Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 17:1

గొల్యాతు ఇశ్రాయేలీయులను యుద్ధానికి సవాలుచేయుట

17 ఫిలిష్తీయులు వారి సైన్యాన్ని యుద్ధానికి సమీకరించారు. వారు యూదాలో శోకో అనేచోట సమావేశమయ్యారు. వారి శిబిరం ఏఫెస్దమ్మీము అనే పట్టణం వద్ద పెట్టారు. ఏఫెస్దమ్మీము అనే పట్టణం శోకోకు, అజేకాకు మధ్యగా వుంది.

1 సమూయేలు 17:4-11

ఫిలిష్తీయులకు ఒక ప్రఖ్యాత వీరుడు ఉన్నాడు. వానిపేరు గొల్యాతు. వాడు గాతుకు చెందినవాడు. అతని ఎత్తు తొమ్మిది అడుగుల[a] కంటె ఎక్కువ. గొల్యాతు ఫిలిష్తీయుల శిబిరంలో నుంచి బయటికి వచ్చాడు. అతని తలమీద ఒక కంచుటోపీ ఉంది. కంచుతో చేసిన చేప పొలుసులవంటి కవచం అతడు ధరించాడు. ఈ కవచం కంచుతో చెయబడి నూట ఇరవై అయిదు పౌన్ల బరువు ఉంది. గొల్యాతు కాళ్లకు రాగి కవచాలు ఉన్నాయి. కంచు ఈటె[b] ఒకటి అతని మెడమీద కట్టబడి వుంది. గొల్యాతు ఈటెకువున్న కర్రపిడి సాలెవాని మగ్గం వద్దవుండే దోనెలాగా వుంది. ఈటెకత్తి బరువు పది హేను “పౌన్లు.”[c] గొల్యాతు డాలు మోసే భటుడు అతనికి ముందుగా నడిచాడు.

గొల్యాతు బయటకు వచ్చి ఇశ్రాయేలు సైనికులకు కేకవేసాడు: “మీ సైనికులు అందురూ యూద్ధానికి బారులు తీసారు ఎందుకు? మీరు సౌలు సేవకులు. నేను ఫిలిష్తీవాడిని. కనుక మీరు ఒకనిని ఎంపిక చేసుకొని నాతో పోరాడేందుకు వానిని పంపించండి. వాడు గనుక నన్ను చంపితే ఫిలిష్తీయులందరు మీ సేవకులవుతారు. కానీ నేను గెలిచి మీవాడిని చంపితే, మీరంతా మాకు సేవకులు అవుతారు. అప్పుడు మీరు మాకు సేవ చేస్తారు!” అన్నాడు అతను.

10 “ఈ రోజు నేనిలా నిలబడి ఇశ్రాయేలు సైన్యాన్ని ఎగతాళి చేస్తున్నాను! నాతో పోరాడటానికీ మీలో ఒకనిని పంపండి” అనికూడ ఆ ఫిలిష్తీయుడు అన్నాడు.

11 గొల్యాతు చెప్పిన వాటిని సౌలు, ఇశ్రాయేలు సైనికులు విన్నారు. వారు చాలా భయపడ్డారు.

1 సమూయేలు 17:19-23

19 నీ సోదరులంతా ఇప్పుడు సౌలుతోనూ, ఇశ్రాయేలు సైన్యంతోనూ కలిసి ఏలా లోయలో ఉన్నారు. వారు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు.”

20 దావీదు తెల్లవారు ఝామునే లేచి మరో కాపరికి మందను అప్పగించాడు. ఆహారపు మూటను తీసుకుని యెష్షయి చెప్పిన విధంగా బయలుదేరి వెళ్లాడు. దావీదు తన బండిని శిబిరం యొద్దకు తోలుకెళ్లాడు. దావీదు అక్కడికి వచ్చేటప్పటికి, సైనికులు వారి వారి యుద్ధ స్థావరాలకు వెళ్లుచూ ఉన్నారు. సైనికులు యుద్ధ నినాదాలు చేయటం మొదలుబెట్టారు. 21 ఇశ్రాయేలీయులు, ఫిలిష్తీయులు వారి వారి మనుష్యులను యుద్ధంలో సంధించటానికి సమీకరిస్తున్నారు.

