Revised Common Lectionary (Semicontinuous)
సామెహ్
113 స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం.
నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను.
114 నన్ను దాచిపెట్టి, కాపాడుము.
యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
115 యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము.
నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము.
నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.
117 యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడతాను.
నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను.
118 యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు.
ఎందుకంటే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు.
119 యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు.
కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
120 యెహోవా, నీవంటే నాకు భయం,
నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను.
అయిన్
121 యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను.
నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు.
122 నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము.
యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము.
123 యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు.
కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి.
124 నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
125 నేను నీ సేవకుడను
నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
126 యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం.
ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు.
127 యెహోవా, నీ ఆజ్ఞలు
మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం.
128 నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను.
తప్పుడు బోధలు నాకు అసహ్యం.
సౌలు మరల దావీదును చంపాలని చూచుట
8 మళ్లీ యుద్ధం వచ్చినప్పుడు దావీదు ఫిలిష్తీయులను ఎదుర్కోవటానికి వెళ్లాడు. దావీదు వారిని తరిమికొట్టాడు, వారు అతని దగ్గరనుండి పారిపోయారు. 9 కానీ ఒక దుష్ట ఆత్మ యెహోవా వద్దనుండి వచ్చి సౌలును ఆవరించింది. సౌలు తన ఇంట్లోనే కూర్చునివున్నాడు. సౌలు చేతిలో అతని ఈటెవుంది. దావీదు సితార వాయిస్తూ ఉన్నాడు. 10 సౌలు తన ఈటెను దావీదు మీదికి విసరి అతనిని వెనుక ఉన్న గోడకు గుచ్చివేయాలని ప్రయత్నించాడు. కాని ఈటెను దావీదు తప్పుకోవటంతో ఈటె గురి తప్పిగోడలోకి దిగిపోయింది. ఆ రాత్రి దావీదు పారిపోయాడు.
11 సౌలు తన మనుష్యులను దావీదు ఇంటికి పంపాడు. వారు దావీదు ఇంటిపై నిఘా వేసి రాత్రి అంతా అక్కడే ఉండి, ఉదయమే అతనిని చంపే ప్రయత్నంలో కనిపెట్టుకొని ఉన్నారు. కానీ దావీదు భార్య మీకాలు అతనిని హెచ్చరించింది. “ఈ రాత్రి నీవు పారిపోయి నీ ప్రాణాలను రక్షించుకో. లేనిచో ఉదయమే నీవు చంపబడతావు” అని ఆమె చెప్పింది. 12 అలా చెప్పి, దావీదును ఒక కిటికిగుండా బయటకుదింపింది. దావీదు తప్పించుకొని పారిపోయాడు. 13 మీకాలు గృహ దేవత విగ్రహాన్ని తెచ్చి పక్కమీద ఉంచి దుప్పట్లు కప్పింది. ఆ విగ్రహం తల మీద కొన్ని మేక వెంట్రుకలు కూడ ఆమె అమర్చింది.
14 దావీదును బంధించమని సౌలు తన సైనికులను పంపాడు. కానీ “దావీదుకు అనారోగ్యంగా వుందని” మీకాలు చెప్పింది.
15 ఈ విషయం తన మనుష్యులు చెప్పేసరికి, “అవసరమైతే దావీదును మంచంతో సహా ఎత్తుకు రండి. నేను అతనిని అవసరమైతే చంపేస్తాను” అని ఆ మనుష్యులతో సౌలు చెప్పాడు.
16 సౌలు మనుష్యులు దావీదు కోసం మళ్లీ దావీదు ఇంటికి వెళ్లి చూడగా పక్కమీద ఉన్నది ఒక దేవతా విగ్రహం మాత్రమేనని, దాని తలమీద ఉన్నవి కేవలం మేక వెంట్రుకలు మాత్రమేననీ వారు తెలుసుకున్నారు.
17 “ఇలా నన్నెందుకు మోసగించావు, నా శత్రువును వదిలిపెట్టావు, వాడు పారిపోయాడు” అని సౌలు మీకాలును అడిగాడు.
“తనకు సహాయం చేయకపోతే నన్ను చంపుతానని అతడు బెదిరించాడు. అందుకే నేను అలా చేశానని” మీకాలు జవాబు ఇచ్చింది.
యేసు నీళ్ళపై నడవటం
(మత్తయి 14:22-33; యోహాను 6:16-21)
45 ఆ తదుపరి యేసు తన శిష్యులతో, పడవనెక్కి, తనకన్నాముందు బేత్సయిదాకు వెళ్ళమని గట్టిగా చెప్పాడు. బేత్సాయిదా సముద్రంకు ఆవలివైపున ఉంది. యేసు ప్రజల్ని తమ తమ యిండ్లకు వెళ్ళమని చెప్పాడు. 46 వాళ్ళను వదిలి ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు.
47 అర్ధరాత్రికి శిష్యులున్న పడవ సముద్రం మధ్యవుంది. యేసు మాత్రం యింకా గట్టునే ఉన్నాడు. 48 ఎదురు గాలి వీయటంవల్ల శిష్యులు కష్టంగా తెడ్లు వేయటం ఆయన చూసాడు. తెల్లవారు ఝామున యేసు నీళ్ళ మీదుగా నడిచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళను దాటి ముందుకు వెళ్తుంటే 49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళమీద నడవటం చూసి, దయ్యం అనుకొని భయపడి బిగ్గరగా కేకలు వేసారు. 50 వెంటనే ఆయన వాళ్ళతో మాట్లాడుతూ, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు. 51 ఆయన పడవనెక్కగానే గాలి తీవ్రత పూర్తిగా తగ్గి పోయింది. వాళ్ళు ఇది చూసి దిగ్భ్రాంతి చెందారు. రొట్టెలు పంచిన అద్భుతాన్ని వాళ్ళు చూశారు. 52 కాని దానిని అర్థం చేసుకోలేక పోయారు.
© 1997 Bible League International