Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 139:1-6

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
    నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
    దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
    నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
    నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
    నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
    గ్రహించటం నాకు కష్టతరం.

కీర్తనలు. 139:13-18

13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
    నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
    నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
    నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
    ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
    నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
    కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.

1 సమూయేలు 1:1-18

ఎల్కానా కుటుంబము షిలోహులో ఆరాధించుట

ఎల్కానా అనబడే ఒక వ్యక్తి ఉండెను. అతను కొండల దేశమైన ఎఫ్రాయిములోని రామతయి మ్సోఫీము పట్టణవాసి. ఎల్కానా సూపు వంశస్థుడు. అతని తండ్రి యెరోహాము. యెరోహాము ఎలీహు యొక్క కుమారుడు. ఎలీహు తండ్రి తోహు. తోహు ఎఫ్రాయిము వంశపువాడైన సూపు కుమారుడు.

ఎల్కానాకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు హన్నా. రెండవ భార్యపేరు పెనిన్నా. పెనిన్నా సంతానవతి. కాని హన్నాకు పిల్లలు కలుగలేదు.

ప్రతి సంవత్సరము ఎల్కానా రామతయి మ్సోఫీమునుండి షిలోహుకు వెళ్లి సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించేవాడు. అక్కడ అతను బలులు కూడ అర్పించేవాడు. షిలోహులో హొఫ్నీ, మరియు ఫీనెహాసు అనే వారిరువురు యెహోవా యాజకులుగా ఉండిరి. వారిరువురూ ఏలీ అనే ప్రధాన యాజకుని కుమారులు. ప్రతిసారీ బలిఅర్పణలో ఒక భాగం ఎల్కానా తన భార్య పెనిన్నాకు ఇచ్చేవాడు. ఆమె కుమారులకు కూడా భాగాలు ఇచ్చేవాడు. యెహోవా హన్నాను గొడ్రాలుగా చేసినప్పటికీ, ఎల్కానా మాత్రం ఆమెను బాగా ప్రేమించేవాడు గనుక ఆమెకు కూడ ఎల్లప్పుడు అర్పణలో సమానభాగం ఇచ్చేవాడు.

పెనిన్నా హన్నాను కలవర పెట్టుట

పెనిన్నా అదేపనిగా హన్నాను పీడిస్తూ ఆమె మనస్సుకు ఎంతో బాధ కలిగించేది. అందుకు కారణం దేవుడు ఆమెను గొడ్రాలుగా చేయటమే. ప్రతి ఏటా ఇదిలా జరుగుతూ వచ్చింది. షిలోహులోని యెహోవా ఆలయానికి వెళ్లిన ప్రతిసారీ హన్నాను పెనిన్నా కించపరిచేది. ఒకరోజు ఎల్కానా బలి అర్పించుచుండగా హన్నా ఏడ్వసాగింది. భోజనం కూడా చేయలేదు. ఆమె భర్త ఎల్కానా, “ఎందుకు విచారిస్తున్నావనీ, ఎందుకు తినటం లేదనీ, ఎందుకు దుఃఖంతో ఉన్నావనీ ఆమెను అడిగాడు. నీకు నేను ఉన్నాను, నేను నీ భర్తను. పదిమంది కొడుకులకంటె నేను నీకు ఎక్కువ” అని కూడ ఓదార్చాడు.

హన్నా ప్రార్థన

హన్నా అన్న పానాలు పుచ్చుకొన్న తర్వాత, యెహోవాను ప్రార్థించటానికి వెళ్లింది. యెహోవా పవిత్ర ఆలయ ద్వారం పక్కనే యాజకుడు ఏలీ ఆసీనుడైవున్నాడు. 10 హన్నా మిక్కిలి విచారంతో ఉంది. చాలా దుఃఖించి దేవుణ్ణి ప్రార్థించింది. 11 ఒక పెద్ద మొక్కుబడి మొక్కింది. “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నేను ఎంత దుఃఖంలో వున్నానో చూడు. నన్ను జ్ఞాపకముంచుకో! నన్ను మర్చిపోవద్దు. నాకొక కుమారుని కలుగజేస్తే వానిని నేను తిరిగి నీ సేవకై జీవితాంతం విడిచి పెడ్తాను. పైగా అతడు మద్యపానాది[a] వ్యసనాలకు లోనుగాడు. అతడు నాజీరవుతాడు. మరియు అతని తలవెంట్రుకలు ఎవ్వరూ కత్తిపట్టి తీయరు”[b] అని కోరుకున్నది.

