Revised Common Lectionary (Semicontinuous)
99 యెహోవాయే రాజు.
కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
2 సీయోనులో యెహోవా గొప్పవాడు.
ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
దేవా, నీతిని నీవు చేశావు.
యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
6 మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.
కుమారుల విషయంలో ఏలీ అసమర్థత
22 ఏలీ చాలా వృద్ధుడై పోయాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులందరి యెడల తన కుమారులు చేస్తున్న పనులను గూర్చి అతడు నిరంతరం వింటూనే వున్నాడు. పైగా సన్నిధి గుడారపు ద్వారం వద్ద పరిచర్యలు చేసే స్త్రీలతో తన కుమారులు శయనిస్తున్నారని కూడా ఏలీ విన్నాడు.
23 ఏలీ తన కుమారులతో, “మీరు చేసిన చెడ్డ కార్యాలను గూర్చి ఇక్కడ ప్రజలు నాతో చెప్పారు. మీరెందుకు ఈ చెడ్డపనులు చేస్తున్నారు? 24 నా కుమారులారా, ఈ చెడ్డపనులు చేయకండి. యెహోవా ప్రజలు మీ గురించి చెడుగా చెప్పుకుంటున్నారు. 25 ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, దేవుడు ఒక వేళ అతనికి సహాయం చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి యెహోవా పట్ల అపచారం చేస్తే ఇక వానికి దిక్కెవరు?” అని అడిగాడు.
అయినా ఏలీ కుమారులు తండ్రి సలహాను లెక్కచేయలేదు; కాబట్టి యెహోవా ఏలీ కుమారులను చంపటానికి నిర్ణయించాడు.
26 బాలుడైన సమూయేలు మాత్రం దేవుని దయయందును, మనుష్యుల దయయందును పెరుగుతూ వచ్చాడు.
ఏలీ కుటుంబ విషయంలో భయంకర ప్రవచనం
27 దేవుని మనిషి[a]– ఒకడు ఏలీ వద్దకు వచ్చాడు. ఆ దేవుని మనిషి ఇలా చెప్పాడు “ఈజిప్టు దేశంలో నీ పూర్వీకులు ఫరో ఇంటిలో బానిసలుగా ఉన్నప్పుడు వారికి నేను ప్రత్యక్షమయ్యాను. 28 ఇశ్రాయేలులో వున్న నీ పూర్వీకుని కుటుంబాన్ని నేను ఎన్నుకున్నాను. వారిని యాజకులుగా నియమించాను. నా బలిపీఠం వద్దకు వెళ్లి ధూపం వేయటానికి వారు ప్రత్యేక ఏఫోదు ధరించేలా కోరుకున్నాను. నీ తండ్రి కుటుంబీకులు ఇశ్రాయేలు ప్రజలు అర్పించిన బలి మాంసాన్ని తీసుకునేలాగున చేశాను. 29 అయితే నీవు బలులను, కానుకలను ఎందువలన గౌరవించుట లేదు? నీవు నాకంటే నీ కుమారులనే ఎక్కువ గౌరవిస్తున్నావు. నా కొరకు ఇశ్రాయేలు ప్రజలు తెచ్చిన మాంసాన్ని అర్పణలలో మంచి వాటిని సంగ్రహించి క్రొవ్వెక్కి వున్నావు.”
30 ఆ దేవుని మనిషి ఇంకా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీ కుటుంబీకులు, నీ తండ్రి కుటుంబీకులు ఆయనను శాశ్వతంగా సేవించే విధంగా అనుగ్రహించాడు. కాని యెహోవా ఇప్పుడిలా సెలవిస్తున్నాడు: ‘అది ఇంక ఎన్నటికీ జరుగదు! నన్ను సేవించే వారినే నేను గౌరవిస్తాను. నన్ను సేవించుటకు నిరాకరించే వారికి అనేక కష్ట నష్టాలు సంభవిస్తాయి. 31 మీ సంతానమంతటినీ నేను నాశనం చేసే సమయమాసన్నమవుతూ ఉంది. అప్పుడు నీ కుటుంబంలో పెరిగి పెద్దవారై ముసలితనాన్ని చూచువాడు ఒక్కడూ ఉండడు. 32 ఇశ్రాయేలు ప్రజలకు మంచి జరుగుతూ ఉండగా, నీ ఇంటి వద్ద మాత్రం కీడు జరుగుతూ ఉంటుంది. నీ కుటుంబంలో మాత్రం ముసలి వాడొకడును ఉండడు. 33 ఒక్కడిని మాత్రం నా బలి పీఠం వద్ద యాజకునిగా సేవచేయటానికి రక్షిస్తాను. కాని, అతడు మాత్రం యాజకునిగా తన కళ్లు మందగించి, బలం ఉడిగి పోయేంత వరకు జీవిస్తాడు. నీ సంతానం వారంతా కత్తివేటుకు బలైపోతారు. 34 నేను చెప్పినవన్నీ నిజమవబోతున్నట్లుగా నీకు ఒక నిదర్శనం ఇస్తున్నాను. నీ ఇరువురు కుమారులైన హొఫ్నీ మరియు ఫీనెహాసు ఒకే రోజు మరణిస్తారు. 35 నాకై నేనే ఒక నమ్మకమైన యాజకుని ఎంచుకుంటాను. ఈ యాజకుడు నేను చెప్పినట్లు విని, నా మాట ప్రకారం చేస్తాడు. ఈ యాజకుని వంశాన్ని నేను స్థిరపరుస్తాను. నేను అభిషిక్తునిగా చేసిన రాజు ఎదుట ఇతడు నా సేవ చేస్తాడు. 36 నీ వంశంలో మిగిలిన వాళ్లంతా ఈ యాజకుని ఎదుట వంగి కొంచెం రొట్టె కోసం లేక కొద్దిగా డబ్బుకోసం దీనంగా ఆశిస్తారు. “మాకు భోజనానికి ఆహారం ఉండేలా మాకు యాజకులుగా ఉద్యోగం ఇప్పించమని అడుగుతారు.”’”
