Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 148

148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
    ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
    ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
    ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
    ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
    మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
    తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
    దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
    నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
    వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
    ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
    సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
    దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!

యిర్మీయా 26:1-9

దేవాలయం వద్ద యిర్మీయా పాఠం

26 యూదా రాజ్యాన్ని యెహోయాకీము పాలిస్తున్న మొదటి సంవత్సరంలో[a] ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు దేవాలయ ప్రాంగణంలో నిలబడు. దేవుని ఆరాధించుటకై వచ్చే యూదా ప్రజలందరికి ఈ సందేశాన్ని అందజేయుము. నేను నిన్ను మాట్లాడమని చెప్పినదంతా వారికి చెప్పుము. నా సందేశంలో ఏ భాగాన్ని వదిలి పెట్టవద్దు. బహుశః వారు నా సందేశాన్ని విని ఆచరించవచ్చు. బహుశః వారా దుర్మార్గపు జీవితాన్ని విడనాడవచ్చు. వారు గనుక మారితే, నేను వారిని శిక్షించాలనే నా పథకాన్ని కూడా మార్చు కుంటాను. వారు చేసిన అనేక దుష్టకార్యాల దృష్ట్యా నేను వారిని శిక్షించే పథకాన్ని తయారు చేస్తున్నాను. నీ విధి వారికి చెప్పుము, ‘యెహోవా ఇలా అంటున్నాడు: నా ఉపదేశాలను మీకు అందించాను. మీరు నాకు విధేయులై నా సూక్తులను పాటించాలి! నా సేవకులు (నా ప్రవక్తలు) మీకు చెప్పే విషయాలను మీరు ఆలకించాలి. నా ప్రవక్తలను మీ వద్దకు మరల, పంపియున్నాను. కాని మీరు వారు చెప్పేది ఆలకించలేదు. మీరు నన్ను అనుసరించక పోతే యెరూషలేములో ఉన్న నా ఆలయాన్ని షిలోహులో వున్న నా పవిత్ర గుడారం[b] మాదిరిగా చేసివేస్తాను. ప్రపంచంలోని ప్రజలెవరైనా తమకు గిట్టని నగరాలకు కీడు జరగాలని తలిస్తే, యెరూషలేముకు జరిగినట్లు జరగాలని కోరుకుంటాను.’”

దేవాలయంలో యిర్మీయా ఈ మాటలు చెప్పటం యాజకులు, ప్రవక్తలు, దేవుని ఆలయానికి వచ్చిన ప్రజలందరూ విన్నారు. ప్రజలకు చెప్పమని యెహోవా ఆజ్ఞ యిచ్చినదంతా యిర్మీయా చెప్పటం ముగించాడు. పిమ్మట యాజకులు, ప్రవక్తలు, ప్రజలు అంతా యిర్మీయాను పట్టుకున్నారు. “ఈ భయంకరమైన విషయాలు చెప్పినందుకు నీవు చనిపోవలసినదే! యెహోవా పేరట అటువంటి విషయాలు చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! షిలోహులోని పవిత్ర గుడారంలా ఈ దేవాలయం నాశనమవుతుందని చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! యెరూషలేములో ఎవ్వరూ నివసించని రీతిలో అది ఎడారిలా మారిపోతుందని చెప్పటానికి నీకు ఎన్ని గుండెలు!” అని వారంతా యిర్మీయాను గద్దించారు. యెహోవా గుడిలో వారంతా యిర్మీయాను చుట్టు ముట్టారు.

యిర్మీయా 26:12-15

12 పిమ్మట యిర్మీయా యూదా పాలకులందరితోను, ఇతర ప్రజలతోను మాట్లాడాడు. అతనిలా చెప్పాడు: “ఈ ఆలయాన్ని గురించి, ఈ నగరాన్ని గురించి ఈ విషయాలు చెప్పమని యెహోవా నన్ను పంపాడు. మీరు వినియున్నదంతా యెహోవా తెలియజేసినదే. 13 ఓ ప్రజలారా, మీ జీవిత విధానం మార్చుకోండి! మీరు సత్కార్యాలు చేయుట మొదలుపెట్టండి! మీ దేవుడైన యెహోవాను మీరు అనుసరించాలి. మీరలా చేస్తే యెహోవా తన మనస్సు మార్చుకుంటాడు. యెహోవా మీకు వ్యతిరేకంగా తలపెట్టిన హానికరమైన పనులు చేయడు. 14 ఇక నా విషయానికి వస్తే, నేను మీ ఆధీనంలో ఉన్నాను. మీరు ఏది ఉచితమని, న్యాయమని తోస్తే, నాకు అది చేయండి. 15 కాని మీరు నన్ను చంపితే, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఖచ్చితంగా ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరానికి పాల్పడిన వారవుతారు. అంతే కాదు. మీరీ నగరాన్ని, అందులోని ప్రతి పౌరుణ్ణి కూడ నేరస్థులుగా చేసిన వారవుతారు. యెహోవా నిజంగా నన్ను మీ వద్దకు పంపియున్నాడు. మీరు విన్న సందేశం వాస్తవంగా యెహోవా నుండే వచ్చినది.”

