Revised Common Lectionary (Semicontinuous)
కోరహు కుమారుల స్తుతి పాట.
48 యెహోవా గొప్పవాడు.
మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు.
2 దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎత్తైనది.
అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది.
సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం.[a]
అది మహారాజు పట్టణం.
3 ఇక్కడ ఆ పట్టణంలోని
భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు.
4 ఒకప్పుడు రాజులు కొందరు సమావేశమయ్యారు.
వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు.
వారంతా కలసి ముందుకు వచ్చారు.
5 ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు,
వారు బెదిరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
6 ఆ రాజులందరికీ భయం పట్టుకొంది.
ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు.
7 దేవా, బలమైన తూర్పుగాలితో
తర్షీషు ఓడలను బ్రద్దలు చేశావు.
8 మేము ఏమి విన్నామో, దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో
మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో చూశాము.
దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు.
9 దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.
10 దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు.
భూలోకమంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
11 సీయోను పర్వతం సంతోషిస్తుంది.
మరియు యూదా నగరాలు ఆనందంగా ఉన్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు.
12 సీయోను చుట్టూ తిరుగుతూ
ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి.
13 ఎత్తైన గోడలు చూడండి.
సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి.
అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు.
14 ఈ విషయాలు దేవుడు ఎటువంటి వాడు అనేది మనకు తెలియజేస్తున్నాయి:
ఆయన ఎప్పటికీ మన దేవుడు, ఆయన ఎల్లప్పుడు మనలను కాపాడుతాడు.
ఇశ్రాయేలు, యూదా మధ్య యుద్ధం
3 సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి[a] మధ్య దీర్ఘకాలిక యుద్ధం కొనసాగింది. దావీదు రాను రాను బాగా బలపడ్డాడు. సౌలు కుటుంబం నానాటికీ బలహీనమయింది.
హెబ్రోనులో దావీదుకు ఆరుగురు కుమారులు కలగటం
2 హెబ్రోనులో దావీదుకు పుత్ర సంతానం కలిగింది.
మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి యెజ్రె యేలీయురాలగు అహీనోయము.
3 రెండవ కుమారుడు కిల్యాబు. కిల్యాబు తల్లి అబీగయీలు. ఈమె కర్మెలీయుడగు నాబాలు భార్యయైన విధవరాలు.
మూడవ కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము తల్లి గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకా.
4 నాల్గవ కుమారుడు అదోనీయా. అదోనీయా తల్లి హగ్గీతు.
ఐదవ కుమారుడు షెఫట్య. షెఫట్య తల్లి అబీటలు.
5 ఆరవ కుమారుడు ఇత్రెయాము. ఇత్రెయాము తల్లి దావీదు భార్యయగు ఎగ్లా.
ఈ ఆరుగురు కుమారులు హెబ్రోనులో దావీదుకు కలిగారు.
అబ్నేరు దావీదుతో చేరేందుకు నిశ్చయించటం
6 సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి యుద్ధం జరిగిన కాలంలో అబ్నేరు సౌలు సైన్యంలో బలాన్ని పుంజుకున్నాడు. 7 సౌలుకు రిస్పా అనే ఒక దాసి వుండేది. ఆమె సౌలుకు ఇంచుమించు భార్యవలె వుండేది. రిస్పా అయ్యా అనువాని కుమార్తె. ఇష్బోషెతు ఒకనాడు అబ్నేరును పిలిచి, “నా తండ్రి పనిగత్తెతో నీవు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు?” అని అడిగాడు.
8 ఇష్బోషెతు అన్న మాటకు అబ్నేరుకు ఎక్కడా లేని కోపం వచ్చింది. అబ్నేరు ఇలా అన్నాడు, “నేను సౌలుకు, అతని కుటుంబానికి చాలా విధేయుడనై వున్నాను! నేను నిన్ను దావీదుకు అప్పగించలేదు; (పైగా అతడు నిన్ను ఓడించేలా చేయనూ లేదు.) యూదావారి తరపున పనిచేస్తూ ఒక రాజద్రోహిగా[b] నేను ఎన్నడూ మెలగలేదు. కాని నీవిప్పుడు నేనొక నీచకార్యం చేసినట్లు మాట్లాడుతున్నావు! 9-10 నేనిప్పుడు నిశ్చియంగా చెబుతున్నాను. దేవుడు చెప్పిన విషయాలు ఇప్పుడు జరిగేలా నేను తప్పక ప్రయత్నం చేస్తాను! సౌలు వంశంనుండి రాజ్యాన్ని తీసుకొని దావీదుకు ఇస్తానని యోహోవా చెప్పాడు. దావీదును యూదా రాజ్యానికి, ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా చేస్తాడు. దాను నుండి బెయేర్షబా వరకు దావీదు పరిపాలిస్తాడు! ఈ పనులన్నీ నెరవేరేలా నేను సహాయ పడకపోతే దేవుడు నన్ను శిక్షించుగాక!” 11 ఇష్బోషెతు అబ్నేరుతో ఇంకేమీ చెప్పలేక పోయాడు. ఇష్బోషెతు అతనంటే విపరీతంగా భయపడిపోయాడు.
12 అబ్నేరు దావీదు వద్దకు దూతలను పంపాడు. అబ్నేరు తన మాటగా ఇలా చెప్పమన్నాడు: “నీవు ఈ రాజ్యాన్ని ఏలు. నాతో ఒక ఒడంబడిక చేసుకో. నీవు ఇశ్రాయేలంతటికీ రాజయ్యేలా నేను నీకు సహాయపడతాను.”
7 మీరు పైకి కనిపించే వాటిని మాత్రమే చూస్తున్నారు. తాను క్రీస్తుకు చెందినవాణ్ణని విశ్వసించినవాడు, తాను ఏ విధంగా క్రీస్తుకు చెందాడో మేము అతనిలాగే క్రీస్తుకు చెందినవాళ్ళమని గమనించాలి. 8 మిమ్మల్ని నాశనం చెయ్యటానికి కాకుండా అభివృద్ధి పరచటానికి ప్రభువు మాకు అధికారమిచ్చాడు. దాన్ని గురించి నేను గొప్పలు చెప్పుకోవటానికి సిగ్గుపడను. 9 నా లేఖల ద్వారా మిమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నించటం లేదు. మీరు అలా అనుకోకండి. 10 ఎందుకంటే కొందరు, “అతని లేఖలు బలంగా, ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. కాని మనిషిని ఎదురుగా ఉన్నప్పుడు చూస్తే బలహీనంగా ఉంటాడు. మాటలు నిస్సారంగా ఉంటాయి” అని అంటారు. 11 వాళ్ళు మేము దూరంగా వుండి లేఖల్లో వ్రాసిన విధంగా సమక్షంలో ఉన్నప్పుడు కూడా నడుచుకొంటామని గమనించాలి.
© 1997 Bible League International