Revised Common Lectionary (Semicontinuous)
ఆసాపు స్తుతి కీర్తన.
79 దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు.
ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు.
యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
2 అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు.
అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
3 దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు.
మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువబడ లేదు.
4 మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి.
మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
5 దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా?
బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
6 దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
7 ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి.
వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
8 దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము.
త్వరపడి. నీ దయ మాకు చూపించుము.
నీవు మాకు ఎంతో అవసరం.
9 మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము.
నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము.
మమ్మల్ని రక్షించుము.
నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
10 “మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?”
అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు.
దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము.
నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము.
11 దయచేసి, ఖైదీల మూల్గులు వినుము!
దేవా, మరణించుటకు ఏర్పరచబడిన ఈ ప్రజలను నీ మహా శక్తివలన రక్షించుము.
12 దేవా, మా చుట్టూరా ఉన్న ప్రజలు మాకు చేసిన వాటిని బట్టి ఏడు మార్లు వారిని శిక్షించుము.
ఆ ప్రజలు నిన్ను అవమానించిన సమయాలనుబట్టి వారిని శిక్షించుము.
13 మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం.
మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము.
దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.
యెరూషలేమునుండి న్యాయం రావటం
4 చివరి రోజులలో ఇలా జరుగుతుంది.
పర్వతాలన్నిటిలో దేవుడైన యెహోవా ఆలయమున్న పర్వతం మిక్కిలి ప్రాముఖ్యంగలది అవుతుంది.
అది కొండలన్నిటిలో ఉన్నతంగా చేయబడుతుంది.
అన్యదేశాల ప్రజలు దానివద్దకు ప్రవాహంలా వస్తారు.
2 అనేక దేశాలవారు వచ్చి ఇలా అంటారు:
“రండి, మనం యెహోవా పర్వతంమీదికి వెళదాం!
యాకోబు దేవుని ఆలయానికి వెళదాం!
యెహోవా తన ధర్మాన్ని మనకు నేర్పుతాడు.
ఆయన మార్గంలో మనం నడుద్దాం.”
ఎందువల్లనంటే దేవుని బోధలు సీయోనునుండి వస్తాయి.
యెహోవా వాక్కు యెరూషలేమునుండి వస్తుంది!
3 యెహోవా అనేక జనుల మధ్య తీర్పు తీర్చుతాడు.
బహు దూరానగల బలమైన దేశాల ప్రజలకు ఆయన తీర్పు ఇస్తాడు.
అప్పుడు వారు తమ కత్తులను సాగగొట్టి వాటిని నాగలికర్రులుగా చేస్తారు.
ఆ జనులు తమ ఈటెలను సాగగొట్టి చెట్లను నరికే పనిముట్లుగా చేస్తారు.
జనులు ఒకరితో ఒకరు కత్తులతో యుద్ధం చేయటం మాని వేస్తారు.
వారిక ఎన్నడూ యుద్ధ వ్యూహాలను అధ్యయనం చేయరు!
4 లేదు, ప్రతి ఒక్కడూ తన ద్రాక్షాచెట్లక్రింద,
అంజూరపు చెట్లక్రింద కూర్చుంటాడు.
వారిని ఎవ్వరూ భయపడేలా చేయరు!
ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెప్పాడు!
5 అన్యదేశాల ప్రజలు తమతమ దేవుళ్లను అనుసరిస్తారు.
కానీ మనం మాత్రం మన దేవుడైన యెహోవా నామాన్ని సదా స్మరించుకుంటాం!
ఏడు తెగుళ్ళతో ఏడుగురు దూతలు
15 నేను పరలోకంలో యింకొక అద్భుతమైన దృశ్యం చూశాను. ఏడుగురు దూతలు ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉండటం చూశాను. వీటితో దేవుని కోపం సమాప్తమౌతుంది. కనుక యివి చివరివి.
2 నిప్పుతో కలిసిన గాజు సముద్రం లాంటి ఒక సముద్రం నాకు కనిపించింది. మృగాన్ని, దాని విగ్రహాన్ని జయించినవాళ్ళు, దాని నామానికున్న సంఖ్యను జయించినవాళ్ళు సముద్రతీరం మీద నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు తమ చేతుల్లో దేవుడుంచిన వీణల్ని పట్టుకొని ఉన్నారు. 3 దేవుని సేవకుడైన మోషే గీతాన్ని, గొఱ్ఱెపిల్ల గీతాన్ని వాళ్ళు ఈ విధంగా పాడుతూ ఉన్నారు:
“ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన దైవమా!
నీ కార్యాలు గొప్పవి. అద్భుతమైనవి.
యుగయుగాలకు రాజువు నీవు.
నీ మార్గాలు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.
4 ఓ ప్రభూ! నీకెవరు భయపడరు?
నీ నామాన్ని స్తుతించనివారెవరున్నారు?
నీ వొక్కడివే పరిశుద్ధుడవు.
నీ నీతికార్యాలు ప్రత్యక్షమైనవి.
కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”
5 దీని తర్వాత పరలోకంలో ఉన్న మందిరాన్ని చూసాను. అంటే సాక్ష్యపు గుడారము తెరుచుకోవటం చూసాను. 6 ఆ మందిరం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళతో బయటకు వచ్చారు. వాళ్ళు తెల్లటి మెరిసే నార బట్టలు వేసుకొని ఉన్నారు. రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు. 7 ఆ తర్వాత ఆ నాలుగు ప్రాణుల్లో ఒకటి ఆ ఏడుగురు దూతలకు చిరంజీవి అయిన దేవుని ఆగ్రహంతో నిండిన ఏడు బంగారు పాత్రల్ని యిచ్చింది. 8 ఆ మందిరమంతా దైవశక్తి వల్ల మరియు ఆయన తేజస్సు వల్ల కలిగిన పొగలతో నిండిపోయింది. ఏడుగురు దూతలు తెచ్చిన ఏడు తెగుళ్ళు పూర్తి అయ్యేవరకు ఆ మందిరంలో ఎవ్వరూ ప్రవేశించలేకపోయారు.
© 1997 Bible League International