అపొస్తలుల కార్యములు 6:8-15

స్తెఫనును బంధించటం

దేవునినుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని పొందిన స్తెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్భుతాలు చేసాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు. కాని స్వతంత్రుల సమాజమని పిలువబడే సమాజానికి చెందిన కొందరు యూదులు స్తెఫనుతో వాదన పెట్టుకొన్నారు. వీళ్ళలో కురేనీ, అలెక్సంద్రియ పట్టణాలకు చెందిన యూదులు, కిలికియ, ఆసియ ప్రాంతాలకు చెందిన యూదులు కూడా ఉన్నారు. 10 కాని మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి తెలివినిచ్చాడు. కనుక అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు.

11 ఆ తర్వాత యూదులు కొందరిని పురికొలిపి, “ఈ స్తెఫను మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడటం మేము విన్నాము” అని చెప్పమన్నారు. 12 అదే విధంగా ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్నికూడా పురికొలిపి పంపారు. ఆ తదుపరి స్తెఫన్ను బంధించి మహాసభ ముందుకు తెచ్చారు.

13-14 తప్పుడు సాక్ష్యాలు తెచ్చి, “యితడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎదిరిస్తూ మాట్లాడటం మానుకోడు. ఎందుకంటే, నజరేతు నివాసి యేసు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తాడని, మోషే మనకందించిన ఆచారాన్ని మారుస్తాడని చెప్పటం మేము విన్నాము” అని వాళ్ళతో చెప్పించారు. 15 సభలో కూర్చొన్నవాళ్ళంతా స్తెఫను వైపు శ్రద్ధగా చూసారు. వాళ్ళకు అతని ముఖం ఒక దేవదూత ముఖంలా కనిపించింది.

అపొస్తలుల కార్యములు 7:51-60

51 స్తెఫను ఉపన్యాసం సాగిస్తూ, “మూర్ఖులారా! మీ హృదయాలు యూదులు కానివాళ్ళ హృదయాల వలే ఉన్నాయి. మీ చెవులు దైవసందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళవలె మీరు కూడా అన్ని వేళలా పవిత్రాత్మను తృణీకరించారు. 52 మీ పూర్వులు హింసించని ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా! నీతిమంతుడు రానున్నాడని ప్రవచనం చెప్పినవాళ్ళను వాళ్ళు చంపివేసారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తుని కూడా చంపేసారు. 53 దేవదూతల ద్వారా అందివ్వబడిన దేవుని ధర్మశాస్త్రం లభించింది మీకు. కాని దాన్ని మీరు పాటించను కూడా లేదు” అని అన్నాడు.

స్తెఫన్ను రాళ్ళతో కొట్టి చంపటం

54 ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండిపోయి, అతణ్ణి చూసి పళ్ళు కొరికారు. 55 కాని స్తెఫను పవిత్రాత్మతో నిండిపోయి పరలోకం వైపు చూసి దేవుని తేజస్సును, యేసు దేవుని కుడి వైపు ఉండటం చూసాడు. 56 “అదిగో చూడండి! పరలోకం తెరుచుకోవటం. దేవుని కుమారుడు ఆయన కుడి వైపు నిలుచొని వుండటం చూస్తున్నాను!” అని అన్నాడు.

57 ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్ళారు. 58 అతణ్ణి ఊరి బయటికి లాగి రాళ్ళతో కొట్టటం మొదలు పెట్టారు. ఈ సంఘటనను చూస్తున్నవాళ్ళు తమ వస్త్రాల్ని “సౌలు” అనబడే ఒక యువకుని కాళ్ళ ముందు వుంచారు. 59 వాళ్ళు రాళ్ళు విసరుతుండగా స్తెఫను, “యేసు ప్రభూ! నా ఆత్మను నీలో చేర్చుకో!” అని ప్రార్థించాడు. 60 ఆ తదుపరి మోకరిల్లి, “ప్రభూ! వాళ్ళపై ఈ పాపం మోపవద్దు!” అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూసాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International