Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
21 యెహోవా, నీ బలం రాజును సంతోషపరుస్తుంది.
నీవు అతన్ని రక్షించినప్పుడు అతడు ఎంతగానో సంతోషించాడు.
2 రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు కొన్నింటికోసం అడిగాడు.
మరియు యెహోవా, రాజు అడిగినవాటిని నీవు అతనికిచ్చావు.
3 యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచివాటిని రాజుకిచ్చావు.
బంగారు కిరీటం నీవు అతని తలకు ధరింపజేసావు.
4 దేవా, జీవంకోసం అతడు నిన్ను అడిగాడు. నీవు దానిని అతనికిచ్చావు.
నీవు రాజుకు నిరంతరం సాగే దీర్ఘాయువు నిచ్చావు.
5 రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి గొప్ప కీర్తి వచ్చింది.
నీవు అతనికి గౌరవం, ఘనత ఇచ్చావు.
6 దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు.
నీ సన్నిధానము రాజును ఎక్కువగా సంతోషపెడ్తుంది.
7 రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు.
సర్వోన్నతుడైన దేవుడు అతన్ని నిరాశపర్చడు.
8 రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు.
నిన్ను ద్వేషించే ప్రజలను నీ శక్తి ఓడిస్తుంది.
9 నీవు కనబడినప్పుడు
ఆ శత్రువులను వేడి పొయ్యిలోని నిప్పువలె చేస్తావు.
యెహోవా కోపము వేడి మంటవలె కాలుస్తుంది.
మరియు ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు.
10 ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి.
వారు భూమి మీద నుండి తొలగిపోతారు.
11 ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు.
చెడుకార్యాలు చేయాలని వారు యోచించారు గాని వారు సాధించలేదు.
12 కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు.
ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు.
13 యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి
మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు వాయిస్తాము.
11 తూరు రాజైన హీరాము కొందరు దూతలను దావీదు వద్దకు పంపాడు. వారితో పాటు దేవదారు కలపను, వడ్రంగులను, శిల్పులను పంపాడు. వారంతా దావీదుకు ఒక భవనం నిర్మించారు. 12 నిజంగా యెహోవా తనను ఇశ్రాయేలుకు రాజును చేసినట్లు దావీదుకు ఆ సమయంలో అర్థమయ్యింది. యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన రాజ్యాన్ని చాలా ముఖ్యమైనదిగా దేవుడు చేసినాడని దావీదు తెలుసుకొన్నాడు.
13 దావీదు యెరూషలేము నుండి పెక్కు మంది దాసీలను, భార్యలను స్వీకరించాడు. హెబ్రోను నుండి యెరూషలేముకు వెళ్లిన పిమ్మట దావీదు ఆ పని చేసాడు. దావీదుకు చాలా మంది కుమారులు, కుమార్తెలు కలిగారు. 14 యెరూషలేములో దావీదుకు కలిగిన కుమారుల పేర్లు: షమ్మూ, యషోబాబు, నాతాను, సొలొమోను, 15 ఇభారు, ఏలీషూవ, నెపెగు, యాఫీయ, 16 ఎలీషామా, ఎల్యాదా మరియు ఎలీపేలెటు.
సహనము
7 అందువల్ల సోదరులారా! ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే విలువైన పంటకోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో గమనించండి. అతడు, తొలకరి కడవరి వర్షం దాకా సహనంతో కాచుకొని ఉంటాడు. 8 ప్రభువు రానున్న సమయం సమీపిస్తోంది. కనుక ధైర్యం చెడకుండా సహనంతో ఉండండి. 9 సోదరులారా! ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ న్యాయాధిపతి మీ తలుపు ముందు నిలుచున్నాడు.
10 సోదరులారా! ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు కష్టాలు అనుభవించారు. వాళ్ళలో సహనం ఉంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి. 11 కష్టాలు అనుభవించి కూడా విశ్వాసంతో ఉన్నవాళ్ళను మనము ధన్యులుగా భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసినదాన్ని చూసారు. ప్రభువులో దయా దాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి.
మీరేమంటున్నారో జాగ్రత్త
12 నా సోదరులారా! అన్నిటికన్నా ముఖ్యమైనదేమిటంటే, పరలోకం పేరిట గాని, భూమి పేరిట గాని, మరేదానిపై గాని ఒట్టు పెట్టుకోకండి. మీరు “ఔను” అని అనాలనుకొంటె “ఔను” అనండి. “కాదు” అని అనాలనుకొంటె “కాదు” అని అనండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షించడు.
© 1997 Bible League International