Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
20 నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక.
యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక.[a]
2 దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక.
సీయోను[b] నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక!
3 నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక.
నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక.
4 నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక.
నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.
5 దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదుముగాక.
దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక.
నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.
6 ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయం చేస్తాడని నాకు తెలుసు.
దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు.
ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయోగించాడు.
7 కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు వారి గుర్రాలను నమ్ముకొంటారు.
కాని మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము.
8 ఆ మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు.
కాని మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!
9 దేవుడు రాజును రక్షించును గాక!
మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము.
సౌలు చేసిన మొదటి తప్పు
13 అప్పటికి సౌలు పరిపాలించటం మొదలు పెట్టి ఒక సంవత్సరం అయింది. అతడు రెండు సంవత్సరాలు పాలించేసరికి 2 ఇశ్రాయేలునుండి మూడు వేల మందిని సైన్యానికి ఎంపిక చేశాడు. కొండల ప్రాంతమైన బేతేలు పట్టణం దగ్గర మిక్మషులో అతనితోకూడ రెండు వేలమంది ఉన్నారు. బెన్యామీనులోని గిబియాలో యోనాతానుతో ఒక వెయ్యిమంది ఉన్నారు. సైన్యంలో మిగిలిన వారిని సౌలు ఇంటికి పంపేశాడు.
3 యోనాతాను ఫిలిష్తీయులను గెబాలో ఉన్న వారి శిబిరం వద్దనే ఓడించాడు. ఇది విన్న ఫిలిష్తీయులు “హెబ్రీ జనం తిరుగుబాటు చేశారని” అరిచారు.
“హెబ్రీ ప్రజలు జరిగినదంతా వినాలని” సౌలు అన్నాడు. ఇదంతా ఇశ్రాయేలు దేశమంతా చాటింపు వేసి చెప్పమని మనుష్యులను పురమాయించాడు సౌలు. 4 ఇశ్రాయేలీయులంతా ఈ వార్త విని, “సౌలు ఫిలిష్తీయులను ఓడించాడు గనుక వాళ్లు మనల్ని ఇప్పుడు మరింత అసహ్యించుకుంటారని” అన్నారు.
సౌలును గిల్గాలు వద్ద కలుసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు పిలుపు వచ్చింది. 5 ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై దెబ్బ తీయటానికి సమాయత్తమయ్యారు. వారికి మూడు వేల రథాలు ఉన్నాయి. ఆరువేల మంది అశ్వదళ సైనికులు ఉన్నారు. సముద్ర తీరాన ఇసుక ఉన్నట్లుగా ఫిలిష్తీయుల సైన్యంకూడ లెక్కకు మించి ఉంది. వారంతా పోయి మిక్మషు వద్ద గుడారాలు వేసుకున్నారు. బేతావెనుకు తూర్పుగా మిక్మషు ఉంది.
6 ఇశ్రాయేలు ప్రజలు తాము చాలా విషమ స్థితిలో వున్నట్లు గమనించారు. వారు చిక్కులో పడ్డామని గుర్తించి వారంతా పారిపోయి కొండగుహల్లోను, బండ సందుల్లోను, పొదల్లోను దాక్కున్నారు. మరికొందరు రాతిబండల వెనుక, గోతులలోను, నూతులలోను దాక్కున్నారు. 7 కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు, గిలాదు ప్రాంతాలకు వెళ్లారు. కాని సౌలు గిల్గాలులోనే ఉన్నాడు. తన సైన్యంలోని వారంతా భయంతో వణకిపోయారు.
8 సమూయేలు గిల్గాలులో సౌలును కలుస్తానని చెప్పాడు. అందువల్ల సౌలు గిల్గాలులో ఏడు రోజులు ఉన్నాడు. కాని సమూయేలు రాలేదు. సైనికులు ఒక్కొక్కరే సౌలును వదిలి పోవటం మొదలు పెట్టారు. 9 “దహన బలులను, సమాధాన బలులను తన దగ్గరకు తీసుకుని రమ్మని” చెప్పాడు. అవి వచ్చిన పిమ్మట సౌలు దహన బలులు అర్పించాడు. 10 సౌలు దహనబలి అర్పించి ముగించే సరికి సమూయేలు వచ్చాడు. సౌలు ఆయనను కలుసుకొనేందుకు వెళ్లాడు.
11 సమూయేలు, “నీవు చేసిన పని ఏమిటి?” అని సౌలును అడిగాడు.
అందుకు సౌలు, “మిక్మషు వద్ద ఫిలిష్తీయులు కూడుకొంటున్నారు. సైనికులేమో నన్ను విడిచిపెట్టేసి, ఒక్కొక్కరే వెళ్లిపోవటం నేను గమనించాను. నీవేమో సమయానికి ఇక్కడికి రాలేదు. 12 గిల్గాలు వద్ద ఫిలిష్తీయులు నా మీదకు వస్తారని నేననుకున్నాను. అప్పటికి నేను ఇంకా దేవుని సహాయం అర్థించియుండలేదు. అందువల్ల నేను బలవంతంగా దహనబలి అర్పించాను” అని చెప్పాడు.
