Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 148

148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
    ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
    ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
    ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
    ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
    మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
    తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
    దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
    నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
    వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
    ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
    సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
    దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!

సామెతలు 9:1-12

జ్ఞానము ఆహ్వానించుట

జ్ఞానము తన నివాసమును కట్టుకొనెను. దానికి ఏడు స్తంభములను ఆమె నిలబెట్టెను. ఆమె (జ్ఞానము) భోజనం సిద్ధం చేసి, ద్రాక్షారసమును కలిపి, భోజనమును బల్లపైఉంచెను. అప్పుడు ఆమె (జ్ఞానము) తన సేవకులను, ప్రజలను నగరములోని ఎత్తయిన స్థలమునకు తనతో పాటు తినుటకు ఆహ్వానించెను. కొండ మీదికి వచ్చి, ఆమెతో కూడ భోజనం చేసేందుకు మనుష్యులను ఆహ్వానించుటకు తన సేవకులను ఊళ్లోనికి పంపింది. “నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న మనుష్యులారా, మీరు రండి” అని ఆమె చెప్పింది. బుద్దిహీనులను కూడా ఆమె పిలిచింది. “నా జ్ఞాన భోజనం ఆరగించండి, రండి. నేను చేసిన ద్రాక్షారసం తాగండి. మీ పాత బుద్ధిహీన పద్ధతులు విడిచి పెట్టండి. మీకు జీవం ఉంటుంది. తెలివిగల మార్గాన్ని అనుసరించండి” అని ఆమె చెప్పింది.

ఒక గర్విష్ఠికి, అతడు చేసింది తప్పు అని చూపించటానికి నువ్వు ప్రయత్నిస్తే అతడు నిన్నే విమర్శిస్తాడు. ఆ మనిషి దేవుని జ్ఞానము గూర్చి హేళన చేస్తాడు. ఒక దుర్మార్గుడిదే తప్పని నీవు చెబితే అతడు నిన్ను హేళన చేస్తాడు. కనుక ఒకడు ఇతరుల కంటే తాను మంచి వాడినని తలిస్తే అతనిది తప్పు అని అతనికి చెప్పవద్దు. దానివల్ల అతడు నిన్ను ద్వేషిస్తాడు. కాని జ్ఞానముగల ఒక మనిషికి సహాయం చేయటానికి నీవు ప్రయత్నిస్తే అతడు నిన్ను గౌరవిస్తాడు. జ్ఞానముగల ఒక మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా జ్ఞానము గలవాడవుతాడు. ఒకవేళ మంచి మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు.

10 యెహోవా యెడల భయము కలిగి యుండుట జ్ఞానము సంపాదించుటకు మొదటి మెట్టు. యెహోవాను గూర్చిన జ్ఞానము తెలివి సంపాదించుటకు మొదటి మెట్టు. 11 నీకు జ్ఞానము ఉంటే అప్పుడు నీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది. 12 నీవు జ్ఞానివి అయితే నీ మంచి కోసమే నీవు జ్ఞానముగలవాడవు అవుతావు. కాని నీవు గర్వంగలవాడవై, యితరులను హేళన చేస్తే అప్పుడు నీ కష్టానికి నిన్ను నీవే నిందించుకోవాలి.

2 పేతురు 3:8-13

కాని ప్రియమైన సోదరులారా! ఈ విషయాన్ని మరచిపోకండి. ప్రభువుకు ఒక రోజు వెయ్యి సంవత్సరాలుగాను, వెయ్యి సంవత్సరాలు ఒక రోజుగాను ఉంటాయి[a] ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని కొందరు అనుకుంటారు. కాని, ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ఆలస్యం చెయ్యడు. ఎవ్వరూ నాశనం కాకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన మీపట్ల సహనం వహిస్తున్నాడు.

10 కాని ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది. ఆ రోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమైపోతాయి. ఆకాశాల్లో ఉన్నవన్నీ మంటల్లో కాలి నాశనమై పోతాయి. పృథ్వి, దానిలో ఉన్న సమస్త వస్తువులూ కాలిపోతాయి. 11 అన్నీ ఈ విధంగా నాశనమైపోతాయి కనుక దేవుని ప్రజలై పవిత్రంగా జీవించటం ఎంత అవసరమో గ్రహించండి. 12 దేవుని దినం రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఆ దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి. ఆ రోజు వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. ఆ వేడికి పరమాణువులు కరిగి పోతాయి. 13 దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిపై నీతి నివసిస్తుంది. వాటికోసమే మనం ఎదురు చూస్తున్నాం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International