Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 99

99 యెహోవాయే రాజు.
    కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
    అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
సీయోనులో యెహోవా గొప్పవాడు.
    ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
    దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
    దేవా, నీతిని నీవు చేశావు.
    యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
    ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
    మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
    దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
    వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
    దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
    నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
    ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
    ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
    మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.

1 సమూయేలు 2:11-17

11 తరువాత ఎల్కానా తన కుటుంబంతో కలిసి రామాలో తన ఇంటికి వెళ్లిపోయాడు. బాలుడు మాత్రం యాజకుడైన ఏలీ పర్యవేక్షణలో షిలోహులో యెహోవా సేవలో వుండిపోయాడు.

ఏలీ దుష్ట సంతానం-హొఫ్నీ, ఫీనెహాసు

12 ఏలీ కుమారులు చెడ్డవారు. వారు యెహోవాను లక్ష్యపెట్టలేదు. 13 యాజకులు ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాలో వారు చింత చేయలేదు. ప్రజలు వచ్చినప్పుడు యాజకులు ఇలా చేయాలి. ఒక వ్యక్తి బలి ఇచ్చిన ప్రతిసారీ ఆ మాంసాన్ని యాజకుడు ఒక కుండలో ఉడకబెట్టాలి. అప్పుడు యాజకుని సేవకుడు మూడు మొనలు గల ఒక కొంకి గరిటెతో రావాలి. 14 యాజకుని సేవకుడు గరిటెను ఉడుకుతోన్న బాణలిలో గుచ్చి తీయాలి. అప్పుడా గరిటె కొనలకు పట్టుకొని ఎంత మాంసం వస్తుందో అది మాత్రం యాజకునికి చెందుతుంది. బలులు ఇవ్వటానికి షిలోహుకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు యాజకులు చేయవలసిన విధి ఇదే. 15 కాని ఏలీ కుమారులు ఆ పద్ధతిని పాటించలేదు. కొవ్వును బలిపీఠం మీద దహించక మునుపే వారి సేవకులు బలులు ఇచ్చేవారి వద్దకు వెళ్లి “యాజకుని వంటకానికై కొంత మాంసం ఇవ్వమనీ, ఉడుకబెట్టిన మాంసం మీనుండి ఆయన తీసుకోడని అనేవారు.”

16 అయితే బలి ఇచ్చే వ్యక్తి గనుక కొవ్వును యధావిధిగా, “ముందు దహించిన తరువాత మీ ఇష్టం వచ్చినంత తీసుకోమని” అంటే యాజకుని సేవకుడు ఒప్పుకొనేవాడు కాదు. “అలా కాదు, ముందుగా మాంసం ఇవ్వండి. మీరు నాకు ఇవ్వక పోతే, బలవంతాన తీసుకోవలసి వస్తుంది!” అని బదులు చెప్పేవాడు.

17 ఈ విధంగా, యెహోవాకు అర్పించబడిన అర్పణలను వారు లక్ష్యపెట్టలేదని హొఫ్నీ, ఫీనెహాసులు వ్యక్తం చేసారు. ఇది చాలా చెడ్డపాపం.

రోమీయులకు 9:19-29

19 మీరు నాతో, “మరి, దేవుడు మమ్ముల్ని ఎందుకు ఇంకా నిందిస్తున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు కాదనగలరు?” అని అనవచ్చు. 20 కాని, ఓ మనిషీ! దేవునితో ఎదురు తిరిగి మాట్లాడటానికి నీవెవరవు? సృష్టింపబడింది సృష్టికర్తతో, “నన్నీవిధంగా ఎందుకు సృష్టించావు?” అని అడగవచ్చా? 21 కుమ్మరి ఒకే మట్టి ముద్దతో కొన్ని కుండల్ని మంచి పనులకోసం, మరి కొన్నిటిని మామూలుగా ఉపయోగించుకోవటానికి చేస్తాడు. అలా చెయ్యటానికి అతనికి అధికారం లేదా?

22 భవిష్యత్తులో దేవుడు తన కోపాన్ని చూపాలని, తన శక్తిని తెలియచెయ్యాలని, నాశనం చెయ్యతగిన దుర్మార్గుల పట్ల సహనం వహించాడంటే మనమేమనగలము? 23 దేవుడు తన తేజస్సులోని గొప్పతనాన్ని తెలియచెయ్యాలని తన మహిమను పంచుకోవటానికి దయతో ఇతర్లను సృష్టించాడంటే మనం ఏమనగలం? 24 యూదుల నుండే కాక, యూదులు కానివాళ్ళ నుండి కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది మనల్నే. 25 హోషేయ గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు:

“నా ప్రజలు కాని వాళ్ళను
    నా ప్రజలని పిలుస్తాను.
నా ప్రియురాలు కాని జనాన్ని
    నా ప్రియురాలా అని పిలుస్తాను.”(A)

26 “మీరు నా ప్రజలు కారు అని అన్న చోటనే మీరు సజీవంగా ఉండే దేవుని పుత్రులు అని అనటం సంభవిస్తుంది.”(B)

27 యెషయా ప్రవక్త ఇశ్రాయేలు వంశాన్ని గురించి ఇలా అన్నాడు:

“ఇశ్రాయేలు పుత్రుల సంఖ్య సముద్ర తీరంపై ఉన్న ఇసుక రేణువుల్లా ఉన్నా,
    కొందరు మాత్రమే రక్షింపబడతారు.
28 ఎందుకంటే, ప్రపంచానికి విధించిన శిక్షను ప్రభువు త్వరలోనే నెరవేరుస్తాడు.”(C)

29 యెషయా జరుగుతుందని చెప్పినట్లు:

“సర్వ శక్తిసంపన్నుడైన ప్రభువు కొంత మందిని
మనకు వదిలి ఉండక పోయినట్లైతే
    మనం సొదొమ ప్రజలవలే,
    గొమొఱ్ఱా ప్రజలవలె ఉండే వాళ్ళం.”(D)

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International