22 ఆహార పదార్థాల అజమాయిషీ వహించే వ్యక్తివద్ద దావీదు తను తెచ్చిన ఆహార పదార్థాలను వుంచి, ఇశ్రాయేలు సైనికులు ఉన్న చోటికి పరుగెత్తాడు. తన సోదరులను గూర్చి దావీదు అడిగాడు. 23 దావీదు తన సోదరులతో సంభాషించటం మొదలుబెట్టాడు. అదే సమయానికి ఫిలిష్తీయుల పోరాట వీరుడు గాతీయుడైన గొల్యాతు ఫిలిష్తీ సైన్యంనుండి బయటకు వచ్చాడు. గొల్యాతు ఇశ్రాయేలీయులను మామూలు గానే కవ్వించే కేకలు వేసాడు. ఇది దావీదు విన్నాడు.

1 సమూయేలు 17:32-49

32 దావీదు, “ఎవ్వరినీ నిరుత్సాహ పడనియ్యవద్దు. నేను మీ సేవకుడిని. నేను వెళ్లి ఈ ఫిలిష్తీ వానితో పోరాడుతాను” అని సౌలుతో చెప్పాడు.

33 సౌలు, “నీవు ఈ ఫిలిష్తీ గొల్యాతును ఎదిరించి పోరాడలేవు. నీవు కనీసం ఒక సైనికుడివి కూడ కాదు. గొల్యాతు చిన్నప్పటి నుండీ యుద్ధంలో ఆరితేరిన వాడు” అని జవాబిచ్చాడు.

34 అయితే, “నీ సేవకుడనగు నేను నా తండ్రి గొర్రెలను కాపలా కాస్తూ ఉండేవాడిని. ఎప్పుడైనా ఒక సింహంగాని, ఎలుగు బంటిగాని నా మంద మీది కొచ్చి ఒక గొర్రెను పట్టుకుంటే, 35 దానిని నేను తరిమి కొట్టేవాడిని. ఆ అడవి మృగాన్ని నేను ఎదిరించి, దాని నోటినుండి గొర్రెను రక్షించేవాడిని. ఒకవేళ అదే నా మీదికి వస్తే, దాని జూలు పట్టి దానితో పోరాడి, దాన్ని చంపేసేవాడిని. 36 నేను ఒక సింహాన్ని, ఒక ఎలుగుబంటినీ చంపేసాను. అదే విధంగా సున్నతి సంస్కారం లేని ఆ పరాయి ఫిలిష్తీయుడిని నేను చంపేస్తాను. జీవిస్తున్న దేవుని సైన్యాన్ని గొల్యాతు ఎగతాళి చేసాడు గనుక వాడు చస్తాడు. 37 యెహోవా నన్ను సింహంనుండి, ఎలుగుబంటినుండి కాపాడాడు. ఇప్పుడు ఈ ఫిలిష్తీయుడైన గొల్యాతునుండి కూడ ఆ యెహోవాయే నన్ను రక్షిస్తాడు” అని దావీదు సౌలుతో చెప్పాడు.

“అయితే వెళ్లు. యెహోవా నీకు తోడైయుండునుగాక!” అని దావీదుతో చెప్పాడు సౌలు. 38 సౌలు తన స్వంత వస్త్రాలను దావీదుకు ధరింపజేసాడు. దావీదు తలమీద ఒక కంచు శిరస్త్రాణం (టోపి), అతని వంటిమీద ఒక కవచం సౌలు పెట్టించాడు. 39 దావీదు ఒక కత్తి ధరించి అటు ఇటు నడవటానికి ప్రయత్నించాడు. సౌలు యుద్ధ వస్త్రాలను దావీదు ధరించటానికి ప్రయత్నించాడు. కానీ ఈ బరువులన్నీ ధరించటం దావీదుకు అలవాటు లేదు.

అప్పుడు దావీదు, “ఇవన్నీ వేసుకుని నేను పోరాడలేను. వీటన్నిటికీ నేను అలవాటు పడలేదు,” అని సౌలుతో చెప్పి వాటన్నింటినీ విడిచి వేశాడు. 40 దావీదు తన చేతికర్ర తీసుకున్నాడు. లోయలో ఉన్న మంచి నునుపైన రాళ్లను ఐదింటిని దావీదు ఏరుకొన్నాడు. ఆ అయిదు రాళ్లను తన సంచిలో వేసుకున్నాడు. తన చేతిలో వడిసెలు పుచ్చుకొన్నాడు. అప్పుడు ఫిలిష్తీయుడైన గొల్యాతును ఎదురించేందుకు అతడు వెళ్లాడు.

