Revised Common Lectionary (Semicontinuous)
దావీదు స్తుతి కీర్తన
108 దేవా, నా హృదయం, నా ఆత్మ నిశ్చలముగాఉన్నాయి.
నేను పాడుటకు, స్తుతి కీర్తనలు
వాయించుటకు సిద్ధంగా ఉన్నాను.
2 స్వర మండలములారా, సితారలారా,
మనం సూర్యున్ని[a] మేల్కొలుపుదాం
3 యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము.
ఇతర ప్రజల మధ్య మేము నిన్ను స్తుతిస్తాము.
4 యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది.
నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది.
5 దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము!
సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము.
6 దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము.
నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము.
7 యెహోవా తన ఆలయము నుండి[b] మాట్లాడి యిలా చెప్పాడు,
“యుద్ధంలో నేను గెలుస్తాను! ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను.
(ఈ భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను)
నా ప్రజలకు షెకెమును ఇస్తాను.
వారికి సుక్కోతులోయను ఇస్తాను.
8 గిలాదు, మనష్షే నావి.
ఎఫ్రాయిము నా శిరస్త్రాణం.
యూదా నా రాజదండం.
9 మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం.
ఎదోము నా చెప్పులు మోసే బానిస.
ఫిలిష్తీయులను జయించాక నేను విజయంతో కేకలు వేస్తాను.”
10 శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు?
ఎదోమును జయించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు?
11 దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో
నీవు వెళ్లవు అని అనటం నిజమేనా?
12 దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము
మనుష్యులు మాకు సహాయం చేయలేరు!
13 దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు.
దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు.
3 ఇశ్రాయేలీయులనుద్దేశించి సమూయేలు ఇలా అన్నాడు: “మీ హృదయ పూర్వకంగా మీరంతా యెహోవా దగ్గరకు తిరిగి వస్తున్నట్లయితే, మీరు మీ అన్య దేవుళ్లను విడిచిపెట్టాలి. మీ అష్తారోతు[a] దేవతా విగ్రహాలను విడిచి పెట్టాలి. మిమ్ములను మీరు యెహోవాకు పూర్తిగా సమర్పించుకోండి. ఆయననే ఆరాధించండి. అప్పుడాయన మిమ్మల్ని ఫిలిష్తీయుల బారినుండి తప్పిస్తాడు.”
4 అది విన్న ఇశ్రాయేలీయులు బయలు[b] అష్తారోతు విగ్రహాలన్నిటినీ పారవేసారు. అప్పుడు ఇశ్రాయేలీయులంతా యెహోవాను మాత్రమే సేవించారు.
5 “ఇశ్రాయేలు వారంతా మిస్పావద్ద తప్పక సమావేశం కావాలి. అక్కడ వారి కోసం నేను యెహోవాను ప్రార్థిస్తాను” అని సమూయేలు వారితో చెప్పాడు.
6 ఇశ్రాయేలీయులు మిస్పావద్ద సమావేశం అయ్యారు. వారు నీళ్లు తెచ్చి యెహోవా ముందర పారపోసారు. (ఈ విధంగా వారు ఉపవాసం ప్రారంభించారు.) ఆ రోజు వారు ఏమీ తినకుండా ఉండి, వారి పాపాలు ఒప్పుకోవటం మొదలు పెట్టారు. “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము” అని వారు చెప్పారు. కనుక సమూయేలు ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతిగా సేవ చేయటం మిస్పాలో ప్రారంభించాడు.
7 ఇశ్రాయేలు ప్రజలు మిస్పావద్ద సమావేశమవుతున్నట్లు ఫిలిష్తీయులు విన్నారు. ఫిలిష్తీయుల పాలకులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి తరలి వచ్చారు. వారు వస్తున్నారని ఇశ్రాయేలీయులు విని, భయపడ్డారు. 8 వారు సమూయేలుతో “మా కొరకు ప్రభువైన దేవుని ప్రార్థించుట ఆపవద్దు. ఫిలిష్తీయుల బారినుండి మమ్మును రక్షించమని యెహోవాను వేడుము!” అని విన్నవించారు.
