Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: కోరహు కుమారుల స్తుతి కీర్తన
85 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.
యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
2 యెహోవా, నీ ప్రజలను క్షమించుము!
వారి పాపాలు తుడిచివేయుము.
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
యిర్మీయాకు దేవుని పిలుపు
4 యెహోవా వాక్కు నాకు చేరింది. ఈ వర్తమానం యెహోవా వద్ద నుండి వచ్చింది.
5 “నీ తల్లి గర్భంలో నిన్ను నేను రూపించక ముందే
నిన్ను నేనెరిగియున్నాను.
నీవు పుట్టకముందే
నిన్నొక ముఖ్యమైన పనికి ఎన్నుకున్నాను.
దేశాలకు నిన్నొక ప్రవక్తగా నియమించాను.”
6 అప్పుడు, యిర్మీయానగు నేను “సర్వశక్తిమంతుడవైన యెహోవా! నేనెలా మాట్లాడాలో నాకు తెలియదు. నేను బాలుడను” అని అన్నాను.
7 కాని యెహోవా ఇలా అన్నాడు:
“బాలుడనని అనవద్దు.
నేను నిన్నెక్కడికి పంపుతానో నీవచ్చటికి తప్పక వెళ్లాలి.
నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా నీవు చెప్పాలి.
8 ఎవ్వరికీ భయపడకు.
నేను నీతో ఉన్నాను. నేను నిన్ను కాపాడతాను”.
ఈ వర్తమానం యెహోవానైన నా వద్దనుండి వచ్చినది.
9 పిమ్మట యెహోవా తన చేయి చాచి నా నోటిని తాకాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు:
“యిర్మీయా, నేను నా వాక్కును నీ నోటిలో ఉంచుతున్నాను.
10 దేశాలను, సామ్రాజ్యాలను ఈ రోజు నీ జవాబుదారిలో ఉంచుతున్నాను.
నీవు వారిని కూకటి వేళ్లతో పెకలించి చీల్చివేస్తావు.
నీవు వాటిని సర్వనాశనం చేసి పడత్రోస్తావు.
నీవు వాటిని కట్టి నాటుతావు.”
అంతియొకయ ప్రజలకు శుభవార్త తెలియటం
19 స్తెఫను చనిపోయిన తర్వాత జరిగిన హింసలకు భక్తులు చెదిరిపోయారు. వీళ్ళలో కొందరు ఫొనీషియ, సైప్రసు, అంతియొకయ పట్టణాలకు వెళ్ళి దైవసందేశాన్ని యూదులకు మాత్రమే చెప్పారు. 20 సైప్రసు, కురేనీ పట్టణాలకు చెందిన వీళ్ళలో కొందరు అంతియొకయకు వెళ్ళి, గ్రీకువారితో కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. 21 ప్రభువు అభయ హస్తం వాళ్ళ వెంట ఉంది. కనుక అనేకులు వాళ్ళు చెప్పిన దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి ప్రభువునందు విశ్వాసులయ్యారు.
22 యెరూషలేములో వున్న సంఘం ఈ వార్త విని బర్నబాను అంతియొకయకు పంపింది. 23 అతడు అంతియొకయకు వెళ్ళి అక్కడి ప్రజలపై దైవానుగ్రహం అమితంగా ఉండటం గమనించి చాలా ఆనందించాడు. ప్రభువు పట్ల మనసారా భక్తి చూపుతూ ఉండమని అక్కడి వాళ్ళందర్ని వేడుకున్నాడు. 24 బర్నబా ఉత్తముడు. పరిశుద్ధాత్మ ప్రభావం అతనిపై సంపూర్ణంగా ఉంది. అంతేకాక దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అనేకులు ప్రభువునందు విశ్వాసులయ్యారు.
25 ఆ తర్వాత బర్నబా, తార్సు అనే పట్టణానికి వెళ్ళి సౌలు కోసం చూసాడు. అతణ్ణి కలుసుకొని అంతియొకయకు పిలుచుకు వచ్చాడు. 26 సౌలు, బర్నబా ఒక సంవత్సరం అంతియొకయలో ఉన్నారు. అక్కడి సంఘాన్ని కలుసుకొంటూ అనేకులకు బోధించేవాళ్ళు. అంతియొకయలోని శిష్యులు మొదటిసారిగా “క్రైస్తవులు” అని పిలువబడ్డారు.
© 1997 Bible League International