Revised Common Lectionary (Semicontinuous)
9 అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి
గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు.
ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు.
యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.
10 నీ నామం తెలిసిన ప్రజలు
నీమీద విశ్వాసం ఉంచాలి.
యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే
సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.
11 సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి.
యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.
12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని
ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు.
ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు.
మరి యెహోవా వారిని మరచిపోలేదు.
13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము.
నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము.
‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.
14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను.
నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”
15 యూదులు కాని ఆ ప్రజలు, ఇతరులను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు.
కాని, యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే పడ్డారు.
ఆ మనుష్యులు ఇతరులను పట్టడానికి వలలు మాటున పెట్టారు.
కాని, వారి పాదాలే ఆ వలల్లో చిక్కుబడ్డాయి.
16 యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు.
యెహోవా చేసినదాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్[a]
17 దేవుని మరచే ప్రజలు దుష్టులు.
ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు.
18 పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది.
కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.
19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము.
వారే శక్తిగలవారు అని ప్రజలను తలంచనీయకుము.
20 ప్రజలకు పాఠం నేర్పించు.
వారు కేవలం మానవ మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము.
దావీదును గూర్చి సౌలుకు భయం ప్రారంభం
55 దావీదు ధైర్యంగా గొల్యాతును ఎదుర్కొన్న తీరును సౌలు గమనించాడు. తన సేనాని అబ్నేరును పిలిచి, “ఆ కుర్రవాని తండ్రి ఎవరని” అడిగాడు.
“మీ తోడు అతనెవరో నాకు తెలియదు రాజా” అన్నాడు అబ్నేరు.
56 సౌలు, “ఆ కుర్రవాని తండ్రి ఎవరో తెలుసుకో” అన్నాడు.
57 గొల్యాతును చంపి దావీదు తిరిగి రాగానే అబ్నేరు అతనిని సౌలువద్దకు తీసుకుని వచ్చాడు. దావీదు ఇంకా ఆ ఫిలిష్తీయుని తలను చేతిలో పట్టుకొని ఉన్నాడు.
58 “చిన్నవాడా! నీ తండ్రి ఎవరు?” అని సౌలు అతన్ని అడిగాడు.
“బేత్లెహేములో ఉన్న మీ సేవకుడు యెష్షయి కుమారుడను నేను” అని దావీదు జవాబు చెప్పాడు.
దావీదు-యోనాతానుల స్నేహం
18 దావీదు సౌలుతో మాట్లాడటం ముగించాక, యోనాతాను దావీదుకు చాలా సన్నిహితుడయ్యాడు. తనను తాను ప్రేమించుకున్నంతగా యోనాతాను దావీదును ప్రేమించాడు. 2 సౌలు ఆ రోజు నుంచీ దావీదును తన వద్దనే ఉంచుకొన్నాడు. దావీదును ఊరిలోవున్న తన తండ్రి వద్దకు సౌలు పోనీయలేదు. 3 యోనాతాను దావీదుతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఎందువల్లనంటే, దావీదు అంటే యోనాతానుకు ఎనలేని ప్రేమ. 4 యోనాతాను తన అంగీ తీసి దావీదుకు తొడిగాడు. యోనాతాను తన సైనిక దుస్తులు కూడా దావీదుకు ఇచ్చాడు. అంతేగాదు; యోనాతాను తన ఖడ్గం, విల్లంబులు, పటకా అన్నీ దావీదుకు ఇచ్చాడు.
దావీదు విజయాన్ని సౌలు గుర్తించుట
5 సౌలు దావీదును అనేక యుద్ధాలకు పంపాడు అన్నింటిలో అతడు విజయం సాధిస్తూ వచ్చాడు. కాబట్టి అతనిని సైన్యాధికారిగా సౌలు నియమించాడు. దీనికి ప్రజలంతా చాలా సంతోషించారు. సౌలు అధికారులు కూడ సంతోషించారు.
