Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
21 యెహోవా, నీ బలం రాజును సంతోషపరుస్తుంది.
నీవు అతన్ని రక్షించినప్పుడు అతడు ఎంతగానో సంతోషించాడు.
2 రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు కొన్నింటికోసం అడిగాడు.
మరియు యెహోవా, రాజు అడిగినవాటిని నీవు అతనికిచ్చావు.
3 యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచివాటిని రాజుకిచ్చావు.
బంగారు కిరీటం నీవు అతని తలకు ధరింపజేసావు.
4 దేవా, జీవంకోసం అతడు నిన్ను అడిగాడు. నీవు దానిని అతనికిచ్చావు.
నీవు రాజుకు నిరంతరం సాగే దీర్ఘాయువు నిచ్చావు.
5 రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి గొప్ప కీర్తి వచ్చింది.
నీవు అతనికి గౌరవం, ఘనత ఇచ్చావు.
6 దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు.
నీ సన్నిధానము రాజును ఎక్కువగా సంతోషపెడ్తుంది.
7 రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు.
సర్వోన్నతుడైన దేవుడు అతన్ని నిరాశపర్చడు.
8 రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు.
నిన్ను ద్వేషించే ప్రజలను నీ శక్తి ఓడిస్తుంది.
9 నీవు కనబడినప్పుడు
ఆ శత్రువులను వేడి పొయ్యిలోని నిప్పువలె చేస్తావు.
యెహోవా కోపము వేడి మంటవలె కాలుస్తుంది.
మరియు ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు.
10 ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి.
వారు భూమి మీద నుండి తొలగిపోతారు.
11 ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు.
చెడుకార్యాలు చేయాలని వారు యోచించారు గాని వారు సాధించలేదు.
12 కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు.
ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు.
13 యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి
మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు వాయిస్తాము.
ఫిలిష్తీయుల పైకి దావీదు యుద్దానికి పోవటం
17 ఇశ్రాయేలీయులు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు వినగానే, ఫిలిష్తీయులంతా దావీదును చంపాలని వెదకటం మొదలు పెట్టారు. కాని ఈ వార్త దావీదు విన్నాడు. అతను ఒక కోటలోకి వెళ్లాడు. 18 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దిగారు.
19 దావీదు ప్రార్థన చేసి, “ఫిలిష్తీయుల మీదికి యుద్దానికి వెళ్లనా? ఫిలిష్తీయులను ఓడించటంలో నాకు సహాయపడతావా?” అని యెహోవాను అడిగాడు.
“వెళ్లు. ఫిలిష్తీయులను ఓడించటంలో నీకు నేను తప్పక సహాయం చేస్తాను” అని యెహోవా చెప్పాడు.
20 అప్పుడు దావీదు బయల్పెరాజీముకు వచ్చి, ఫిలిష్తీయులను ఓడించాడు. “ఆనకట్ట తెగి నీళ్లు పరవళ్లు తొక్కుతూ ప్రవహించినట్లు, యెహోవా నా శత్రువులను నాముందు చెల్లాచెదురై పారిపోయేలా చేసాడు,” అని అనుకున్నాడు దావీదు. ఆ కారణం చేత దావీదు ఆ ప్రదేశానికి బయల్పెరాజీము[a] అని పేరుపెట్టాడు. 21 ఫిలిష్తీయులు పారిపోతూ తమ దేవుళ్ల విగ్రహాలను బయల్పెరాజీము వద్ద వదిలిపోయారు. దావీదు, అతని మనుష్యులు ఆ విగ్రహాలన్నిటినీ తీసుకొని వెళ్లారు.
22 ఫిలిష్తీయులు మళ్లీ రెఫాయీము లోయలోకి వచ్చిదిగారు.
23 దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఈ సారి యెహోవా దావీదుతో ఇలా అన్నాడు, “తిన్నగా అక్కడికి వెళ్లవద్దు. వాళ్లను చుట్టుముట్టి సైన్యానికి వెనుకగా వెళ్లు. గులిమిడి చెట్లవద్ద వారిని ఎదుర్కో. 24 చెట్ల మీదకు ఎక్కి కూర్చుని, ఫిలిష్తీయులు యుద్ధానికి నడిచివచ్చే శబ్దం వింటావు. అప్పుడు నీవు త్వరపడాలి. ఎందుకంటే యెహోవా అక్కడ ఫిలిష్తీయులను ఓడించటానికి నీ కొరకు ఉన్నట్లు అది సంకేతం.”
25 యెహోవా తనను ఏమి చేయమని ఆజ్ఞ ఇచ్చాడో దావీదు అదంతా చేశాడు. అతను ఫిలిష్తీయులను ఓడించాడు. అతడు వారిని గెబ నుండి గెజెరు వరకు తరుముకుంటూ పోయి చంపాడు.
యేసు మరియు ఆయన సోదరులు
7 ఇది జరిగిన తర్వాత, యేసు గలిలయలో మాత్రమే పర్యటన చేసాడు. యూదులు ఆయన ప్రాణం తీయాలనుకోవటం వలన ఆయన కావాలనే యూదయలో పర్యటన చెయ్యలేదు. 2 యూదుల పర్ణశాలల పండుగ దగ్గరకు వచ్చింది. 3 యేసు సోదరులు యేసుతో, “నీవీ ప్రాంతం వదిలి యూదయకు వెళ్ళు. అలా చేస్తే నీ శిష్యులు నీవు చేసే కార్యాల్ని చూడగలుగుతారు. 4 నీవు ఈ కార్యాల్ని చేస్తున్నావు. కనుక నీవు ప్రజలముందుకు రావాలి. ఎందుకంటే, ప్రజానాయకుడు కాదలచినవాడు రహస్యంగా కార్యంచేయడు” అని అన్నారు. 5 అంటే ఆయన సోదరులు కూడా ఆయన్ని నమ్మలేదన్నమాట!
6 యేసు వాళ్ళతో, “నాకింకా సమయం రాలేదు. మీకు ఏ సమయమైనా మంచిదే. 7 ప్రపంచం మిమ్మల్ని ద్వేషించదు. కాని నేను దాని పనులు దుర్మార్గములని అంటాను. కనుక అది నన్ను ద్వేషిస్తున్నది. 8 మీరు పండుగకు వెళ్ళండి. నాకు తగిన సమయం యింకా రాలేదు కనుక నేను యిప్పుడు రాను” అని అన్నాడు. 9 ఇలాగు అన్న తర్వాత యేసు గలిలయులోనే ఉండి పోయాడు.
© 1997 Bible League International