Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
128 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.
2 నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
3 ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
4 యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
5 యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తున్నాను.
నీవు నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
6 నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను.
ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.
6 యెరికో పట్టణం మూసివేయబడింది. ఇశ్రాయేలు ప్రజలు దగ్గర్లోనే ఉన్నందువల్ల ఆ పట్టణం లోని ప్రజలు భయపడ్డారు. ఎవరూ పట్టణంలోనికి గాని, బయటకు గాని వెళ్లలేదు.
2 అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: “చూడు, యెరికో పట్టణాన్ని నేను నీ స్వాధీనంలో ఉంచాను. దాని రాజు, పట్టణంలోని యుద్ధ వీరులు నీ స్వాధీనంలో ఉన్నారు. 3 నీ సైన్యంతో పట్టణం చుట్టూ రోజుకు ఒక్కసారి ప్రదక్షిణం చేయి. ఇలా ఆరు రోజులు చేయి. 4 పొట్టేలు కొమ్ములతో చేసిన బూరలు ఊదేందుకు ఏడుగురు యాజకులను నియమించుము. పవిత్ర పెట్టెకు ముందుగా నడువుమని యాజకులతో చెప్పు. ఏడో రోజున ఏడుసార్లు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఏడోరోజున వారు ముందడుగు వేయగానే బూరలు ఊదాలని యాజకులతో చెప్పు. 5 యాజకులు బూరలతో పెద్ద శబ్దం చేయాలి. ఆ శబ్దం నీవు వినగానే ప్రజలందర్నీ కేకలు వేయమని చెప్పు. మీరు ఇలా చేయగానే పట్టణం యొక్క గోడలు కూలిపోతాయి. అప్పుడు మీ ప్రజలు సరాసరి పట్టణం లోనికి వెళ్లిపోవాలి.”
యెరికోతో యుద్ధం
6 కనుక నూను కుమారుడైన యెహోషువ యాజకులందర్నీ సమావేశపర్చాడు. “యెహోవా పవిత్ర పెట్టెను మోయండి. ఏడుగురు యాజకులు బూరలు మోయాలని చెప్పండి. ఆ యాజకులు పవిత్ర పెట్టెకు ముందుగా నడవాలి” అని యెహోషువ వారితో చెప్పాడు.
7 “ఇప్పుడు బయల్దేరండి. పట్టణం చుట్టూ నడవండి. ఆయుధాలు ధరించిన సైనికులు యెహోవా పవిత్ర పెట్టె ఎదుట నడవాలి” అని యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించాడు.
8 యెహోషువ ప్రజలతో మాట్లాడటం ముగించగానే, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని నడవటం మొదలుబెట్టారు. ఏడు బూరలను వారు మోసుకొని వెళ్లారు. వారు నడుస్తూ ఉన్నప్పుడు బూరలు ఊదారు. యెహోవా పవిత్ర పెట్టెను మోసే వారు వారి వెనుక నడిచారు. 9 ఆయుధాలు ధరించిన సైనికులు యాజకులకు ముందుగా నడిచారు. పవిత్ర పెట్టె వెనుక నడుస్తున్నవాళ్లు బూరలు ఊదారు. 10 అయితే యుద్ధనాదం చేయవద్దని యెహోషువ ప్రజలతో చెప్పాడు. “కేకలు వేయకండి. నేను మీతో చెప్పే రోజు వరకు ఒక్క మాటకూడ పలుకకండి. తరువాత మీరు కేకలు వేయవచ్చు” అన్నాడు యోహోషువ.
11 కనుక యెహోవా పవిత్ర పెట్టెను పట్టణంచుట్టూ ఒక్కసారి యాజకులచేత యెహోషువ మోయించాడు. తర్వాత వారు వారి బసకు వెళ్లి ఆ రాత్రి అక్కడే గడిపారు.
12 మర్నాటి ఉదయాన్నే యెహోషువ లేచాడు. యాజకులు యెహోవా పవిత్ర పెట్టెను మరలా మోసారు. 13 మరియు యాజకులు ఏడుగురు ఏడు బూరలు మోసారు. యెహోవా పవిత్ర పెట్టె ఎదుట వారు నడుస్తూ బూరలు ఊదారు. ఆయుధాలు ధరించిన సైనికులు వారికి ముందుగా నడిచారు. యెహోవా పవిత్ర పెట్టె వెనుక నడిచే యాజకులు నడుస్తూ, బూరలు ఊదారు. 14 కనుక రెండో రోజున వాళ్లంతా పట్టణం చుట్టూ ఒక మారు ప్రదక్షిణం చేసారు. ఆ తర్వాత వాళ్లు తిరిగి వారి బసకు వెళ్లిపోయారు. ఆరు రోజులపాటు వారు ఇలానే ప్రతిరోజూ చేసారు.
