Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 108

దావీదు స్తుతి కీర్తన

108 దేవా, నా హృదయం, నా ఆత్మ నిశ్చలముగాఉన్నాయి.
    నేను పాడుటకు, స్తుతి కీర్తనలు
వాయించుటకు సిద్ధంగా ఉన్నాను.
    స్వర మండలములారా, సితారలారా,
    మనం సూర్యున్ని[a] మేల్కొలుపుదాం
యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము.
    ఇతర ప్రజల మధ్య మేము నిన్ను స్తుతిస్తాము.
యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది.
    నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది.
దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము!
    సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము.
దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము.
    నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము.

యెహోవా తన ఆలయము నుండి[b] మాట్లాడి యిలా చెప్పాడు,
    “యుద్ధంలో నేను గెలుస్తాను! ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను.
    (ఈ భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను)
    నా ప్రజలకు షెకెమును ఇస్తాను.
    వారికి సుక్కోతులోయను ఇస్తాను.
    గిలాదు, మనష్షే నావి.
    ఎఫ్రాయిము నా శిరస్త్రాణం.
    యూదా నా రాజదండం.
    మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం.
    ఎదోము నా చెప్పులు మోసే బానిస.
    ఫిలిష్తీయులను జయించాక నేను విజయంతో కేకలు వేస్తాను.”

10 శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు?
    ఎదోమును జయించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు?
11 దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో
    నీవు వెళ్లవు అని అనటం నిజమేనా?
12 దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము
    మనుష్యులు మాకు సహాయం చేయలేరు!
13 దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు.
    దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు.

1 సమూయేలు 8

రాజుకొరకు ఇశ్రాయేలు ప్రజల అభ్యర్థన

సమూయేలు వృద్ధుడయిన పిమ్మట తన కుమారులను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులుగా నియమించాడు. సమూయేలు మొదటి కుమారుని పేరు యోవేలు. రెండవవాని పేరు అబీయా. వారిద్దరూ బెయేర్షెబాలో న్యాయాధిపతులు. కాని సమూయేలు కుమారులకు తండ్రి నడవడి రాలేదు. యోవేలు, అబీయా, ఇద్దరూలంచం ద్వారా ధన సంపాదనకు పాల్పడినారు. తమ తీర్పులను తారుమారు చేయటానికి ప్రజలను మోసంచేసి రహస్యంగా లంచాలు తీసుకునేవారు. కావున ఇశ్రాయేలు పెద్దలంతా (నాయకులు) సమూయేలును కలుసుకొనుటకు రామా వెళ్లారు. వారు సమూయేలుతో, “నీవు వృద్ధుడవు. పైగా నీ కుమారులు నీ మాదిరిని వెంబడించుట లేదు. కాబట్టి అన్ని రాజ్యాల మాదిరిగా మమ్ములను పాలించటానికి కూడ ఒక రాజును ఇయ్యి” అని అన్నారు.

ఇది తప్పు అని సమూయేలు తలచాడు. కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థించాడు. యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “ప్రజలు ఏమి చెపితే దానిని నీవు పాటించు. వారి రాజుగా ఉండేందుకు వారు నన్ను తిరస్కరించారు గాని నిన్ను కాదు. వారు ఎప్పటిలాగే ప్రవర్తిస్తున్నారు. నేను వారిని ఈజిప్టునుంచి రక్షించినప్పుడు, వారు నన్ను వదిలి ఇతర దేవుళ్లను పూజించారు. నీ పట్ల కూడా వారిప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు. అయినా నీవు ప్రజలు చెప్పిన దానిని పాటించు. కాని వారికి ఒక హెచ్చరిక చెయ్యి. రాజు వారికి ఏమి చేస్తాడో ఒకసారి వివరించి చెప్పాలి.”

10 రాజుకొరకు అడుగుతున్న ప్రజలకు సమూయేలు సమాధాన మిచ్చాడు. యెహోవా సెలవిచ్చిన విషయమంతా సమూయేలు ప్రజలకు ఇలా వివరంగా చెప్పాడు: 11 “మిమ్మల్ని పాలించేందుకు మీకు గనుక ఒక రాజు ఉంటే అతడు ఇలా చేస్తాడు: అతడు మీ కుమారులను తనకు సేవ చేసేటట్లు బలవంతంచేస్తాడు. అతడు వారిని బలవంతంగా సైనికులుగా చేస్తాడు. వారిని తన రథాలలో, అశ్వదళాలలో పని చేయిస్తాడు. మీ కుమారులు రాజు రథానికి ముందు పరుగెత్తే సంరక్షకులు అవుతారు.

12 “రాజు మీ కుమారులలో కొంతమందిని వేయిమంది మీద అధికారులుగాను, ఏబదిమంది మీద అధికారులుగాను చేస్తాడు. మీ సంతతిలో మరికొంత మందిని రాజు తన భూమిని సాగు చేయుటకు, మరికొంత మందిని పంట కోయుటకు నియమిస్తాడు.

“ఇంకా కొంతమందిని యుద్ధ పరికరాలను, ఆయుధాలను తయారు చేసేందుకు, ఆయన రథాలకు కావలసిన వస్తుసామగ్రిని సమకూర్చటానికి రాజు వినియోగిస్తాడు.”

