Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 100

కృతజ్ఞత కీర్తన.

100 భూమీ, యెహోవాను గూర్చి పాడుము!
నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు!
    ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము.
యెహోవా దేవుడని తెలుసుకొనుము.
    ఆయనే మనలను సృజించాడు.
    మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము.
కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి.
    స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి.
    ఆయనను గౌరవించండి. ఆయన నామాన్ని స్తుతించండి.
యెహోవా మంచివాడు.
    ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.
    ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు.

యెషయా 40:1-11

ఇశ్రాయేలు శిక్ష ముగుస్తుంది

40 మీ దేవుడు చెబుతున్నాడు,
“ఆదరించండి, నా ప్రజలను ఆదరించండి!
యెరూషలేముతో దయగా మాట్లాడండి.
    ‘నీ సేవాసమయం అయిపోయింది
    నీ పాపాలకు విలువ నీవు చెల్లించావు’ అని యెరూషలేముతో చెప్పండి
యెరూషలేము చేసిన ప్రతి పాపానికి రెండేసి సార్లు యెహోవా యెరూషలేమును శిక్షించాడు.”

వినండి! ఒక మనిషి గట్టిగా ఎడారిలో బోధిస్తున్న శబ్దం మీరు వినగలరు.
“యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి.
    ఎడారిలో మన దేవుని కోసం తిన్ననిదైన ఒక రాజమార్గాన్ని వేయండి.
ప్రతి లోయనూ పూడ్చండి
    ప్రతి పర్వతాన్ని కొండను చదును చేయండి.
వంకర మార్గాలను చక్కగా చేయండి.
    కరకు నేలను సమనేలగా చేయండి.
అప్పుడు యెహోవా మహిమ కనబడుతుంది
    మనుష్యులందరూ కలిసి యెహోవా మహిమను చూస్తారు.
సాక్షాత్తూ యెహోవాయే ఈ సంగతులు చెప్పాడు కనుక ఇది జరుగుతుంది.”

ఒక స్వరం పలికింది, “మాట్లాడు” అని.
    కనుక ఆ మనిషి అన్నాడు, “నేనేమి చెప్పను?”
ఆ స్వరం అంది, “ఇలా చెప్పు: మనుష్యులు అందరూ గడ్డిలా ఉన్నారు.
    మనుష్యుల మంచి తనం క్రొత్త గడ్డి పరకలా ఉంది.
యెహోవా నుండి ఒక బలమైన గాలి గడ్డిమీద వీస్తుంది.
    ఆ గడ్డి ఎండిపోయి, చస్తుంది.
    సత్యం ఏమిటంటే: మనుష్యులంతా గడ్డి.
గడ్డి చచ్చిపోయి ఎండిపోతుంది.
    కానీ మన దేవుని మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.”

రక్షణః దేవుని శుభ వార్త

సీయోనూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది.
    ఎత్తయిన పర్వతం మీదకు ఎక్కి గట్టిగా ప్రకటించు.
యెరూషలేమూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది.
    భయపడవద్దు. గట్టిగా మాట్లాడు.
యూదా పట్టణాలన్నింటికి ఈ విషయాలు చెప్పు:
    “చూడు, ఇదిగో మీ దేవుడు!
10 చూడు, యెహోవా, నా ప్రభువు శక్తితో వస్తున్నాడు.
    మనుష్యులందరినీ పాలించుటకు ఆయన తన శక్తిని ప్రయోగిస్తాడు.
యెహోవా తన ప్రజలకు ప్రతిఫలం తెస్తాడు.
    వారి జీతం యెహోవా దగ్గర ఉంది.
11 గొర్రెల కాపరి తన గొర్రెలను నడిపించినట్టు యెహోవా తన ప్రజలను నడిపిస్తాడు.
    యెహోవా తన హస్తాన్ని (శక్తిని) ఉపయోగించి తన గొర్రెలను ఒక చోట చేరుస్తాడు.
    గొర్రెపిల్లలను యెహోవా పట్టుకొని వాటిని ఆయన తన చేతుల్లో ఎత్తుకొంటాడు. వాటి తల్లులు ఆయన చెంత నడుస్తాయి.”

ప్రకటన 22:1-9

22 ఆ తర్వాత ఆ దేవదూత స్పటికంలా స్వచ్ఛంగా ఉన్న నదిని నాకు చూపాడు. దానిలో జీవజలం ఉంది. ఆ నది దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల కూర్చున్న సింహాసనం నుండి మొదలై, పట్టణంలోని గొప్ప వీధి మధ్యనుండి పారుతూ ఉంది. ఆ నదికి యిరువైపులా జీవ వృక్షం ఉంది. ఆ వృక్షానికి పన్నెండు కాపులు కాస్తాయి. ప్రతి నెలా ఆ వృక్షం ఫలాలనిస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను నయం చేయటానికి ఉపయోగింపబడుతాయి.

ఇక మీదట ఏ శాపం ఉండదు. దేవునికి మరియు గొఱ్ఱెపిల్లకు చెందిన సింహాసనం పట్టణంలో ఉంటుంది. ఆయన భక్తులు ఆయనకు సేవ చేస్తారు. వాళ్ళు ఆయన ముఖం చూస్తారు. ఆయన పేరు వాళ్ళ నొసళ్ళపై ఉంటుంది. ఇక మీదట చీకటి ఉండదు. ప్రభువైన దేవుడు వాళ్ళకు వెలుగునిస్తాడు. కనుక వాళ్ళకు దీపపు వెలుగు కాని, సూర్యుని వెలుగు కాని అవసరం ఉండదు. వాళ్ళు చిరకాలం రాజ్యం చేస్తారు.

ఆ దూత నాతో, “ఇవి నమ్మదగినవి, నిజమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలోనే జరుగనున్న వాటిని తన సేవకులకు చూపించటానికి తన దూతను పంపాడు. ‘చూడు! నేను త్వరలోనే రాబోతున్నాను. ఈ గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్కును ఆచరించే వాడు ధన్యుడు’” అని అన్నాడు.

యోహాను అనబడే నేను ఈ విషయం చూసాను. నేను అవి విని, చూసినప్పుడు నాకు యివి చూపిస్తున్న దూతను ఆరాధించటానికి అతని కాళ్ళమీద పడ్డాను. కాని అతడు నాతో, “నేను నీ తోటి సేవకుణ్ణి, నీ సోదరులతో, ప్రవక్తలతో, ఈ గ్రంథంలో ఉన్న సందేశాలు ఆచరించేవాళ్ళతో కలిసి సేవ చేసేవాణ్ణి. నన్ను ఆరాధించకు. దేవుణ్ణి ఆరాధించు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International