చిన్న కొలను దగ్గర నయం చేయటం
5 కొద్ది రోజుల తర్వాత యూదుల పండుగ వచ్చింది. యేసు యెరూషలేముకు వెళ్ళాడు. 2 అక్కడ యెరూషలేములో గొఱ్ఱెల ద్వారం దగ్గర ఒక కొలను ఉండేది. దీన్ని హీబ్రూ భాషలో బేతెస్థ అని అంటారు. దీని చుట్టూ ఐదు మండపాలు ఉండేవి. 3 చాలామంది వికలాంగులు, గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పక్షవాత రోగులు అక్కడ వేచి ఉండేవాళ్ళు. 4 [a] 5 అక్కడున్న వాళ్ళలో ఒకడు ముప్పైఎనిమిది సంవత్సరాల నుండి రోగంతో బాధ పడ్తూ ఉన్నాడు. 6 యేసు అతడక్కడ ఉండటం చూసాడు. చాలాకాలం నుండి అతడాస్థితిలో ఉన్నాడని గ్రహించి అతనితో, “నీకు నయం కావాలని ఉందా?” అని అడిగాడు.
7 ఆ వికలాంగుడు, “అయ్యా! నీళ్ళు కదిలినప్పుడు ఆ కోనేరులోకి దించటానికి ఎవరూ లేరు: అయినా వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగానే, ఇంకొకడు నాకన్నా ముందు ఆ నీళ్ళలోకి దిగుతాడు” అని అన్నాడు.
8 అప్పుడు యేసు అతనితో, “లే! నీ చాప తీసుకొని నడువు!” అని అన్నాడు. 9 అతనికి వెంటనే నయమైపోయింది. అతడు తన చాపతీసుకొని వెళ్ళిపోయాడు.
ఈ సంఘటన విశ్రాంతి రోజున జరిగింది. 10 తత్కారణంగా యూదులు కోలుకున్న వానితో, “ఇది విశ్రాంతి రోజు, ధర్మశాస్త్రం ప్రకారం నీవు చాపమోసుక వెళ్ళటానికి వీల్లేదు” అని అన్నారు.
11 కాని అతడు, “నాకు నయం చేసిన వ్యక్తి, ‘నీ చాప పట్టుకొని వెళ్ళు’ అని అన్నాడు” అని సమాధానం చెప్పాడు.
12 వాళ్ళు, “నీ చాప తీసుకొని నడవమన్న వాడెవడు?” అని అడిగారు.
13 ప్రజల గుంపు ఉండటంవల్ల యేసు అక్కడినుండి వెళ్ళిపోయాడు. కనుక తనకు నయం చేసిన వాడెవరో అతడు చూపలేక పోయాడు.
14 ఆ తర్వాత యేసు అతణ్ణి మందిరంలో కలుసుకొని, “చూడు! నీవు తిరిగి ఆరోగ్యవంతుడవు అయ్యావు. పాపాలు చెయ్యటం మానేయి. లేకపోతే ఇంతకన్నా ఎక్కువ కీడు సంభవించవచ్చు!” అని అన్నాడు.
15 ఆ తర్వాత వాడు వెళ్ళి, తనకు నయం చేసిన వ్యక్తి యేసు అని చెప్పాడు.
16 యేసు విశ్రాంతి రోజున యివన్నీ చెశాడని తెలియటం వల్ల యూదులు ఆయన్ని పీడించటం మొదలు పెట్టారు. 17 యేసు వాళ్ళతో, “నా తండ్రి అన్ని వేళలా పని చేస్తాడు. అందువల్ల నేనుకూడా పని చేస్తున్నాను” అని సమాధానం చెప్పాడు.
18 ఈ కారణంగా యూదులాయన్ని చంపటానికి యింకా గట్టిగా ప్రయత్నించారు. వాళ్ళు, “అతడు విశ్రాంతి రోజును పాటించక పోవటమే కాకుండా, దేవుడు తన తండ్రి అని కూడా అంటున్నాడు. అలా చేసి తనను దేవునితో సమానం చేసుకొంటున్నాడు” అని అన్నారు.
© 1997 Bible League International