Revised Common Lectionary (Semicontinuous)
96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
7 వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
స్తుతి కీర్తనలు పాడండి.
8 యెహోవా నామాన్ని స్తుతించండి.
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10 యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
ప్రపంచాన్ని పాలించుటకు[a] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.
ప్రతిదానికి ఒక తరుణం
3 ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది. ఈ భూమి మీద ప్రతీది సరైన సమయంలో సంభవిస్తుంది.
2 పుట్టేందుకొక సమయం వుంది,
చనిపోయేందుకొక సమయం వుంది.
మొక్కలు నాటేందుకొక సమయం వుంది,
మొక్కలు పెరికేందుకొక సమయం వుంది.
3 చంపేందుకొక సమయం వుంది,
గాయం మాన్పేందుకొక సమయం వుంది.
నిర్మూలించేందుకొక సమయం వుంది,
నిర్మించేందుకొక సమయం వుంది.
4 ఏడ్చేందుకొక సమయం వుంది,
నవ్వేందుకొక సమయం వుంది.
దుఃఖించేందుకొక సమయం వుంది.
సంతోషంతో నాట్య మాడేందుకొక సమయం వుంది.
5 ఆయుధాలు పడవేసేందుకొక సమయం వుంది,
వాటిని తిరిగి చేపట్టేందుకొక సమయం వుంది.
ఒకరిని కౌగిలించు కొనేందుకొక సమయం వుంది,
ఆ కౌగిలిని సడలించేందుకొక సమయం ఉంది.[a]
6 దేన్నయినా వెదికేందుకొక సమయం వుంది,
అది పోగొట్టుకొనేందుకొక సమయం వుంది.
వస్తువులు పదిలపర్చు కొనే సమయం వుంది,
వాటిని పారవేసే సమయం వుంది.
7 వస్త్రం చింపేందుకొక సమయం వుంది,
దాన్ని కుట్టేందుకొక సమయం వుంది.
మౌనానికొక సమయం వుంది.
మాట్లాడేందు కొక సమయం వుంది.
8 ప్రేమించేందుకొక సమయం వుంది,
ద్వేషించేందుకొక సమయం వుంది.
సమరానికొక సమయం వుంది,
శాంతికొక సమయం వుంది.
17 ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్ఠమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. 18 దేవుడు తన సృష్టిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జన్మనివ్వటానికి సంకల్పించాడు.
© 1997 Bible League International