Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 83:1-4

ఆసాపు స్తుతి గీతం.

83 దేవా, మౌనంగా ఉండవద్దు!
    నీ చెవులు మూసికోవద్దు!
    దేవా, దయచేసి ఊరుకోవద్దు.
దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు.
    నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు.
నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు.
    నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.
“ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము.
    అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబుతున్నారు.

కీర్తనలు. 83:9-10

దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది దగ్గర సీసెరాను,
    యాబీనును నీవు ఓడించినట్టు శత్రువును ఓడించుము.
10 ఫన్దోరు వద్ద నీవు వారిని ఓడించావు.
    వారి దేహాలు నేల మీద కుళ్లిపోయాయి.

కీర్తనలు. 83:17-18

17 దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గుపడునట్లు చేయుము.
    వారిని అవమానించి, నాశనం చేయుము.
18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
    నీ పేరు యెహోవా అని వారు తెలుసుకొంటారు.
నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు
    అని వారు తెలుసుకొంటారు.

ఎస్తేరు 7

హామాను ఉరితీయ బడుట

మహారాజూ, హామానూ మహారాణి ఎస్తేరు విందుకి వెళ్లారు. విందు రెండోరోజున వాళ్లు ద్రాక్షారసం సేవిస్తూవుండగా మహారాజు ఎస్తేరును మరల ఇలా అడిగాడు: “మహారాణి ఎస్తేరూ, నీకేం కావాలి? నువ్వేమి కోరుకున్నా సరే, దాన్ని నీకు ఇస్తాను. నీ కోరిక ఏమిటి? నీకు ఏదైనా సరే, చివరకు అర్ధ రాజ్యమైనా సరే ఇస్తాను.”

అప్పుడు మహారాణి ఎస్తేరు ఇలా సమాధానం యిచ్చింది: “మహారాజా, మీకు నేనంటే ఇష్టంవుంటే, మీరు నన్ను అనుగ్రహిస్తే, నాకూ, నా ప్రజలకీ కూడా ప్రాణదానం చెయ్యండి! నేను కోరుకొనేది అంత మాత్రమే. ఎందుకంటే నాశనం చేయబడేందుకు, చంపివేయబడేందుకు, నిర్మూలించబడేందుకు నేనూ, నా ప్రజలూ అమ్మివేయబడ్డాం. మేము కేవలం బానిసలుగా అమ్మివేయబడివుంటే, నేను ఊరక ఉండి పోదును. ఎందుకంటే, అది మహారాజును విసిగించవలసినంతటి సమస్య అయ్యుండేది కాదు.”

మహారాజు అహష్వేరోషు మహారాణి ఎస్తేరును ఇలా ప్రశ్నించాడు: “మీ విషయంలో ఇలా చేసింది ఎవరు? నీ ప్రజలకు ఇలా చేయ సాహసించిన వ్యక్తి ఎవరు?”

“మాకు విరోధి, శత్రువు దుర్మార్గుడైన ఈ హామానే” అని జవాబిచ్చింది ఎస్తేరు.

దానితో, మహారాజు ముందు నిలబడ్డ హామాను భయ భీతుడయ్యాడు. మహారాజుకి పట్టరాని కోపం వచ్చింది. ఆయన లేచి నిలబడ్డాడు. ద్రాక్షాసారా అక్కడే వదిలేసి, బయటి తోటలోకి వెళ్లాడు. కాని, హామాను మహారాణిని క్షమాభిక్ష వేడుకునేందుకు అక్కడే నిలిచిపోయాడు. అప్పటికే మహారాజు తనని చంపి వేయాలని నిర్ణయించుకున్నట్లు హామాను గ్రహించినందువల్లనే, మహారాణి ఎస్తేరును క్షమాభిక్ష అడుక్కునేందుకు అక్కడ ఉండి పోయాడు. సరిగ్గా తోటనుంచి విందుశాలకి వస్తూన్నప్పుడే ఎస్తేరు వాలి కూర్చున్న శయ్యమీద హామాను పడుతూవుండటం మహారాజు కంటపడింది. మహారాజు కోపస్వరంతో, “నేనీ ఇంట్లో ఉండగానే నువ్వు మహారాణి మీద దాడి చేస్తున్నావా?” అని గర్జించాడు.

మహారాజు కేక వినగానే, సేవకులు లోనికి వచ్చి హామానుని పట్టుకున్నారు. మహారాజు సేవకుల్లో ఒకడి పేరు హార్బోనా. ఆ నపుంసకుడు మహారాజుతో ఇలా చెప్పాడు: “హామాను యింటి దగ్గర 75 అడుగల ఉరికంబం వుంది మహారాజా. దానిమీద మొర్దెకైని ఉరి తీయించేందుకు హామాను దాన్ని నిర్మింపజేశాడు. మిమ్మల్మి హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నప్పుడు, ఆ సమాచారాన్ని తెలియజేసి, మీకు సహాయపడినది యీ మొర్దెకైయేనండి.”

“హామానుని అదే ఉరికంబం మీద ఉరి తియ్యండి” అని ఆజ్ఞాపించాడు మహారాజు.

10 దానితో, మొర్దెకైని ఉరితీయించేందు కోసం హామాను నిర్మించిన ఉరికంబం మీదనే హామాను ఉరితీయబడ్డాడు.

మత్తయి 24:45-51

మంచి దాసుడు, చెడ్డ దాసుడు

(లూకా 12:41-48)

45 “విశ్వాసము, తెలివిగల ఒక సేవకుణ్ణి ఉదాహరణగా తీసుకోండి. అతని యజమాని అతణ్ణి తన యింట్లో పనిచేసే వాళ్ళకు సరియైన సమయంలో భోజనం పెట్టడానికి నియమించాడు. 46 యజమాని వచ్చినప్పుడు ఆ సేవకుడు తన యజమాని చెప్పినట్లు చేస్తూవుంటే ధన్యుడు. 47 నేను మీకు నిజం చెబుతున్నాను: యజమాని ఆ నౌకరును తనకున్న ఆస్తి అంతటిపై అధికారిగా నియమిస్తాడు.

48 “ఒక వేళ ఆ సేవకుడు దుర్మార్గుడైతే తనలో తాను ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని 49 తన తోటి పని వాళ్ళను కొట్టడం మొదలు పెడ్తాడు. అంతేకాక త్రాగుబోతులతో కలసి తిని, త్రాగుతాడు. 50 యజమాని తన సేవకుడు ఎదురు చూడని రోజు, అతనికి తెలియని ఘడియలో వచ్చి, 51 అతణ్ణి చంపించి పాపులతో సహా నరకంలో పడవేస్తాడు. ఆ నరకంలో వాళ్ళంతా ఏడుస్తూ పండ్లు కొరుకుతూ బాధననుభవిస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International