Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
27 కానీ మరునాడు, అంటే ఆ నెల రెండో రోజున కూడా దావీదు స్థానం ఖాళీగావుంది. “యెష్షయి కుమారుడు నిన్న, ఈ రోజు కూడా అమావాస్యవిందుకు ఎందుకు రాలేదని సౌలు యోనాతానును” అడిగాడు.
28 “బేత్లెహేము వెళ్లనిమ్మని దావీదు నన్ను అడిగాడు. 29 అతని కుటుంబం వాళ్లున్న బేత్లెహేములో ఒక బలి అర్పణ ఇస్తున్నారని, అతడు చెప్పాడు. అతని సోదరుడు అతనిని రమ్మని పిలిచాడనీ, కాబట్టి తన సోదరులను చూడటానికి అనుమతి ఇమ్మని స్నేహితునిగా అడుగుతున్నాననీ దావీదు చెప్పాడు. అందుచేత దావీదు రాజు విందుకు రాలేక పోయాడు,” అని యోనాతాను చెప్పాడు.
30 సౌలుకు యోనాతాను మీద చాల కోపం వచ్చింది, “మాట తిరస్కరించే బానిస స్త్రీకి పుట్టినవాడివి నీవు! నీవు ఆ స్త్రీలాగే ప్రవర్తిస్తున్నావు. నాకు తెలుసు నీవు దావీదు పక్షాన ఉన్నావని. నీకూ, నిన్ను కన్నతల్లికి తలవంపులు తెస్తున్నావు. 31 యెష్షయి కుమారుడు బ్రతికి ఉన్నంత వరకూ నీవు రాజు కావటంగాని, రాజ్యాన్ని చేపట్టటం గాని జరుగదు. ఇప్పుడే దావీదును నా దగ్గరకు తీసుకునిరా! వాడు చచ్చిన వారితో సమానము!” అన్నాడు సౌలు.
32 “దావీదును ఎందుకు చంపాలి? దావీదు చేసిన నేరం ఏమిటి?” అని యోనాతాను తన తండ్రిని అడిగాడు.
33 సౌలు తన ఈటెను యోనాతాను మీదికి విసరి, అతనిని చంపటానికి ప్రయత్నం చేసాడు. దానితో తన తండ్రి నిజంగానే దావీదును చంపాలని తల పెట్టాడని యోనాతానుకు అర్థమయ్యింది. 34 యోనాతానుకు విపరీతంగా కోపం వచ్చింది. భోజనాల బల్ల వదిలి వెళ్లిపోయాడు. యోనాతాను తన తండ్రి మీద చాల కోపంతో ఆ విందు రెండో రోజు కూడ ఏమీ భోజనం చేయటానికి ఒప్పుకోలేదు. సౌలు తనను పరాభవించినందుకు, దావీదును చంపాలని చూస్తున్నందుకు యోనాతాను కోపగించాడు.
యోనాతాను, దావీదు వీడ్కోలు చెప్పుకోవడం
35 ఆ మరునాటి ఉదయం యోనాతాను పొలానికి వెళ్లాడు. వాళ్లనుకున్నట్లుగా దావీదును కలవటానికి అతడు వెళ్లాడు. యోనాతాను తన వెంట ఒక చిన్న పిల్లవానిని కూడ తీసుకొని వెళ్లాడు. 36 “నేను వేసే బాణాన్ని పరుగున పోయి వెదికి తీసుకొనిరా” అని యోనాతాను పిల్లవానితో చెప్పాడు. ఆ పిల్లవాడు పరుగెత్తుచుండగా యోనాతాను వాని తల మీదగా అవతలికి బాణాలు వేశాడు. 37 బాణాలు పడిన చోటుకి బాలుడు పరుగెత్తాడు. కానీ యోనాతాను “బాణాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి” అని అరిచాడు. 38 “వెళ్లు! త్వరగా వెళ్లు! ఆ బాణాలు తీసుకురా, ఆగకు!” అంటూ యోనాతాను కేకలు వేశాడు. ఆ బాలుడు బాణాలు తీసుకొని తన యజమాని వద్దకు తెచ్చాడు. 39 ఈ సందర్భంలో ఇక్కడ అతి రహస్యంగా ఏమి జరిగిందో ఆ బాలునికి ఏమీ తెలియదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే అది తెలుసు. 40 యోనాతాను తన విల్లు, అంబులను ఆ బాలునికి ఇచ్చి, “పట్టణానికి వెళ్లి పో” అని చెప్పాడు.
41 ఆ కుర్రవాడు వెళ్లిపోయాక, కొండ ఆవలి ప్రక్క తాను దాగివున్న చోటనుండి దావీదు బయటకి వచ్చాడు. దావీదు యోనాతాను ముందు ప్రణమిల్లాడు. అలా మూడుసార్లు దావీదు చేశాడు. తరువాత దావీదు, యోనాతాను ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. వారు ఇద్దరూ బాగా ఏడ్చారు. దావీదు యోనాతాను కంటె ఎక్కువగా ఏడ్చాడు.
42 “శాంతితో వెళ్లు. మనము స్నేహితులుగా కొనసాగుతామని యెహోవా నామంలో వాగ్దానం చేసుకున్నాము. మనమధ్య, మన తరువాత మన తరాల వారి మధ్య యెహోవా శాశ్వతంగా సాక్షిగా ఉంటాడని మనము చెప్పుకున్నాము” అని యోనాతాను దావీదుతో అన్నాడు.
యేసు ఒక మనుష్యుని దయ్యంనుండి విడిపించటం
(మార్కు 1:21-28)
31 అక్కడి నుండి ఆయన గలిలయలోని కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి రోజున బోధించటం మొదలు పెట్టాడు. 32 ఆయన అధికారమున్న వానిలా బోధించటం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు.
33 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడు. ఆ దయ్యం బిగ్గరగా, 34 “ఓ నజరేయుడైన యేసూ! మాతో నీకేంపని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నది. 35 యేసు, “నోరు మూసుకొని అతని నుండి బయటకు రా!” అని గద్దించాడు. ఆ దయ్యం తాను పట్టిన వాణ్ణి క్రింద పడవేసి ఏ హానీ చెయ్యకుండా ఆ దయ్యం వెలుపలికి వచ్చింది.
36 అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పరస్పరం, “ఏమిటిది? దయ్యాలను కూడా ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడే? అవి బయటికి రావటానికి ఈయన మాటల్లో ఎంత శక్తి ఉందో కదా?” అని మాట్లాడుకున్నారు. 37 ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో ఈయన్ని గురించి అందరికి తెలిసింది.
© 1997 Bible League International