Revised Common Lectionary (Semicontinuous)
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి
11 “అందుచేత మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి. మీరు చేయాలని ఆయన మీతో చేప్పే విషయాలను మీరు చేయాలి. ఆయన చట్టాలకు, ఆజ్ఞలకు, నియమాలకు మీరు ఎల్లప్పుడూ విధేయులు కావాలి. 2 మీకు ప్రబోధం చేసేందుకు మీ దేవుడైన యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ నేడు జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యాలు జరగటం చూచింది, వాటిని అనుభవించింది మీరేగాని మీ పిల్లలు కాదు. యెహోవా ఎంత గొప్పవాడో మీరు చూసారు. ఆయన ఎంత బలంగలవాడో మీరు చూశారు. ఆయన చేసే శక్తివంతమైన కార్యాలు మీరు చూసారు. 3 ఆయన చేసిన అద్భుతాలను మీ పిల్లలు కాదు మీరు చూసారు. ఈజిప్టులో, ఈజిప్టు రాజైన ఫరోకు, ఆతని దేశం మొత్తానికి ఆయన చేసిన కార్యాలు మీరు చూశారు. ఈజిప్టు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు యెహోవా చేసిన వాటిని మీ పిల్లలు కాదు మీరే చూసారు. 4 వాళ్లు మిమ్మల్ని తరుముతూ ఉంటే, వాళ్లను యెహోవా ఎర్ర సముద్ర నీళ్లతో కప్పివేస్తూ ఉండటం మీరు చూసారు. యెహోవా వాళ్లను సర్వ నాశనం చేయటం మీరు చూసారు. 5 మీరు ఈ చోటికి వచ్చేంత వరకు అరణ్యంలో మీ దేవుడైన యెహోవా మీకోసం చేసిన వాటన్నింటిని చూసిన వారు మీరే మీ పిల్లలు కాదు. 6 రూబేను వంశానికి చెందిన ఎలీయాబు కుమారులు దాతాను, అబీరాములకు యెహోవా ఏమి చేసాడో మీరు చూసారు. భూమి నోరు తెరచినట్టుగా తెరచుకొని ఆ మనుష్యులను మ్రింగి వేయటం ఇశ్రాయేలు ప్రజలంతా చూసారు. అది వారి కుటుంబాలను, వారి గుడారాలను, వారికి ఉన్న ప్రతి పనిమనిషిని, ప్రతి జంతువును మింగి వేసింది. 7 యెహోవా చేసిన ఈ గొప్ప కార్యాలన్నింటినీ చూసినవాళ్లు మీరే, మీ పిల్లలు కాదు.
8 “కనుక ఈ వేళ నేను మీకు చెప్పే ప్రతి ఆజ్ఞకూ మీరు విధేయులు కావాలి. అప్పుడు మీరు బలంగా ఉంటారు. మీరు యొర్దాను నది దాటగలుగుతారు, మీరు ప్రవేశించ బోతున్న దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు. 9 మరియు ఆ దేశంలో మీ జీవితం సుదీర్గం అవుతుంది. మీ పూర్వీకులకు, వారి సంతతి వారికి ఇస్తానని యెహోవా వాగ్దానం చేసింది ఈ దేశమే. ఇది మంచివాటితో నిండిన దేశం.[a] 10 మీకు లభిస్తున్న ఈ దేశం మీరు వచ్చిన ఈజిప్టు దేశంలాంటిది కాదు. ఈజిప్టు దేశంలో మీరు విత్తనాలు చల్లి, మీ మొక్కలకు నీళ్లు పెట్టడానికి కాలువలనుండి నీళ్లుతోడేందుకు మీ పాదాలు ప్రయోగించారు. కూరగాయల తోటకు నీళ్లు పెట్టినట్టే మీ పొలాలకు మీరు నీళ్లు పెట్టారు. 11 అయితే త్వరలోనే మీకు లభిస్తున్న దేశం అలాంటిది కాదు. ఆ దేశములో కొండలు, లోయలు ఉన్నాయి. ఆకాశంనుండి కురిసే వర్షాల మూలంగా ఆ భూమికి నీరు లభిస్తుంది. 12 మీ దేవుడైన యెహోవా ఆ భూమి విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు. సంవత్సర ఆరంభంనుండి అంతంవరకు మీ దేవుడైన యెహోవా ఆ భూమిని కనిపెట్టుకొని ఉంటాడు.
13 “‘మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతో ప్రేమించాలని, మీ నిండు ఆత్మతో సేవించాలని, నేడు మీకు నేను ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినాలి. మీరు అలా చేస్తే, అప్పుడు 14 సకాలంలో నేను మీ భూమికి వర్షం ఇస్తాను. తొలకరి వాన, కడవరి వాన నేను పంపిస్తాను. అప్పుడు మీరు ధాన్యం, మీ కొత్త ద్రాక్షారసం, మీ నూనె సమకూర్చుకోవచ్చును. 15 మీ పశువుల కోసం నేను మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను. మీరు తినే ఆహారం సమృద్ధిగా ఉంటుంది.’
16 “అయితే జాగ్రత్తగా ఉండండి. మోసపోవద్దు. ఇతర దేవుళ్లను సేవించి, పూజించేందుకు తిరిగిపోవద్దు. 17 ఆ విధంగా మీరు చేస్తే యెహోవా మీమీద చాలా కోపగిస్తాడు. ఆకాశాలను ఆయన మూసి వేస్తాడు. అప్పుడు వర్షం కురవదు. భూమి మీద పంట పండదు. యెహోవా మీకు ఇస్తున్న మంచి దేశంలో మీరు త్వరగా నశిస్తారు.
13 అన్నిటికీ ప్రాణం పోసే దేవుని పేరిట, పొంతి పిలాతు సమక్షంలో అదే గొప్ప సత్యాన్ని అంగీకరించిన యేసు క్రీస్తు పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. 14 మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేదాక ఈ ఆజ్ఞను పాటించు. దాన్ని పాటించటంలో ఏ మచ్చా రానీయకుండా, ఏ అపకీర్తీ రానివ్వకుండా చూడు. 15 “మన పాలకుడు,” రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సర్వాధిపతి అయిన దేవుడు తగిన సమయం రాగానే యేసు క్రీస్తును పంపుతాడు. 16 మనం సమీపించలేని వెలుగులో ఉండే అమరుడైన దేవుడాయన. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, మరి ఎవ్వరూ చూడలేరు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆయన శక్తి తరగకుండా ఉండుగాక! అమేన్.
© 1997 Bible League International