9 అప్పుడు సమూయేలు పాలుతాగుతున్న గొర్రెపిల్లను తీసుకుని దానిని పూర్తిగా యెహోవాకు దహన బలిగా దహించాడు. సమూయేలు ఇశ్రాయేలీయుల కోసం యెహోవాను ప్రార్థించాడు. యెహోవా అతనికి జవాబిచ్చాడు. 10 సమూయేలు బలి పశువును దహించుచున్నప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి సమీపిస్తూ ఉన్నారు. కానీ యెహోవా అకస్మాత్తుగా ఒక భయంకర ఉరుమును ఫిలిష్తీయుల వద్ద కలిగించాడు. ఆ ఉరుము ఫిలిష్తీయులను భయపెట్టగా వారు కలవరపడి చిందర వందర అయ్యారు. అప్పుడు సంభవించిన యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఓడించారు. 11 ఇశ్రాయేలు జనం మిస్పా నుండి బయటకు వచ్చి ఫిలిష్తీయులను అందిన వారిని అందినట్లు చంపుతూ బేత్కారు వరకూ తరుముకుంటూ పోయారు.
ఇశ్రాయేలులో ప్రశాంతత
12 ఇదంతా జరిగిన తర్వాత సమూయేలు జ్ఞాపకార్థంగా మిస్పాకు, షేనుకు మధ్య ఒక ప్రత్యేక రాతిని నిలబెట్టాడు. దానికి సమూయేలు “సహాయ శిల”[c] అని పేరు పెట్టి, “ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసాడు” అని చెప్పాడు.
13 ఫిలిష్తీయులు ఓడించబడ్డారు. మరల వారు ఇశ్రాయేలు దేశంలోనికి అడుగు పెట్టలేదు. సమూయేలు బ్రతికినంత కాలం యెహోవా ఫిలిష్తీయులకు వ్యతిరేకంగానే వున్నాడు. 14 ఫిలిష్తీయులు ఇశ్రాయేలునుండి పట్టణాలను తీసుకున్నారు. ఎక్రోను నుండి గాతు వరకుగల ప్రాంతాల్లోని పట్టణాలను ఫిలిష్తీయులు తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ఆ పట్టణాలను తిరిగి గెలుచుకున్నారు. మరియు ఈ పట్టణాల చుట్టు ప్రక్కల ఉన్న స్థలాన్ని కూడా ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి నెలకొన్నది.
15 సమూయేలు తన జీవిత కాలమంతా న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులను నడిపించాడు.
వెయ్యి సంవత్సరాలు
20 పరలోకంలో నుండి ఒక దూత దిగి రావటం చూసాను. అతని దగ్గర పాతాళలోకపు తాళం చెవి ఉంది. అతని చేతిలో ఒక పెద్ద గొలుసు ఉంది. 2 అతడు ఘటసర్పాన్ని పట్టుకొని వెయ్యి ఏండ్లదాకా బంధించి వేసాడు. దీన్ని ఆది సర్పమని, దయ్యమని, సాతానని అంటారు. 3 అతడు దాన్ని పాతాళలోకంలో పడవేసి, తాళం వేసి, దాని మీద ముద్ర వేసాడు. వెయ్యి ఏండ్లు ముగిసేదాకా, అది దేశాలను మళ్ళీ మోసం చెయ్యకుండా ఉండాలని ఈ విధంగా చేసాడు. ఆ తర్వాత కొద్ది సమయం దానికి విడుదల ఇవ్వబడుతుంది.
4 నేను సింహాసనాలు చూసాను. తీర్పు చెప్పటానికి అధికారం పొందినవారు ఆ సింహాసనాలపై కూర్చొని ఉన్నారు. యేసు చెప్పిన సందేశాన్ని నమ్మకంగా బోధించినందుకు దేవుని సందేశాన్ని ప్రకటించినందుకు తలలు కొట్టివేయబడినవాళ్ళ ఆత్మల్ని చూసాను. వీళ్ళు మృగాన్నిగాని, దాని విగ్రహాన్ని గాని ఆరాధించ లేదు. వాళ్ళు దాని ముద్రను వాళ్ళ నొసళ్ళ మీదగాని, చేతుల మీదగాని వేయించుకోలేదు. వాళ్ళు మళ్ళీ బ్రతికి క్రీస్తుతో పాటు వెయ్యి ఏండ్లు పాలించారు. 5 మిగతా చనిపోయినవాళ్ళు వెయ్యి ఏండ్లు పూర్తి అయ్యేదాకా బ్రతికి రాలేదు.
ఈ విధంగా చనిపోయి బ్రతికి రావటం యిది మొదటిసారి. 6 మొదటిసారి బ్రతికి వచ్చినవాళ్ళ గుంపుకు చెందినవాళ్ళు ధన్యులు, పరిశుద్ధమైనవాళ్ళు. ఇక రెండవ మరణానికి[a] వాళ్ళపై అధికారము ఉండదు. వాళ్ళు దేవునికి, క్రీస్తుకు యాజకులుగా ఉండి క్రీస్తుతో సహా వెయ్యి ఏండ్లు రాజ్యం చేస్తారు.
© 1997 Bible League International