13 “ఈ రాజు మీ కుమార్తెలను కూడా తీసుకుని, వారిలో కొంతమందిని అత్తరులు చేసేందుకు, మరికొంత మందిని ఆయన ఆహార పదార్థాలు తయారు చేయటానికి వినియోగిస్తాడు.

14 “ఈ రాజు మీ భూములలో శ్రేష్ఠమైన వాటిని, ద్రాక్షాతోటలను, ఒలీవ తోటలను తీసుకుంటాడు. వాటిని తన అధికారులకు, సేవకులకు ఇస్తాడు. 15 మీ పంటలోను, ద్రాక్ష దిగుబడిలోను పదవవంతు అతను తీసు కుంటాడు. ఈ పదవ భాగాన్ని రాజు తన అధికారులకు, సేవకులకు ఇస్తాడు.

16 “ఈ రాజు మీ సేవకులను, పనిపిల్లలను కూడ తీసుకుంటాడు. మీకున్న మంచి మంచి పాడి పశువులను, గాడిదలను కూడా తీసుకుంటాడు. వారందరినీ తన స్వంత పనులకు వినియోగించుకుంటాడు. 17 అతను మీ గొర్రెల మందలలో పదవవంతు తీసుకుంటాడు.

“అసలు మీరు కూడా ఈ రాజుకు బానిసలైపోతారు. 18 ఆ సమయం వచ్చినప్పుడు మీరెన్నుకున్న రాజు మూలంగా మీరు చాలా ఏడుస్తారు. కానీ యెహోవా మాత్రం ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు.”

19 సమూయేలు ఇంత చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా ఇలా అన్నారు: “కాదు! మమ్ములను ఏలటానికి మాకో రాజు కావాలి. 20 అప్పుడు మేము ఇతర రాజ్యాలతో సమాన ప్రతిపత్తిగల వారమవుతాము. మా రాజే మా నాయకుడు. యుద్ధంలో ఆయన మమ్మల్ని నడిపించి, మాకోసం ఆయన యుద్ధం చేస్తాడు.”

21 ప్రజలు చెప్పినదంతా విన్న సమూయేలు వారు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేసాడు. 22 “వారి మాట శిరసావహించమనీ, వారికో రాజును ఇవ్వమనీ” యెహోవా చెప్పాడు.

అప్పుడు సమూయేలు అక్కడ సమావేశమైన ప్రజలకు “తమ పట్టణానికి వెళ్లిపొమ్మని చెప్పాడు.”

ప్రకటన 20:7-15

సాతాను అపజయం పొందటం

వెయ్యి ఏండ్లు గడిచాక సాతాను కారాగారం నుండి విడుదల చేయబడతాడు. వాడు బయటకు వచ్చి దేశాలను మోసం చేస్తాడు. వాడు ప్రపంచం నలుమూలలకు, అంటే గోగు, మాగోగులకు వెళ్ళి యుద్ధం చేయటానికి ప్రజల్ని సమకూరుస్తాడు. సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువుల సంఖ్యతో సమానంగా వాళ్ళ సంఖ్య ఉంటుంది.

వాళ్ళు భూమి నలుమూలలకు వెళ్ళి భక్తుల శిబిరాలను ఆక్రమించారు. దేవుడు ప్రేమించే పట్టణాన్ని చుట్టుముట్టారు. కాని పరలోకంలో నుండి అగ్ని కురిసి వాళ్ళను నాశనం చేసింది. 10 ఇక వాళ్ళను మోసం చేసిన సాతాను మండుతున్న గంధకపు గుండంలో పారవేయబడ్డాడు. దానిలో క్రూర మృగం, దొంగ ప్రవక్త యింతకు ముందే పడవేయబడ్డారు. గుండంలోనే వాళ్ళు రాత్రింబగళ్ళు నిరంతరం హింసింపబడతారు.

చనిపోయినవాళ్ళపై తీర్పు

11 తర్వాత నాకు ఒక పెద్ద సింహాసనము కనిపించింది. అది తెల్లగా ఉంది. దానిపై కూర్చొన్నవాణ్ణి చూసాను. భూమి, ఆకాశం ఆయన నుండి పారిపొయ్యాయి. వాటికి స్థలం దొరకలేదు. అవి అదృశ్యమయ్యాయి. 12 నేను చనిపోయినవాళ్ళను చూసాను. అందులో గొప్పవాళ్ళు, కొద్దివాళ్ళు ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు నిలబడి ఉన్నారు. అప్పుడు గ్రంథాలు తెరువబడ్డాయి. మరొక గ్రంథంకూడా తెరువబడింది. అది జీవగ్రంథం. చనిపోయినవాళ్ళపై తీర్పు చెప్పబడింది. వాళ్ళు చేసినవి ఆ గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. వాటి ప్రకారం వాళ్ళ మీద తీర్పు చెప్పబడింది.

13 సముద్రం తనలో చనిపోయినవాళ్ళను విడుదల చేసింది. మృత్యువు తన మృత్యులోకంలో ఉన్నవాళ్ళను విడుదల చేసింది. వాళ్ళు చేసిన వాటిని బట్టి తీర్పు చెప్పబడింది. 14 ఆ తర్వాత మృత్యువు, మృత్యులోకము మంటలు ఉన్న గుండంలో పారవేయబడ్డాయి. మంటల గుండం రెండవ మరణం. 15 జీవగ్రంథంలో పేరులేనివాడు మంటల గుండంలో పారవేయబడ్డాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International