దావీదు గొల్యాతును చంపుట

41 ఫిలిష్తీయుడైన గొల్యాతు నెమ్మదిగా నడుస్తూ దావీదుకు సమీపంగా వస్తున్నాడు. గొల్యాతు కవచంమోసే సహాయకుడు వానికి ముందుగా నడుస్తున్నాడు. 42 గొల్యాతు దావీదును చూచి నవ్వసాగాడు. దావీదు ఒక సైనికుడు కూడ కానట్టు గొల్యాతు చూసాడు. దావీదు కేవలం ఎర్రని ముఖంగల ఒక అందగాడు మాత్రమే. 43 గొల్యాతు దావీదు వైపు చూసి, “నేనేమైనా కుక్కని అనుకున్నావా కర్ర పట్టుకొని వచ్చావు!” అని ఎగతాళి చేశాడు. గొల్యాతు తన దేవుళ్ల పేర్లన్నీ ఉచ్చరిస్తూ దావీదును శపించాడు. 44 “ఇటు రారా! నీ శవాన్ని పక్షులకు, జంతువులకు ఆహారంగా వేస్తాను” అంటూ దావీదు మీద కేకలు వేసాడు గొల్యాతు.

45 “నీవు కత్తి, కవచం, ఈటెలు ధరించి నా దగ్గరకు వస్తున్నావు. కానీ నేను ఇశ్రాయేలు సైన్యాలకు దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా పేరిట నీ దగ్గరకు వస్తున్నాను. ఆయనపై నీవు నిందా వాక్యాలు పలికావు. 46 ఈ రోజు ఆ యెహోవా, నాచేత నిన్ను ఓడిస్తాడు. నిన్ను నేను చంపేస్తాను. ఈ వేళ నేను నీ తల నరికి నీ శవాన్ని పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను. మిగిలిన ఫిలిష్తీయులందరికీ అలానే చేస్తాము. అప్పుడు ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ప్రపంచం అంతా తెలుసుకొంటుంది. 47 ప్రజలను రక్షించాలంటే యెహోవాకు కత్తులు, కటారులు అక్కరలేదని ఇక్కడున్నవారంతా తెలుసుకొంటారు. ఈ యుద్ధం యెహోవాదే! మీ ఫిలిష్తీయులందరినీ ఓడించేలా యెహోవా మాకు సహాయం చేస్తాడు” అని దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతుతో చెప్పాడు.

48 ఫిలిష్తీయుడైన గొల్యాతు దావీదు మీద పడటానికి మెల్లగా దగ్గరగా వెళ్లాడు. దావీదు గొల్యాతును ఎదుర్కోటానికి వేగంగా పరుగెత్తాడు.

49 దావీదు తన సంచిలో నుంచి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి దానిని విసరికొట్టాడు. ఆ రాయి వడిసెల నుండి వెళ్లి గొల్యాతునుదుటి మీద గట్టిగా తగిలింది. ఆ రాయి అతని తలలోనికి లోతుగా దూసుకుపోయింది. గొల్యాతు ఒక్క సారిగా నేలమీద బోర్ల పడిపోయాడు.

1 సమూయేలు 17:57-18:5

57 గొల్యాతును చంపి దావీదు తిరిగి రాగానే అబ్నేరు అతనిని సౌలువద్దకు తీసుకుని వచ్చాడు. దావీదు ఇంకా ఆ ఫిలిష్తీయుని తలను చేతిలో పట్టుకొని ఉన్నాడు.

58 “చిన్నవాడా! నీ తండ్రి ఎవరు?” అని సౌలు అతన్ని అడిగాడు.

“బేత్లెహేములో ఉన్న మీ సేవకుడు యెష్షయి కుమారుడను నేను” అని దావీదు జవాబు చెప్పాడు.

దావీదు-యోనాతానుల స్నేహం

18 దావీదు సౌలుతో మాట్లాడటం ముగించాక, యోనాతాను దావీదుకు చాలా సన్నిహితుడయ్యాడు. తనను తాను ప్రేమించుకున్నంతగా యోనాతాను దావీదును ప్రేమించాడు. సౌలు ఆ రోజు నుంచీ దావీదును తన వద్దనే ఉంచుకొన్నాడు. దావీదును ఊరిలోవున్న తన తండ్రి వద్దకు సౌలు పోనీయలేదు. యోనాతాను దావీదుతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఎందువల్లనంటే, దావీదు అంటే యోనాతానుకు ఎనలేని ప్రేమ. యోనాతాను తన అంగీ తీసి దావీదుకు తొడిగాడు. యోనాతాను తన సైనిక దుస్తులు కూడా దావీదుకు ఇచ్చాడు. అంతేగాదు; యోనాతాను తన ఖడ్గం, విల్లంబులు, పటకా అన్నీ దావీదుకు ఇచ్చాడు.