13 అది విన్న సమూయేలు, “నీవు చాలా అవివేకంగా ప్రవర్తించావు! నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ నీవు పాటించలేదు. నీవు ఆయన ఆజ్ఞను పాటించివుంటే, ఆయన ఇశ్రాయేలు మీద నీ కుటుంబ పాలన ఎప్పటికీ కొనసాగేలా చేసేవాడు. 14 ఇప్పుడు నీ పాలన అంతం అవుతుంది. యెహోవాకు విధేయుడు కావాలని కోరేవాని కోసం యెహోవా చూశాడు. యెహోవా అతనిని కనుగొన్నాడు. యెహోవా అతనిని తన ప్రజలకు కొత్త నాయకునిగా ఎంపిక చేసాడు. నీవు యెహోవా ఆజ్ఞకు విధేయుడవు కాలేదు. కనుక యెహోవా కొత్త నాయకుని ఎంపిక చేసాడు!” అని చెప్పాడు.
15 అప్పుడు సమూయేలు బయల్దేరి గిల్గాలు విడిచి వెళ్లిపోయాడు.
మిక్మషువద్ద యుద్ధం
సౌలు, అతనితో మిగిలిన సైన్యం గిల్గాలు విడిచి బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు వెళ్లారు. తన వద్ద మిగిలిన సైన్యాన్ని సమీకరించుకొని చూస్తే సౌలు వద్ద ఆరువందల మంది మాత్రమే మిగిలారు.
రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం
(మత్తయి 13:1-9; లూకా 8:4-8)
4 ఒక రోజు యేసు సముద్రం దగ్గర బోధించటం మొదలు పెట్టాడు. ఆయన చుట్టూ చాలమంది ప్రజలు చేరటం వల్ల ఆయన పడవనెక్కి కూర్చొని నీళ్ళలోకి వెళ్ళాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు. 2 ఆయన ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళకు చాలా విషయాలు బోధించాడు. ఆ విధంగా బోధిస్తూ,
3 “వినండి! ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. 4 అతడు విత్తనములు చల్లుతుండగా కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. వాటిని పక్షులు తినివేసాయి. 5 మరికొన్ని మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందువల్ల అవి త్వరగా మొలకెత్తాయి. 6 కాని సూర్యుడు రాగానే అవి ఆ వేడికి వాడిపోయాయి. వాటికి వేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. 7 మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల మధ్య పడ్డాయి. ఆ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కలను అణచి వేయటంవల్ల వాటికి ధాన్యం పండలేదు. 8 మరికొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి పెరిగి, ముప్పై వంతుల, అరవైవంతుల, నూరువంతుల పంటను కూడా యిచ్చాయి.”
9 ఈ విధంగా చెప్పి యేసు, “చెవులున్న వాడు విననీ!” అని అన్నాడు.
యేసు బోధించుటకు ఉపమానములను ఎందుకు ఉపయోగించాడు
(మత్తయి 13:10-17; లూకా 8:9-10)
10 ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన పన్నెండుగురు శిష్యులు ఆయన చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు.
11 ఆయన వాళ్ళతో, “దేవుని రాజ్యంయొక్క రహస్య జ్ఞానాన్ని మీకు చెప్పాను. కాని యితరులకు ఈ జ్ఞానం ఉపమానాల ద్వారా చెబుతాను. 12 ఎందుకంటే,
‘వాళ్ళు ఎప్పుడూ చూస్తారు కాని ఏదీ గ్రహించరు.
అన్నీ వింటారు కాని ఒక్కటీ అర్థం చేసుకోరు.
వాళ్ళు అలా చేస్తే దేవుని వైపు మళ్ళవచ్చు దేవుడు వాళ్ళను క్షమిస్తాడు.’”(A)
యేసు విత్తనము యొక్క ఉపమానమును వివరించటం
(మత్తయి 13:18-23; లూకా 8:11-15)
13 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “మీకీ ఉపమానం అర్థం కాలేదా? మరి మిగతా ఉపమానాల్ని ఎలా అర్థం చేసుకొంటారు? 14 రైతు, దైవ సందేశాన్ని విత్తుతున్నవాడు. 15 కొందరు వ్యక్తులు దారి మీది మట్టిలాంటి వాళ్ళు. వీళ్ళలో విత్తనం నాటిన వెంటనే, అంటేవాళ్ళు విన్న వెంటనే, సైతాను వచ్చి వాళ్ళలో నాటబడిన దైవసందేశాన్ని తీసుకువెళ్తాడు.
16 “మరి కొందరు రాతినేలలాంటి వాళ్ళు. వీళ్ళు సందేశాన్ని విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు. 17 కాని వాళ్ళు సందేశాన్ని లోతైన జీవితంలోనికి నాటనివ్వరు. కొంత కాలం మాత్రమే నిలుస్తుంది. ఆ సందేశం కారణంగా కష్టంకాని, హింసకాని కలిగితే వాళ్ళు వెంటనే దాన్ని వదిలేస్తారు.
18 “మరి కొందరు ముళ్ళమొక్కలు మొలిచే నేలలాంటి వాళ్ళు. వాళ్ళు దైవసందేశం వింటారు కాని 19 ఈ జీవితం వల్ల కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, యితర వస్తువుల పట్ల వ్యామోహం, ఆ దైవ సందేశాన్ని అణిచివేసి ఫలించకుండా చేస్తాయి.
20 “ఇతరులు సారవంతమైన భూమిలాంటివాళ్ళు. కనుక వీళ్ళు దైవసందేశాన్ని విని అంగీకరించి ఫలంపొందే వాళ్ళు. కనుక వీళ్ళు ముప్పై, అరవై, నూరువంతుల ఫలం ఫలిస్తారు.”
© 1997 Bible League International