. 17 ఆ పెట్టెకు ఒక మూత[b] చెయ్యాలి. స్వచ్ఛమైన బంగారంతో దీన్ని చెయ్యాలి. 45 అంగుళాల పొడవు, 27 అంగుళాల వెడల్పుతో దీన్ని చెయ్యాలి. 18 తర్వాత రెండు బంగారు కెరూబు దూతలను చేసి ఆ మూతకు రెండుకొనల మీద పెట్టాలి. కొట్టిన బంగారంతో ఈ దూతల్ని చేయాలి. 19 ఆ మూతకు ఒక కొనమీద ఒక దూతను, మరో కొనమీద మరో దూతను ఉంచాలి. మూత, దూతలు అంతా ఒకే వస్తువుగా చేయాలి. 20 కెరూబులు ఒకదానికి ఎదురుగా ఇంకొకటి ఉండాలి. ఆ దూతల ముఖాలు మూత వైపుకు చూస్తూ ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు మూతను అవరించి ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు ఆకాశం వైపు ఎత్తబడి ఉండాలి.
21 “ఒడంబడిక రుజువు నేనే మీకిచ్చాను. ఆ ఒడంబడికను పెట్టెలో పెట్టి, ప్రత్యేక మూతను పెట్టెమీద పెట్టాలి. 22 నేను నిన్ను కలుసుకొనేటప్పుడు ఆ ఒడంబడిక పెట్టె ప్రత్యేక మూత మీద ఉన్న కెరూబు దూతల మధ్యనుండి నేను మాట్లాడుతాను. అక్కడినుండే నేను నా ఆజ్ఞలన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలకు యిస్తాను.
2 మీకోసం, లవొదికయలో ఉన్నవాళ్ళకోసం, నన్ను ఇంతవరకూ కలుసుకోకుండా ఉన్నవాళ్ళకోసం నేను ఎంత శ్రమిస్తున్నానో మీరు గ్రహించాలని నా కోరిక. 2 మీ హృదయాలు ధైర్యంతో నిండిపోవాలనీ, ప్రేమతో మీరు ఐక్యము కావాలనీ నా అభిలాష. అప్పుడు మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. అదే ఒక సంపద. ఈ విధంగా మీరు దేవుణ్ణి గురించి, అంటే క్రీస్తును గురించి రహస్య జ్ఞానం పొందుతారు. 3 క్రీస్తులో వివేకము, జ్ఞానము అనే సంపదలు దాగి ఉన్నాయి.
4 తియ్యటి మాటలతో మిమ్మల్నెవ్వరూ మోసం చెయ్యకుండా ఉండాలని మీకీ విషయాలు చెబుతున్నాను. 5 నేను శరీరంతో అక్కడ మీ దగ్గర లేకపోయినా నా ఆత్మ మీ దగ్గరే ఉంది. మీ క్రమశిక్షణను, క్రీస్తు పట్ల మీకున్న సంపూర్ణ విశ్వాసాన్ని చూసి నా ఆత్మ ఆనందిస్తోంది.
© 1997 Bible League International