దావీదు విజయాన్ని సౌలు గుర్తించుట

సౌలు దావీదును అనేక యుద్ధాలకు పంపాడు అన్నింటిలో అతడు విజయం సాధిస్తూ వచ్చాడు. కాబట్టి అతనిని సైన్యాధికారిగా సౌలు నియమించాడు. దీనికి ప్రజలంతా చాలా సంతోషించారు. సౌలు అధికారులు కూడ సంతోషించారు.

1 సమూయేలు 18:10-16

సౌలు దావీదును గూర్చి భయపడుట

10 ఆ మరుసటి రోజు దేవుని యొద్ద నుండి ఒక దుష్ట ఆత్మ సౌలును బలీయంగా ఆవరించింది. తన ఇంటిలో సౌలు చాలా కిరాతకంగా ప్రవర్తించాడు. ఎప్పటిలాగే దావీదు తన వీణ వాయించాడు. కానీ సౌలు చేతిలో ఒక బల్లెం ఉంది. 11 “దావీదును గోడకు గుచ్చి వేయాలని సౌలు” తలంచాడు. రెండుసార్లు సౌలు బల్లెం విసరినాడు. కానీ దావీదు తప్పించుకున్నాడు.

12 యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. యెహోవా సౌలును వదిలివేశాడు. అందువల్ల దావీదు అంటే సౌలుకు భయంవేసింది. 13 సౌలు తన దగ్గరనుండి దావీదును పంపివేసాడు. సౌలు దావీదును వెయ్యిమంది సైనికులకు అధిపతిగా చేసాడు. ఆ సైనికులను దావీదు యుద్ధానికి నడిపించాడు. 14 యెహోవా దావీదుతో ఉన్నాడు గనుక, దావీదు ఏది చేసినా విజయాన్నే సాధిస్తూవచ్చాడు. 15 దావీదు చాలా విజయం సాధిస్తున్నట్టు సౌలు గమనించాడు. దానితో సౌలుకు దావీదు అంటే భయం ఇంకా ఎక్కువయ్యింది. 16 కానీ ఇశ్రాయేలు, యూదా ప్రజలు అందరూ దావీదును ఎక్కువగా ప్రేమించారు. కారణం వారిని యుద్ధంలో దావీదు అతిచాకచక్యంగా నడిపించుటచేత.

కీర్తనలు. 9:9-20

అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి
    గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు.
ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు.
    యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.

10 నీ నామం తెలిసిన ప్రజలు
    నీమీద విశ్వాసం ఉంచాలి.
యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే
    సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.

11 సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి.
    యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.
12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని
    ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు.
ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు.
    మరి యెహోవా వారిని మరచిపోలేదు.

13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము.
    నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము.
    ‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.
14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను.
    నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”

15 యూదులు కాని ఆ ప్రజలు, ఇతరులను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు.
    కాని, యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే పడ్డారు.
    ఆ మనుష్యులు ఇతరులను పట్టడానికి వలలు మాటున పెట్టారు.
    కాని, వారి పాదాలే ఆ వలల్లో చిక్కుబడ్డాయి.
16 యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు.
    యెహోవా చేసినదాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్[a]

17 దేవుని మరచే ప్రజలు దుష్టులు.
    ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు.
18 పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది.
    కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.

19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము.
    వారే శక్తిగలవారు అని ప్రజలను తలంచనీయకుము.
20 ప్రజలకు పాఠం నేర్పించు.
    వారు కేవలం మానవ మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము.

కీర్తనలు. 133

దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.

133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
    ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
    అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
    సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.

2 కొరింథీయులకు 6:1-13

దేవునితో సహపనివారంగా మేము, దైవానుగ్రహాన్ని వృథా చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము. ఎందుకంటే, దేవుడే ఈ విధంగా అన్నాడు:

“నేను సరియైన సమయానికి మీ మనవి విన్నాను.
    రక్షించే రోజున మీకు సహాయం చేసాను.”(A)

నేను చెప్పేదేమిటంటే, దేవుడు అనుగ్రహించే సమయం ఇదే. రక్షించే రోజు ఈ దినమే.