యెరూషలేముకు ప్రయాణం
21 మేము సెలవు పుచ్చుకొని నేరుగా “కోసు” కు ఓడలో ప్రయాణం చేసాము. మరుసటి రోజు “రొదు” చేరుకున్నాము. అక్కడినుండి బయలుదేరి “పతర” చేరుకున్నాము. 2 ఒక ఓడ ఫొనీషియ వెళ్ళటం గమనించి అందులో ప్రయాణం చేసాము.
3 సైప్రసు ద్వీపం కనపడ్డాక ఆ ద్వీపానికి దక్షిణంగా వెళ్ళి సిరియ దేశం చేరుకున్నాం. మా ఓడ సరుకు దింపవలసి ఉంది కనుక తూరు ద్వీపంలో ఆగాము. 4 అక్కడ భక్తులుండటం గమనించి వాళ్ళతో ఏడు రోజులున్నాము. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యెరూషలేము వెళ్ళవద్దని పౌలుతో చెప్పారు. కాని వెళ్ళవలసిన సమయం రాగానే ప్రయాణమై మా దారిన మేము వెళ్ళాము. 5 విశ్వాసులు, తమ భార్యాబిడ్డలతో కలిసి మా వెంట ఊరి అవతలి వరకు వచ్చారు. సముద్ర తీరం చేరుకున్నాక, అందరమూ మోకరిల్లి ప్రార్థించాము. 6 పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నాక మేము ఓడనెక్కాము. వాళ్ళు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్ళిపోయారు.
7 మేము తూరునుండి మా ప్రయాణం సాగించి తొలేమాయి తీరం చేరుకున్నాము. అక్కడున్న సోదరుల్ని కలుసుకొని వాళ్ళతో ఒక రోజు గడిపాము. 8 మరుసటి రోజు ప్రయాణమై కైసరియ చేరుకున్నాము. అక్కడ సువార్త ప్రచారం చేస్తున్న ఫిలిప్పు అనే వ్యక్తి యింట్లో బసచేసాము. అతడు యెరూషలేములో ఎన్నుకోబడ్డ ఏడుగురిలో ఒకడు. 9 అతనికి నలుగురు పెళ్ళికాని కూతుర్లు ఉన్నారు. వాళ్ళు దైవేచ్ఛను చెప్పటంలో ప్రతిభావంతులు.
10 అక్కడ మేము చాలా రోజులున్నాక, అగబు అనే ప్రవక్త యూదయనుండి వచ్చాడు. 11 అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు నడికట్టు తీసుకొని దాంతో తన కాళ్ళు చేతులు కట్టివేసుకొని ఈ విధంగా అన్నాడు: “‘ఈ నడికట్టు ఎవరిదో, అతణ్ణి యెరూషలేములో యూదులు ఈ విధంగా కట్టేసి యూదులు కానివాళ్ళకు అప్పగిస్తారు’ అని పరిశుద్ధాత్మ చెపుతున్నాడు.”
12 ఇది విని అక్కడి ప్రజలు, మేము కలిసి పౌలును యెరూషలేము వెళ్ళవద్దని బ్రతిమలాడాము. 13 పౌలు, “మీరు దుఃఖించి నా గుండెలెందుకు పగులగొడ్తున్నారు? యేసు ప్రభువు పేరిట బంధింపబడటానికే కాదు, మరణించటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను!” అని సమాధానం చెప్పాడు.
14 మేము అతని మనస్సు మార్చలేమని తెలుసుకొన్నాక, “ప్రభువు ఇచ్ఛ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది,” అనుకొని మేమేమీ మాట్లాడలేదు.
15 ఆ తర్వాత అంతా సిద్ధమై యెరూషలేము వెళ్ళాము. 16 కైసరియనుండి కొందరు శిష్యులు మా వెంట వచ్చి మమ్మల్ని “మ్నాసోను” అనే అతని యింటికి పిలుచుకు వెళ్ళారు. అక్కడ మా బస. మ్నాసోను సైప్రసు ద్వీపానికి చెందినవాడు. మొదట్లో విశ్వాసులైన వాళ్ళలో ఇతడు ఒకడు.
© 1997 Bible League International