12 ఆ విధంగా హన్నా ప్రార్థనలో ఉన్నంతసేపూ ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు. 13 హన్నా అంతరంగంలోనే ప్రార్థిస్తూవుంది. ఆమె పెదవులు కదిలాయి గాని ఆమె గొంతు విప్పలేదు. అందుచేత హన్నా మద్యం సేవించి వుంటుందని ఏలీ భావించాడు. 14 “మద్యం తాగటం మానివేయి. నీ ద్రాక్షా రసాన్ని పారబోయి” అని హన్నాతో ఏలీ చెప్పాడు.

15 “లేదయ్యా, నేను ద్రాక్షారసం గాని, మరేదిగాని సేవించలేదు. నేను నా సమస్యలన్నీ యెహోవాతో చెప్పుకుంటున్నాను. 16 నేనొక చెడ్డ స్త్రీ నని తలంచవద్దు. ఇంత ఎక్కువ సేపు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానంటే నాకు ఎన్నో బాధలు, అంతులేని దుఃఖం ఉన్నాయి” అని హన్నా సమాధాన మిచ్చింది.

17 అంతట ఏలీ, “నీవు సమాధానంతో వెళ్లు. ఇశ్రాయేలు దేవుడు నీ కోర్కెలను నెరవేర్చునుగాక” అని హన్నాను పంపివేశాడు.

18 “నామీద దయ ఉంచండి” అని చెప్పి హన్నా వెళ్లి, కొంచెం ఆహారం తీసుకున్నది. ఆ తరువాత ఆమె మరెప్పుడూ అంత మనోవేదన చెందలేదు.

అపొస్తలుల కార్యములు 25:1-12

ఫేస్తు సమక్షంలో విచారణ

25 ఫేస్తు ఆ ప్రాంతానికి వచ్చిన మూడు రోజుల తర్వాత కైసరియనుండి యెరూషలేమునకు వెళ్ళాడు. అక్కడ ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతణ్ణి కలుసుకొని, పౌలును గురించి చెప్పారు. పౌలును వెంటనే యెరూషలేముకు పంపి తమకు ఉపకారం చెయ్యమని వేడుకున్నారు. ఎవ్వరికీ తెలియకుండా పౌలును దారిలో చంపేయాలని వాళ్ళ కుట్ర. ఫేస్తు, “పౌలు కైసరియలో బందీగా ఉన్నాడు. నేను కూడా అక్కడికి త్వరలోనే వెళ్తున్నాను. మీలో ముఖ్యమైనవాళ్ళు నావెంట వస్తే, అతడు ఒకవేళ ఏదైనా నేరం చేసి ఉంటే అతనిపై మీ నేరారోపణలు అక్కడే చేయవచ్చు” అని అన్నాడు.

అక్కడ వాళ్ళతో ఎనిమిది, పది రోజులు గడిపాక కైసరియకు వెళ్ళాడు. వెళ్ళిన మరుసటి రోజు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు పిలుచుకు రమ్మని ఆజ్ఞాపించాడు. పౌలు కనపడగానే యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టూ చేరి అతనిపై తీవ్రమైన నేరాలు ఆరోపించారు. ఎన్ని నేరాల్ని ఆరోపించినా, ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేక పోయారు. తదుపరి పౌలు, తాను నేరస్థుడు కాదని నిరూపించుకోవటానికి ఈ విధంగా వాదించాడు, “నేను యూదుల ధర్మశాస్త్రాన్ని కాని, మందిర నియమాల్ని కాని అతిక్రమించ లేదు. చక్రవర్తికి ఎదురు తిరిగి ప్రవర్తించనూ లేదు.”

ఫేస్తు, యూదులకు ఉపకారం చేయాలని, పౌలుతో, “నీవు యెరూషలేము వచ్చి అక్కడ నా ఎదుట న్యాయస్థానంలో నిలుచోగలవా?” అని అడిగాడు.

10 పౌలు ఈ విధంగా సమాధానం చెప్పాడు. “నేను ప్రస్తుతం చక్రవర్తి యొక్క న్యాయస్థానంలో నిలుచున్నాను. ఇక్కడే తీర్పు జరగాలి. నేను యూదులకు ఏ అన్యాయం చెయ్యలేదు. ఇది మీకు బాగా తెలుసు. 11 మరణదండన పొందవలసిన నేరం నేను ఒక వేళ ఏదైనా చేసివుంటే, మరణించటానికి నేను వెనుకంజ వేయను. కాని వీళ్ళు ఆరోపించిన నేరాలు అసత్యమైతే నన్ను వీళ్ళకప్పగించే అధికారం ఎవ్వరికీ లేదు. చక్రవర్తినే ఈ విషయంపై తీర్పు చెప్పమని నేను విన్నవించుకొంటాను.”

12 ఫేస్తు తన సలహాదార్లతో సంప్రదించి యిలా ప్రకటించాడు: “నీవు చక్రవర్తి సమక్షంలో విన్నవించుకోవాలని కోరావు. కనుక నిన్ను చక్రవర్తి దగ్గరకు పంపుతాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International