మేము చేసే సేవ చెడుపేరు పొందరాదని, మేము ఎవరి దారికి ఆటంకాలు కలిగించము. దానికి మారుగా మేము అన్ని విషయాలలో దేవుని సేవకులమని రుజువు చేసుకొంటున్నాము. ఆ గొప్ప సహనం మాకు కష్టాలు, దుఃఖాలు, అవసరాలు కలిగినప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు, చెరసాలలో పడినప్పుడు, ప్రజలు ఎదురు తిరిగినప్పుడు, నిద్రాహారాలు లేక కష్టపడి పని చేసినప్పుడు, నిష్కల్మషంగా ఉండటంలో, యితర్లను అర్థం చేసుకోవటంలో, సహనం, దయ చూపటంలో, పరిశుద్ధాత్మ విషయంలో, నిజమైన ప్రేమ వ్యక్తం చేయటంలో, సత్యంగా మాట్లాడటంలో, దేవుని శక్తి విషయంలో, కుడి ఎడమ చేతుల్లో ఉన్న నీతి ఆయుధాల విషయంలో, కీర్తి వచ్చినా, అవమానాలు కలిగినా, పొగడ్తలు వచ్చినా, నిందలు కలిగినా, సత్యవంతులన్నా, మోసగాళ్ళన్నా, మేము తెలిసినా మమ్మల్ని తెలియనివాళ్ళుగా చూసినప్పుడు, చనిపోవుచున్నను చనిపోనివారిగా ఉన్నప్పుడు, కొట్టబడినా చంపబడకుండా ఉన్నప్పుడు, 10 దుఃఖంతో ఉన్నా ఆనందంగా ఉన్నప్పుడు, దరిద్రులమైనా యితరులను ధనవంతులుగా చేస్తున్నప్పుడు, మా దగ్గర ఏమీ లేకున్నా అన్నీ ఉన్నాయన్నట్టుగా ఉన్నప్పుడు మేము దేవుని సేవకులంగా రుజువు చేసుకొంటున్నాం.

11 కొరింథులోని ప్రజలారా! మేము మీతో దాచకుండా మాట్లాడి మిమ్మల్ని హృదయ పూర్వకంగా అంగీకరించాము. 12 మేము మా ప్రేమ దాచకుండా మీకు చూపాము. కాని మీరు మీ ప్రేమ మాకివ్వకుండా దాస్తున్నారు. 13 నేను మిమ్మల్ని నా బిడ్డలుగా భావించి మాట్లాడుతున్నాను. మేము మిమ్మల్ని హృదయ పూర్వకంగా అంగీకరించినట్లే, మమ్మల్ని మీరు హృదయపూర్వకంగా అంగీకరించండి.

మార్కు 4:35-41

యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం

(మత్తయి 8:23-27; లూకా 8:22-25)

35 ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సముద్రం అవతలివైపుకు వెళ్దాం!” అని అన్నాడు. 36 శిష్యులు, అక్కడ ఉన్న ప్రజా సమూహాన్ని వదిలి పడవలో ఉన్న యేసును తమవెంట తీసుకు వెళ్ళారు. మరికొన్ని పడవలు కూడా వాళ్ళను అనుసరించాయి. 37 ఇంతలో తీవ్రమైన ఒక పెనుగాలి వీచింది. అలలు రేగి ఆ పడవలోకి నీళ్ళు వచ్చాయి. పడవ నిండి పోసాగింది. 38 పడవ వెనుక వైపు యేసు తలక్రింద ఒక దిండు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన్ని లేపి ఆయనతో, “బోధకుడా! మేము మునిగి పోయినా మీకు చింతలేదా?” అని అన్నారు.

39 ఆయన లేచి గాలిని, అలల్ని గద్దిస్తూ, “ఆగిపో, నెమ్మదించు!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి తీవ్రత తగ్గిపోయింది. అంతటా శాంతం ఏర్పడింది.

40 ఆయన తన శిష్యులతో, “మీరెందుకింత భయపడుతున్నారు? మీలో యింకా విశ్వాసం కలుగలేదా?” అని అన్నాడు.

41 వాళ్ళకు చాలా భయంవేసింది. తమలో తాము, “ఎవరీయన? గాలి, అలలు కూడా ఆయన మాటకు లోబడుతున్నాయే!” అని ఆశ్చర్యపడ్డారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International