15 ఏడో రోజు సూర్యోదయాన్నే వారు మేల్కొన్నారు. వారు పట్టణం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణాలు చేసారు. అంతకు ముందు రోజులలో నడచినట్టే నడిచారు, కాని ఆ రోజు పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు. 16 పట్టణం చుట్టూ వారు ఏడోసారి తిరుగగానే, యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడే యెహోషువ ఆజ్ఞ యిచ్చాడు: “ఇప్పుడు కేకలు వేయండి! యెహోవా ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు!
20 యాజకులు బూరలు ఊదారు. ప్రజలు బూరలువిని కేకలు వేయటం మొదలుబెట్టారు. గోడలు కూలి పోయాయి. ప్రజలు ఏకంగా పట్టణంలో జొరబడి పోయారు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని ఓడించేసారు.
బర్నబాను, సౌలును ఎన్నుకొని పంపటం
13 అంతియొకయలోని సంఘంలో ఉన్న ప్రవక్తలు, పండితులు ఎవరనగా: బర్నబా, “నీగెరు” అని పిలువబడే “సుమెయోను”, కురేనీ గ్రామానికి చెందిన లూకియ, మనయేను, (ఇతడు, సామంత రాజైన హేరోదు, యిద్దరూ కలిసి పెరిగారు), మరియు సౌలు. 2 వీళ్ళు ఉపవాసాలు చేసి ప్రభువును ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ, “బర్నబాను, సౌలును నా కోసం వేరుచేయండి. వాళ్ళను ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచాను” అని అన్నాడు.
3 అక్కడున్నవాళ్ళు వీళ్ళిద్దర్ని పంపే ముందు ప్రార్థనలు, ఉపవాసాలు చేసి, వాళ్ళపై తమ చేతులుంచి పంపారు.
సైప్రసులో
4 పవిత్రాత్మ వాళ్ళను పంపాడు. వాళ్ళు “సెలూకయ” అనే పట్టణానికి వెళ్ళి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసి సైప్రసు (కుప్ర) అనే ద్వీపాన్ని చేరుకున్నారు. 5 అక్కడినుండి సలామి అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడున్న యూదుల సమాజ మందిరాల్లో దైవసందేశాన్ని ప్రకటించారు. వాళ్ళకు సహాయంగా యోహాను వాళ్ళ వెంటే ఉన్నాడు.
6 వాళ్ళు ఆ ద్వీపాన్నంతా పర్యటించి “పాఫు” అనే పట్టణం చేరుకున్నారు. మాయాజాలం చేస్తూ తానొక ప్రవక్తనని చెప్పుకుంటున్న వ్యక్తిని అక్కడ కలుసుకున్నారు. అతడు యూదుడు. పేరు “బర్ యేసు,” 7 అతడు “సెర్గి పౌలు” అనే రాష్ట్రపాలకునికి సన్నిహితంగా ఉండేవాడు. సెర్గి పౌలు తెలివిగలవాడు. దైవసందేశాన్ని వినాలని బర్నబాను, సౌలును ఆహ్వానించాడు. 8 ఎలుమ రాష్ట్రపాలకుణ్ణి ఈ విశ్వాసానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించాడు. “ఎలుమ” అనగా గ్రీకు భాషలో మాయాజాలకుడు. 9 అప్పుడు సౌలు (ఇతణ్ణి పౌలు అని కూడా పిలిచే వారు) పరిశుద్ధాత్మతో నిండిపోయి ఎలుమను సూటిగా చూస్తూ, 10 “నీవు సాతానుకు పుట్టావు! మంచిదన్న ప్రతిదీ నీకు శత్రువు! నీలో అన్ని రకాల మోసాలు, కుట్రలు ఉన్నాయి! ప్రభువు యొక్క సక్రమ మార్గాల్ని వక్రంగా మార్చటం ఎప్పుడు మానుకొంటావు? 11 ఇదిగో చూడు, ప్రభువు ఇప్పుడు నిన్ను శిక్షిస్తాడు. కొంతకాలం దాకా నీవు సూర్యుని వెలుగు చూడలేవు! గ్రుడ్డివాడివై పోతావు!” అని అన్నాడు.
తక్షణమే పొగమంచు, చీకట్లు అతణ్ణి చుట్టివేసాయి. తన చేయి పట్టుకొని నడిపేందుకు ఎవరైనా దొరుకుతారేమోనని తారాడుతూ చూసాడు. 12 ఆ రాష్ట్రపాలకుడు ప్రభువును గురించి చెప్పిన బోధలు విని ఆశ్చర్యపడి ప్రభువును నమ్మాడు.
© 1997 Bible League International