Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 64:1-9

64 నీవు ఆకాశాలను చీల్చుకొని
    భూమి మీదికి దిగివస్తే అప్పుడు సమస్తం మారిపోతుంది.
    పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.
మండుతున్న పొదల్లా, పర్వతాలు అగ్ని జ్వాలల్లో కాలిపోతాయి.
    నిప్పుమీది నీళ్లలా పర్వతాలు కాగిపోతాయి.
అప్పుడు నీ శత్రువులు నిన్ను గూర్చి తెలుసుకొంటారు.
    అప్పుడు రాజ్యాలన్ని నిన్ను చూడగా భయంతో వణుకుతాయి.
(కానీ నీ ఈ సంగతులు జరిగించాలని మేము నిజంగా కోరటంలేదు.
    పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.)
నీ ప్రజలు నిజంగా ఎన్నడూ నీ మాట వినలేదు.
    నీవు చెప్పిన విషయాలను నీ ప్రజలు నిజంగా ఎన్నడూ వినలేదు.
నీవంటి దేవుణ్ణి ఏ మనిషీ ఎన్నడూ చూడలేదు. నీవు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు.
    ప్రజలు సహనంతో నీకొరకు కనిపెట్టివుంటే అప్పుడు నీవు వారికోసం గొప్ప కార్యాలు చేస్తావు.

మేలు చేయటంలో ఆనందించే మనుష్యులతో నీవు ఉన్నావు.
    నీ జీవన విధానాలను ఆ మనుష్యులు జ్ఞాపకం చేసుకొంటారు.
కానీ చూడు, గతంలో మేము నీకు విరోధంగా పాపం చేశాము
    అందుచేత నీవు మా మీద కోపగించావు.
మేమందరం పాపంతో మైలపడ్డాం.
    మా “నీతి” అంతా పాత మైల గుడ్డల్లాంటిదే.
మేమందరం ఎండిపోయిన ఆకుల్లా ఉన్నాము.
    మా పాపాలు మమ్మల్ని గాలిలా కొట్టుకుపోయాయి.
మేము నిన్ను ఆరాధించటం లేదు, నీ నామం మేము విశ్వసించలేదు.
నిన్ను వెంబడించాలనే సంబరం మాలో ఎవ్వరికీ లేదు.
    అందుచేత నీవు మా వద్దనుండి తిరిగిపోయావు.
మేము పాపంతో నిండిపోయాం
    గనుక నీ ఎదుట మేము నిస్సహాయులం.
కానీ, యెహోవా, నీవు మా తండ్రివి.
    మేము మట్టిలాంటి వాళ్లం. నీవు కుమ్మరివి.
    నీ చేతులే మమ్మల్ని అందర్ని చేశాయి.
యెహోవా, మా మీద ఇంకా కోపంతోనే ఉండకు.
    మా పాపాలను శాశ్వతంగా జ్ఞాపకం చేసుకోవద్దు.
దయచేసి మమ్మల్ని చూడు,
    మేము నీ ప్రజలము.

కీర్తనలు. 80:1-7

సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
    యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
    వచ్చి మమ్మల్ని రక్షించుము.
దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
    మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
    మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
    నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
    మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
    నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.

కీర్తనలు. 80:17-19

17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
    నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
    అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
    నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.

1 కొరింథీయులకు 1:3-9

మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు శాంతి, అనుగ్రహం లభించు గాక!

కృతజ్ఞత

యేసు క్రీస్తు ద్వారా మీకు తన అనుగ్రహం ప్రసాదించిన దేవునికి నేను మీ పక్షాన అన్ని వేళలా కృతజ్ఞతలు అర్పిస్తాను. మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీ మాటలో, మీ జ్ఞానంలో అన్ని విధాలా అభివృద్ధి చెందారు. క్రీస్తును గురించి చెప్పబడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది. మరియు ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు మీరు కాచుకొని ఉన్నారు. ఆత్మీయ జ్ఞానానికి మీలో ఏ కొరతా లేదు. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చిన రోజున మీరు నిర్దోషులుగా పరిగణింపబడతారు. దానికి తగినట్లు దేవుడు మీకు చివరిదాకా శక్తినిస్తాడు. తన కుమారుడు, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుతో సహవారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్థుడు.

మార్కు 13:24-37

24 “కాని ఆ కష్టాలు గడిచిన తర్వాత వచ్చే రోజుల్లో,

‘సూర్యుడు చీకటైపోతాడు.
    చంద్రుడు తన వెలుగును వెదజల్లడు.
25 ఆకాశంలోని నక్షత్రాలు రాలిపోతాయి.
    ఆకాశంలో వున్నవన్నీ మార్పుచెందుతాయి.’(A)

26 “అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో, తేజస్సుతో, మేఘాలమీద రావటం మానవులు చూస్తారు. 27 ఆయన నలువైపుల నుండి, అంటే ఈ మూలనుండి ఆ మూల దాకా, తన దేవదూతలను పంపి తానెన్నుకున్న ప్రజలను ప్రోగు చేయిస్తాడు.

28 “అంజూరపు చెట్టును చూసి పాఠం నేర్చుకొండి. దాని రెమ్మలు ఆకులు చిగురించుట చూసి ఎండాకాలం రానున్నదని మీరు గ్రహిస్తారు. 29 అదే విధంగా యివి జరగటం మీరు చూసినప్పుడు ఆయన త్వరగా రానైయున్నాడని గ్రహిస్తారు. 30 ఇది నిజం. ఈ కాలపువాళ్ళు జీవిస్తూండగానే ఇవన్ని జరుగును. 31 ఆకాశం, భూమి గతించి పోతాయి కాని, నా మాటలు ఎన్నటికి గతించిపోవు.

32 “ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో, పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారునికి గాని మరెవ్వరికి గాని తెలియదు. అది తండ్రికి మాత్రమే తెలుసు. 33 జాగ్రత్తగా, సిద్ధంగా ఉండండి.[a] ఆ సమయం ఎప్పుడు రాబోతోందో మీకు తెలియదు.

34 “ఇది తన యిల్లు విడిచి దూరదేశం వెళ్ళే ఒక మనిషిని పోలి ఉంటుంది. అతడు తన యింటిని సేవకులకు అప్పగిస్తాడు. ప్రతి సేవకునికి ఒక పని అప్పగిస్తాడు. ద్వారం దగ్గరవున్నవానికి కాపలా కాయమని చెబుతాడు. 35 ఎల్లప్పుడు సిద్ధంగా ఉండమని చెబుతాడు. ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడికూసే వేళకు వస్తాడో, సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. 36 అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రిస్తూ ఉండటం చూస్తాడేమో. 37 హెచ్చరికగా ఉండండి అని మీకు చెబుతున్నాను. అదే ప్రతి ఒక్కనికి చెబుతున్నాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International